Nimmagadda Ramesh Kumar: దూకుడు పెంచిన నిమ్మగడ్డ.. ఏపీ సీఎస్ కు మరో లేఖ రాసిన ఎన్నికల కమిషనర్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడు పెంచారు. ఫిబ్రవరి నెలలో నాలుగు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని శుక్రవారం ప్రకటించిన ఆయన, తాజాగా శనివారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఓ ప్రత్యేక లేఖను రాశారు. ఎన్నికలు నిర్వహించే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదని చెబుతున్నా, నిమ్మగడ్డ మాత్రం, పంచాయతీ ఎన్నికలు జరిపి తీరాలన్న రీతిలో ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల నిర్వహణలో పాటించాల్సిన కీలక నియమాలను ఒక్కొక్కటిగా పాటిస్తూ పోతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి గురించి కీలక విషయాలను వెల్లడిస్తూ ప్రధాన కార్యదర్శికి లేఖను రాశారు.
ప్రవర్తనా నియామవళి గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు.
పట్టణ, నగర ప్రాంతాలలో ఎన్నికల ప్రవర్తనా నియామళి అమలులో ఉండదని తేల్చిచెప్పారు. అదే సమయంలో పట్టణ ప్రాంతంలో సభలు నిర్వహించి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు లబ్ధి చేకూర్చే పనులు చేపట్టవద్దని ప్రభుత్వానికి సూచనలు చేశారు. ఇటువంటి చర్యలు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు అవుతుందన్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వ సహకారం కావాలని మరోసారి లేఖలో నిమ్మగడ్డ కోరారు.
మరి ఈ లేఖకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచిచూడాలి..కాగా శుక్రవారం ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం నాలుగు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 5న మొదటి దఫా, ఫిబ్రవరి 9న రెండో దఫా, ఫిబ్రవరి 13న మూడో దఫా, ఫిబ్రవరి 17న నాలుగో దఫా ఎన్నికలు జరుగుతాయి. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత 4 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది.
అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు. ఇదిలా ఉండగా ఏపీలో గతేడాది నిర్వహించాల్సిన పంచాయతీ ఎన్నికలు కరోనా వల్ల ఆగిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై అప్పట్టో వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. తాజాగా ఎన్నికల నిర్వహణను అధికారంలో ఉన్న వైసీపీ సర్కారు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదనీ, కరోనా టీకా విధుల్లో సిబ్బంది ఉంటారని ప్రభుత్వం స్పష్టం చేసింది.
0 comments:
Post a comment