బీమా ఉంటే ధీమా ఉంటుంది. మనకేమైనా జరిగితే మనకూ లేక మన కుటుంబానికి బీమా ధీమా ఇస్తుందనే భరోసా వినియోగదారులకు కల్పించడమే ఇన్సూరెన్స్ యొక్క మొదటి ఉద్దేశ్యం. వాహనదారులు సైతం ఇందుకోసమే బీమా తీసుకుంటుంటారు. మోటార్ వెహికల్ చట్టం నిబంధనలు మరింత కట్టుదిట్టం చేయడంతో తమ వాహనానికి ఇన్సూరెన్స్ తీసుకోవడానికి చాలామంది ముందుకొస్తున్నారు. అయితే తక్కువ ధరకు ఎవరు ఇన్సూరెన్స్ ఇస్తే.. వారి దగ్గర తమ వాహనానికి ఇన్సూరెన్స్ తీసుకోవడానికి కొందరు ఆసక్తి చూపిస్తున్నారు. తక్కువ ధరకు ఇన్సూరెన్స్ కావాలని కోరుకోవడంలో తప్పు లేదు కానీ.. ఇలాంటి వాటి విషయంలో అతిగా ఆశపడితే మాత్రం మొదటికే మోసం వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వివిధ కంపెనీలకు సంబంధించిన నకిలీ వెహికల్ ఇన్సూరెన్స్ కాపీలను తయారు చేస్తున్న 11 మంది ముఠా సభ్యులను సైబరాబాద్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
అరెస్టయిన సభ్యుల్లో పొల్యూషన్ వెహికల్ నిర్వాహకుడు రమేష్ ప్రధాన సూత్రధారుడిగా ఉన్నట్టు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. నిందితుడు ఆర్టీఓ కార్యాలయం దగ్గర పొల్యూషన్ వెహికల్‌ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రమేష్‌తో పాటు మరో 10 మంది ముఠా సభ్యులను అరెస్టు చేశామని వెల్లడించారు. ఈ ముఠా సభ్యుల నుంచి 1125 ఫేక్ వెహికిల్ ఇన్సూరెన్స్ పాలసీ లెటర్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ఇలాంటి వాటిని ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. వివిధ కంపెనీలకు చెందిన స్టాంపులు, ప్రింటర్లు సీజ్ చేశామని వివరించారు. వాహనదారులు తక్కువ ధరకు పాలసీ అంటే మోసపోవద్దని సూచించారు. పాలసీ తీసుకున్న తరువాత కంపెనీకి సంబంధించి వెబ్ సైట్లకు వెళ్లి తమ పాలసీ వివరాలు ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని సజ్జనార్ సూచించారు. లేకపోతే పాలసీ లేకుండా పోయి ఆ తరువాత ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు.
0 Comments:
Post a Comment