చెట్టు నరికించిన వ్యక్తికి రూ.62వేల జరిమానా వేయించిన ఎనిమిదో తరగతి విద్యార్థి...
Tree Cut down Person: నాలుగు దశాబ్దాలకు పైగా ఉంటున్న చెట్టును నరికేసిన వ్యక్తిని ఎనిమిదో తరగతి చదివే వ్యక్తి పట్టించాడు. ఎటువంటి అనుమతులు లేకుండా చెట్టును నరికేస్తున్నారంటూ అధికారులకు సమాచారం ఇచ్చి రూ.62వేల 75జరిమానా విధించేలా చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టిన హరితహారం కార్యక్రమానికి.. కవచంగా గ్రీన్ బ్రిగేడియర్లు నిలబడుతున్నారు. చెట్టును పెంచడమే కాకుండా.. దాని సంరక్షణ బాధ్యతలు స్వచ్ఛందంగా తీసుకుంటున్నారు.
ఇటీవలే హైదరాబాద్‌లోని సైదాబాద్ వైశాలినగర్కు చెందిన సంతోష్‌రెడ్డి జీ అనే వ్యక్తి కొత్త ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించాడు. అతనికి చెందిన స్థలంలో 40 సంవత్సరాలుగా ఓ వేపచెట్టు పెరిగింది.
తన ఇంటి నిర్మాణానికి అడ్డు ఉండకూడదని రాత్రికిరాత్రే గుట్టుచప్పుడు కాకుండా నరికేయించాడు. అనుమానం వచ్చే లోపే నిర్మాణం మొదలైపోవాలనుకున్నాడేమో.. చెట్టు కలపను కూడా ఇతర ప్రదేశానికి తరలించేశాడు. ఇదంతా అదే కాలనీకి చెందిన ఎమినిదో తరగతి విద్యార్థి.. గమనించాడు. వెంటనే అటవీశాఖ టోల్‌ఫ్రీ నంబర్ 1800 4255364కు ఫోన్‌చేశాడు.
తాను గ్రీన్ బ్రిగేడియర్‌ను అని పరిచయం చేసుకొని.. తమ కాలనీలో పెద్ద చెట్టును కొట్టేసిన వ్యక్తిపై చర్య తీసుకోవాలని ఫిర్యాదుచేశాడు. స్పందించిన అటవీశాఖ అధికారులు వైశాలినగర్కు వచ్చి విచారణ జరిపారు. అనుమతి లేకుండా చెట్టును కొట్టివేసినట్టు నిర్ధారణ కావడంతో బాధ్యుడైన ఇంటి యజమానిపై రూ.62వేల 75 జరిమానా విధించారు.
0 comments:
Post a comment