👏 ఫ్లాష్: ఉపాధ్యాయ సంఘాలకూ ప్రభుత్వం పిలుపు! సాయంత్రం 5 గంటలకు భేటి
ఒక్కో ఉద్యోగ సంఘానికి 5అంశాలకు అవకాశం ?
-ఎజెండా నిర్దేశించిన ప్రభుత్వ పెద్దలు - ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలోనే భేటీ - సాయంత్రం 5 గంటలకు సచివాలయంలో...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఉద్యోగ సంఘాలతో గురువారం సాగిస్తున్న చర్చల్లో ఒక్కో ఉద్యోగ సంఘానికి 5 డిమాండ్లు తెర మీదకు తెచ్చేందుకు అవకాశం ఇచ్చారు. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి ఆఫీసు నుంచి సమావేశానికి ఆహ్వానం అందుకున్నప్పుడే అయిదు ప్రధాన అంశాలు ఎంచుకుని సమావేశంలో చర్చించి పరిష్కరించుకుందామనే ప్రతిపాదన వచ్చింది. ఈ సమావేశానికి నాలుగు ప్రధాన సంఘాలను పిలిచారు. మరో వైపు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో సభ్యత్వం ఉన్న ఉపాధ్యాయ సంఘాలను కూడా సమావేశానికి ఆహ్వానించాలని ఆ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సాధారణ పరిస్థితుల్లో నాలుగు సంఘాల ప్రాధాన్యాల్లో కనీసం మూడు తొలి ప్రాధాన్యాలు ఒకటే ఉండే అవకాశం ఉంది. చాలా మంది పీఆర్సీ, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సీపీఎస్ రద్దు వంటి తొలి మూడు ప్రాధాన్యాలుగా పేర్కొంటున్నారు. అన్ని సంఘాలు ఒక అవగాహనకు వచ్చి 20 వేర్వేరు అంశాలను ప్రభుత్వం ముందు చర్చకు పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ర్టంలో ఉన్న కొన్ని సంఘాలు పోటీ వాతావరణంలోనే ముందుకు సాగుతున్నాయి తప్ప సంయుక్త కార్యాచరణ దిశగా అడుగులు వేయడం లేదు. పీఆర్సీ వంటి కీలక అంశాల్లో, ఉద్యోగులకు ప్రయోజనం కల్పించే ఇతర అంశాల్లోను అన్ని సంఘాల సంయుక్త కార్యాచరణ ఒక్కటే సరైన పరిష్కారమని ఉద్యోగుల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని సంఘాల కామన్ ప్రాధాన్యాలు, వ్యక్తిగత ప్రాధాన్యాలు కలిసి 10 అంశాల వరకు చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యం వహిస్తారు. అధికార వ్యవస్థ పరంగా ప్రభుత్వంలో ఆయనే పెద్ద. అన్ని ప్రభుత్వశాఖల ముఖ్య కార్యదర్శులను, శాఖాధిపతులను కూడా నిర్దేశించగల అధికార స్థాయిలో ఆయన ఉన్నారు. పూర్తిగా ప్రభుత్వం తన విధాన పరంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అంశాలు తప్ప మిగిలిన వాటిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఉద్యోగ సంఘాలు హేతుబద్ధంగా ఒప్పించగలిగితే చాలా అంశాలను పరిష్కార బాట పట్టించగలిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగ సంఘాల నేతల వ్యూహాత్మక అడుగులే ఇలాంటి సందర్భంలో ఉద్యోగులకు మేలు చేస్తాయి. నాయకత్వ పటిమకు ఇలాంటి సందర్భాలే పెద్ద ఉదాహరణగా నిలుస్తాయి. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఒక మామూలు విషయంగా మిగులుస్తారా? లేక ఒక సానుకూల అవకాశంగా మలచుకుంటారా అన్నది చూడాలి.
0 comments:
Post a comment