ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి సహకరించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించినప్పటికీ సర్కారు దాన్ని పట్టించుకోవడం లేదని, తద్వారా కోర్టు ధిక్కరణకు పాల్పడిందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో అప్పటి చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, పంచాయతీ రాజ్ శాఖ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీల పేర్లను కమిషన్ తమ పిటిషన్లో చేర్చింది. అయితే, ఇప్పుడు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ను ప్రతివాదిగా చేసేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.
దీనిపై విచారణ సోమవారానికి వాయిదా పడింది.
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎస్ఈసీ నిమ్మగడ్డ, ఏపీ ప్రభుత్వం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎవరిక వారు తమ పంతం నెగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఒకరు ఒక ఎత్తు వేస్తే, మరొకరు దాన్ని చిత్తు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే వారి మధ్య పలుమార్లు కోర్టుల్లో వాదనలు జరిగాయి. తాజాగా, ఈ వివాదం మరోసారి హైకోర్టుకు చేరింది. పంచాయతీ ఎన్నికల విషయంలో సుప్రీంకోర్టు వరకు వెళ్లి అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో ఎలక్షన్లకు అంగీకరించింది వైసీపీ. పంచాయతీల్లో ఏకగ్రీవాలు చేస్తే ప్రోత్సాహకాలు ఇస్తామంటూ జారీ చేసిన ప్రకటనను నిమ్మగడ్డ తప్పుపట్టారు. అలాగే, సీఎంఓను టార్గెట్ చేసిన ఆయన సీనియర్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని తప్పించాలంటూ చీఫ్ సెక్రటరీకి, గవర్నర్కు లేఖలు రాశారు. ఎస్ఈసీ ఆరోపణలపై ప్రవీణ్ ప్రకాష్ వివరణ
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన ఆరోపణలపై సీఎస్ అదిత్యనాధ్ దాస్ కు సీఎంఓ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వివరణ ఇచ్చారు. జనవరి 25న నిమ్మగడ్డ పంపిన లేఖ కు 26న వివరణ ఇచ్చానని ప్రవీణ్ ప్రకాష్ చెప్పారు. హైకోర్ట్ స్టేటస్ కో ఉన్నందున కలెక్టర్స్, ఎస్పీ ల సమావేశానికి తాను హాజరు కాలేదని వివరణ ఇచ్చారు. గతంలో ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం చేసిన బదిలీలు ముగిసిన అధ్యాయం అని ప్రవీణ్ ప్రకాష్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణల పై వివరణ ఇస్తున్నా అని, తన తప్పుంటే చర్యలు తీసుకోవాలని ప్రవీణ్ ప్రకాష్ స్పష్టం చేశారు.
0 comments:
Post a comment