Nimmagadda Ramesh Kumar: ఏపీ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనంలో నిమ్మగడ్డ పిటిషన్.. విచారణ ప్రారంభమయిన కొద్ది క్షణాల్లోనే..
ఏపీలో పంచాయతీ ఎన్నికల వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేసినప్పటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మరో వైపు ఎన్నికలు నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా లేదని వైసీపీ సర్కారు మొదట్లోనే తేల్చిచెప్పింది. ఈ రెండు శాఖల మధ్య ఘర్షణపూరిత వాతావరణానికి సోమవారం హైకోర్టు తెరదించింది. ఏపీలో ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించొద్దని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఎన్నికల నోటిఫికేషన్ ను కూడా రద్దు చేసింది. దీనిపై ప్రభుత్వ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తుండగా, ఎస్ఈసీ మాత్రం తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేయాలని నిర్ణయించింది.
దీంతో వెంటనే డివిజన్ బెంచ్ లో హౌస్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేసింది.
తాజాగా ఎస్ఈసీ హైకోర్టు డివిజన్ బెంచ్ లో వేసిన ఈ పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చింది. ఎస్ఈసీ పిటిషన్ ను విచారణకు త్రిసభ్య ధర్మాసనం విచారణకు స్వీకరించింది. అయితే వాదనలు ప్రారంభమయిన కొద్ది క్షణాల్లోనే విచారణ వాయిదా పడింది. ఈ మంగళవారం మధ్యాహ్నం మళ్లీ ఈ పిటిషన్ పై వాదనలు జరగనున్నాయి. మరో వైపు గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్‌తో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ అయ్యారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు, తాజా పరిణామాలపై చర్చించారు. ఏ ఉద్దేశ్యంతో తాను నోటిఫికేషన్ ఇచ్చాననే విషయాన్ని గవర్నర్ దృష్టికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకెళ్లారు. హైకోర్టులో జరిగిన పరిణామాలు, తీర్పుపై అప్పీల్ చేసిన విషయాలపై గవర్నర్‌కు వివరించారు. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో విజయసాయి రెడ్డి చేసిన కామెంట్లను కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.దాదాపు అర్ధగంట పాటు గవర్నర్ తో నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గవర్నర్ కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిర్యాదు చేశారని వార్తలు వస్తున్నాయి. ఎస్ఈసీలోని ఉద్యోగులను ప్రభుత్వం ప్రభావితం చేస్తోందని ఈ సందర్భంగా ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. తాజాగా ఎస్ఈసీ జాయింట్ డైరెక్టర్ నెల రోజుల పాటు సెలవుపై వెళ్లిన విషయాన్ని గవర్నర్ దృష్టికి నిమ్మగడ్డ తీసుకెళ్లారు. వివిధ ఉద్యోగ సంఘాలు బహిరంగంగానే ఎన్నికల నిర్వహణకు సహకరించబోమంటూ మీడియా సమావేశాలు పెట్టిన విషయాన్ని కూడా గవర్నర్ దృష్టికి రమేష్ కుమార్ తీసుకెళ్లారు. మొత్తానికి ఏపీ పంచాయతీ ఎన్నికల వ్యవహారం ఎన్ని మలుపులు తీసుకుంటుందోనని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇవ్వబోయే తీర్పుపై అన్ని పార్టీలు ఆసక్తి కనపరుస్తున్నాయి.
0 comments:
Post a comment