🔳ఆ 40మంది ఎంపీడీవోలపై చర్యలు వద్దు
ఎస్ఈసీకి ఏపీ జేఏసీ అమరావతి వినతి
ఈనాడు డిజిటల్, అమరావతి: ఏకగ్రీవాల విషయంలో రాష్ట్రంలో 40 మంది ఎంపీడీవోలపై చర్యలు తీసుకున్న ఎస్ఈసీ వాటిపై పునరాలోచించాలని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు, సెక్రటరీ జనరల్ వైవీ రావులు కోరారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ఉద్యోగులకు కనీస సౌకర్యాలు, రక్షణ, భద్రత విషయంలో తగు చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ రమేశ్ కుమార్ను వారు కోరారు. ఉద్యోగ సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన వారు ఈ మేరకు వినతిపత్రం అందించారు. ‘‘ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి రవాణా, భోజనం, వసతి వంటి కనీస సౌకర్యాలు, కొవిడ్ నుంచి రక్షణ కల్పించాలి. ఎన్నికల ప్రక్రియలో జరిగే చిన్న చిన్న పొరపాట్లకు అధికారులపై తీవ్రమైన చర్యలు తీసుకోకూడదు. రాజకీయ పార్టీల ప్రభావంతో ఎకగ్రీవాల విషయంలో దాదాపు నలభై మంది ఎంపీడీవోలను బాధ్యుల్ని చేస్తూ ఎస్ఈసీ వారిపై చర్యలు తీసుకుంది. వారు ఎలాంటి తప్పూ చేయలేదని, ప్రధానంగా చిత్తూరు, గుంటూరు కలెక్టర్లు నివేదికలు ఇచ్చినందున చర్యలపై పునరాలోచించాలి. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేటప్పటికీ అదే రోజు అర్ధరాత్రి దాటే పరిస్థితి ఉన్నందున మరుసటి రోజు కూడా వారిని ఆన్ డ్యూటీగా పరిగణించాలి’’ అని వినతి పత్రంలో కోరినట్లు వారు తెలిపారు
0 comments:
Post a comment