Napping: మధ్యాహ్నం నిద్రపోతే ఎన్నో లాభాలు.. ఇది తెలిస్తే ఆఫీసులో కూడా పడుకోమంటారేమో..
ఆరోగ్యంగా ఉండాలంటే కంటి నిద్రా నిద్రపోవాలి. మనిషి శారీరక, మానసిక ఆరోగ్యానికి నిద్రకు సంబంధం ఉందని ఎన్నో పరిశోధనల్లో తేలింది. ఆరోగ్యకరమైన జీవనశైలిలో నిద్ర గంటలు ఒకేలా ఉండేలా జాగ్రత్తపడాలి. రోజూ కనీసం 6-8 గంటలు నిద్రపోయే వారికి మానసిక సమస్యలు ఎదురయ్యే అవకాశం చాలా తక్కువని నిపుణులు చెబుతున్నారు. మధ్యాహ్నం కాసేపు కునుకు తీస్తే మెదడు చురుగ్గా ఉంటుందని కొత్త అధ్యయనం వెల్లడించింది. ఇటీవల జనరల్ సైకియాట్రీ జర్నల్‌లో దీన్ని ప్రచురించారు. అధ్యయనం కోసం మధ్యాహ్నం పూట కునుకు తీసే అలవాట్లు ఉన్న 2,214 మంది చైనీయులపై పరిశోధన చేశారు. వీరంతా 60, అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారే. మధ్యాహ్నం కాసేపు కునుకు తీయని వారితో పోలిస్తే, న్యాప్ అలవాటు ఉన్నవారు మానసికంగా చురుగ్గా ఉన్నారని నిపుణులు తేల్చారు.
మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత ఐదు నిమిషాల నుంచి రెండు గంటల వరకు విశ్రాంతి తీసుకుంటూ నిద్రపోవడాన్ని న్యాప్ లేదా కునుకు తీయడం అంటారు.
ఈ పరిశోధనల్లో పాల్గొన్నవారిని రెండు కేటగిరీలుగా విభజించారు. రోజూ కాసేపు కునుకు తీసేవారిని ఒక గ్రూపులో, ఆ అలవాటు లేని వారిని మరో గ్రూపులో ఉంచారు. వారికి మినీ మెంటల్ స్టేట్ ఎగ్జామినేషన్, మాంట్రియల్ కాగ్నిటివ్ అసెస్మెంట్ వంటి పరీక్షలు నిర్వహించారు. ఇవి రెండూ జ్ఞాపకశక్తి, భాష, ఇతర అభిజ్ఞా సామర్థ్యాలకు సంబంధించిన పరీక్షలు. వీటి ఫలితాలు వృద్ధుల మానసిక సామర్థ్యాలపై సానుకూల ప్రభావం చూపాయని అధ్యయన బృంద సభ్యుడు, సైకియాట్రిస్ట్ కాయ్ హాన్ తెలిపారు. ఈ పరీక్షల్లో న్యాప్ తీసే అలవాటు ఉన్నవారి గ్రూపు సగటు గణాంకాలు రెండో గ్రూపుతో పోలిస్తే మెరుగ్గా వచ్చాయి. మెంటల్, కాగ్నిటివ్ ఫంక్షన్స్‌కు న్యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని అధ్యయనం పేర్కొంది. అందువల్ల వృద్ధులు న్యాప్ తీసే అలవాటును తాము ప్రోత్సహిస్తామని హాన్ చెప్పారు. కేవలం 60, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వృద్ధుల న్యాపింగ్ అలవాట్లను మాత్రమే ఈ పరిశోధనలో పరిగణనలోకి తీసుకున్నారు. యువత నిద్ర అలవాట్లను, ఇందుకు సంబంధించిన డేటాను సేకరించలేదు. అ౦దువల్ల ఈ పరిశోధనను అందరికీ అన్వయించలేమని రిసెర్చర్లు చెబుతున్నారు. నిద్ర అలవాట్లను ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. రోజువారీ అలవాట్లు, దినచర్య, మందుల వాడకం, పర్యావరణ పరిస్థితులు, జీవనశైలి, నిద్ర సంబంధ సమస్యలు వంటివన్నీ న్యాప్ సామర్థ్యంపై ప్రభావం చూపుతాయని అధ్యయనం పేర్కొంది.
అధ్యయనంలో పాల్గొన్నవారు ఎంత సమయం కునుకు తీస్తున్నారనేది లెక్కలోకి తీసుకోలేదు. కేవలం న్యాప్ ప్రయోజనాలను మాత్రమే అంచనా వేసినట్లు పరిశోధకులు తెలిపారు. వృద్ధుల ఆరోగ్యాన్ని న్యాపింగ్ అలవాట్లు మెరుగుపరిచే అవకాశం ఉంది. కానీ కేవలం రాత్రివేళ నిద్ర పట్టనివారు, ఇతర నిద్రలేమి సమస్యలు ఉన్నవారికి న్యాపింగ్ వల్ల పెద్దగా ప్రయోజనాలు ఉండవు. వృద్ధుల్లో కాగ్నిటివ్ ఫంక్షనింగ్ సరిగ్గా ఉండాలంటే రాత్రి నిద్ర కూడా మెరుగ్గా ఉండాలని అధ్యయనం వెల్లడించింది. షార్టర్ పవర్ న్యాప్ కనీసం 20 నిమిషాల వరకు ఉండాలని కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు. న్యాప్ తరువాత మేల్కొన్నప్పుడు మానసిక ప్రశాంతతను అనుభూతి చెందుతారు. రాత్రి నిద్రపై న్యాప్ ప్రభావం ఉండకుండా, మధ్యాహ్నం వేళల్లో తొందరగా కునుకు తీయాలి.
0 comments:
Post a comment