Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Sunday, 31 January 2021

koti reddy Saripalliపదోతరగతి చదువు .... మైక్రోసాఫ్ట్ ఉద్యోగం.... తదనంతరం స్వంత సంస్థ ఏర్పాటు....రాబడి లో 33% సేవకోసమే కేటాయిస్తున్న కోటిరెడ్డి సరిపల్లి గారి గురించి స్పెషల్ స్టోరీ... పదో తరగతి చదువు... మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం..!

కోటిరెడ్డి సరిపల్లి... 14 టెక్‌ సంస్థల సమాహారమైన 'కోటి గ్రూఫ్‌ ఆఫ్‌ వెంచర్స్‌'కి అధినేత. తన సంస్థ రాబడిలో 33 శాతం... అంటే దాదాపు ఆరువందల 

కోట్లు కేవలం సేవకోసమే కేటాయిస్తున్న ఘనత అతనిది. పారిశ్రామికవేత్త కావడానికి ముందు మైక్రోసాఫ్ట్‌లో ఉన్నతోద్యోగి. కానీ చదివింది పదో తరగతి! అంతకంటే ముందు నాన్నతో కలిసి కూలిపనికి వెళ్లేవాడు. 35 ఏళ్ల జీవితంలో ఇన్ని విభిన్న పాత్రలు పోషించిన కోటిరెట్టి ప్రయాణం ఇది...

బుడమేరు... కృష్ణమ్మ ఉపనదుల్లో ఒకటి. కృష్ణా-పశ్చిమగోదావరి జిల్లాల మధ్య ప్రవహిస్తుంది.

వెల్లువెత్తిన ప్రతిసారీ బెజవాడ నగరాన్ని దుఃఖంలో ముంచెత్తుతూ ఉంటుంది. బుడమేటి పొంగు తీరని ఖర్చుకి దారి తీస్తుందన్నది మావైపున్న నానుడి. ఆ ఏరుకీ నా కెరీర్‌కీ చాలా దగ్గరి సంబంధం ఉంది. పాలిటెక్నిక్‌ చదవాలన్న నా కలల్ని కల్లలు చేసింది ఆ బుడమేరే. కృష్ణాజిల్లా గుడివాడ దగ్గర్లోని జనార్దనపురం అనే గ్రామం మాది. నాన్న నర్సారెడ్డి తన తొమ్మిదో ఏట నుంచీ పాలేరుగా కమతాలు చేసినవాడు. ఆ తర్వాత రైతు కూలీ అయ్యి... అరెకరం పొలం కొన్నాడు. అప్పుడే నేను పుట్టానట. ఆ మాత్రం దానికే 'నువ్వు పుట్టాకే మాకు మంచి రోజులు వచ్చాయిరా!' అని సంబరపడేవాడు. నాకిద్దరు అక్కయ్యలు. పెద్దక్కయ్యకి నా చిన్నప్పుడే పెళ్లైంది. నా తొమ్మిదో తరగతప్పుడు చిన్నక్కయ్యకి పెళ్ళి చేశారు. అందుకోసం మాకున్న అరెకరం పొలం అమ్మేశారు. ఆ తర్వాత నాన్న రైతు కూలీ అయ్యాడు. ఆయనతోపాటూ నేను కూడా కూలిపనికి వెళ్లేవాణ్ణి. నేను పదో తరగతి పరీక్ష రాసిన ఏడాది నాన్న పదహారు ఎకరాల పొలం కౌలుకి తీసుకున్నాడు. రెండున్నర లక్షల రూపాయలు వడ్డీకి తీసుకుని అందులో పంటవేశాడు. ఉప్పుడు బియ్యం తయారీకి ఉపయోగించే వరి పంట అది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి దాన్ని. ఆ పంట చేతికొస్తే పాలిటెక్నిక్‌లో చేరి ఎంసీఏ చేయాలనీ లేకపోతే బైపీసీ చదివి డాక్టర్‌నైనా కావాలనీ కలలు కంటుండేవాణ్ని నేను. బుడమేటి పొంగు ఆ ఆశనే అడియాస చేసింది. అకాలంలో కురిసిన వర్షాలవల్ల ఏటికి వరదొచ్చి పంట పదమూడు రోజులపాటు నీటమునిగింది. చూస్తుండగానే కుళ్లిపోయింది. దానికోసం అప్పు చేసిన రెండు లక్షల రూపాయలు నష్టపోయాం. మూలిగే నక్కపైన తాడిపండు పడ్డట్టు అప్పుడే నాన్న అనారోగ్యంతో మంచం పట్టాడు. చికిత్సకని చాలా ఖర్చుచేశాం. దాంతో పదో తరగతి ఫలితాల్లో మండల స్థాయిలో మొదటి ర్యాంకు సాధించినా... పై చదువులకెళ్లే దారిలేక కూలిపనులకి వెళ్లడం మొదలుపెట్టాను. అలా ఆరునెలలు గడిచాయి. మరో రెండు మూడురోజుల్లో సంక్రాంతి వస్తుందనగా... నాన్న తన దగ్గరున్న ఓ వెయ్యి రూపాయలు నా చేతికిచ్చి 'గుడివాడకెళ్లి బట్టలు కొనుక్కోరా!' అన్నాడు. ఇప్పుడు నాకున్న కోట్ల రూపాయల ఆదాయానికి ఆ వెయ్యే పెట్టుబడి!

తెలుగే తోడు నిలిచింది!

మా అమ్మ పేరు మల్లేశ్వరి. పెద్దగా చదువుకోలేదు కానీ నా చిన్నప్పటి నుంచీ పాఠ్యగ్రంథాలే కాకుండా బయటి పుస్తకాలూ చదవమని చెబుతుండేది. 'అంగబలం అర్ధబలాలు లేని మనం బుద్ధిబలాన్నే నమ్ముకోవాలిరా అబ్బాయ్‌!' అంటుండేది. ఐదో తరగతి నుంచే మా ఊరి గ్రంథాలయానికి వెళ్లడం మొదలుపెట్టాను. టెక్ట్స్‌బుక్స్‌ వచ్చిన వారంలోనే ఇంగ్లిషు, మ్యాథ్స్‌ తప్ప మిగతావన్నీ చదివేసేవాణ్ణి. ఆ చురుకుదనం నచ్చి నన్ను ఐదో తరగతి నుంచి ఏడో తరగతిలో వేశారు టీచర్లు. తొమ్మిది, పదో తరగతుల కోసం నందివాడలో చేరాను. అక్కడే బిల్‌గేట్స్‌ స్వీయచరిత్ర 'ది రోడ్‌ అహెడ్‌' చదివాను. పదో తరగతి తర్వాత పాలిటెక్నిక్‌లో చేరి అట్నుంచటు ఎంసీఏలో చేరాలనే కల మొదలైంది కూడా అప్పుడే. పంట చేతికి రాక, పరిస్థితులు బాగోలేక నేను పొలం పనులకి వెళుతున్నా... ఆ ఆశ పూర్తిగా చచ్చిపోలేదు. ఆ సంక్రాంతికి నాన్న బట్టల కోసం ఇచ్చిన డబ్బుల్తో గుడివాడ వెళ్లినప్పుడు అక్కడున్న ఓ పెద్ద బట్టల షాపు పక్కన 'గొప్ప ఆఫర్‌... రూ.వెయ్యికే పీజీడీసీఏ!' అనే బోర్డు చూశాను. ఏదో మంత్రమేసినట్టు నా దగ్గరున్న వెయ్యి రూపాయలు అక్కడ కట్టేశాను. అది తెలిసి నాన్న అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. 'కంప్యూటర్‌ చదువంటే మాటలా!

మనకి ఆ ఆశలొద్దు..!' అన్నాడు. నేను విన్లేదు. వారం పాటు నిరాహారదీక్ష చేశాకకానీ నాన్న మనసు కరగలేదు. అలా గుడివాడలోని డేటా సాఫ్ట్‌ అనే సంస్థలో శిక్షణకి చేరాను. మూడునెలల్లోనే సి-లాంగ్వేజ్‌ సహా అన్నింటిపైనా పట్టుసాధించాను. నా వేగం చూసి, ఫ్యాకల్టీగా ఉన్న వంశీ- పక్కనే ఉన్న బట్టల షాపులో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా ఉద్యోగం ఇప్పించారు. అక్కడ తీసుకున్న జీతం రూ.750... కంప్యూటర్‌ రంగంలో నా తొలి సంపాదన. ఉదయానే ఊరి నుంచి అన్నం కట్టుకుని వచ్చే నేను డేటా ఎంట్రీ పనిచేస్తూనే... ఖాళీ దొరికినప్పుడల్లా కంప్యూటర్‌ ఇనిస్టిట్యూట్‌కి వెళ్లి ల్యాబ్‌లో ప్రాక్టీస్‌ చేసి రాత్రికెప్పుడో ఇంటికెళ్లేవాణ్ణి. రెణ్ణెళ్ల తర్వాత ఇన్‌స్టిట్యూట్‌లోనే నాకు ఉద్యోగం ఇచ్చారు. సీ లాంగ్వేజ్‌, డేటా స్ట్రక్చర్‌లాంటి వంటి క్లిష్టమైన విషయాలనైనా అరటిపండు వలిచిపెట్టినట్టు... చక్కటి తెలుగులో చెప్పడం అక్కడున్నవాళ్లందరినీ ఆకట్టుకుంది. విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఆరునెలలు తిరగకుండానే ఆ సంస్థ యజమానులు దాన్ని లీజుకిచ్చి వేరే వ్యాపారం చేయాలనుకున్నారు. ఉద్యోగం పోతుందని బాధపడుతున్న నాకు... 'దాన్ని మనమే లీజుకి తీసుకుంటే పోలా!' అనే ఆలోచన వచ్చింది. ఊర్లోని నా స్నేహితుడు మునిరాజు నాతో చేతులు కలపడానికి ముందుకొచ్చాడు. నాన్నతో చెబితే మొదట్లో వద్దన్నా... తర్వాత అప్పు చేసి రూ.15 వేలు తెచ్చిచ్చాడు. అలా పదహారేళ్లకే సొంత సంస్థని ఏర్పాటుచేశాను! రెండేళ్లలోనే నా 'తెలుగు కంప్యూటర్‌ క్లాసులు' బాగా పాపులరయ్యాయి.

విజయవాడలోని సీ-పాయింట్‌ వంటి పెద్ద సంస్థలు గెస్ట్‌ లెక్చరర్‌గా పిలవడం మొదలుపెట్టాయి! మంచి ఆదాయం ఉన్నా అక్కడితో ఆగిపోకూడదు అనిపించింది. చిన్నప్పుడెప్పుడో చదివిన 'ఇంకాస్త ముందుకు వెళ్లు' కథ గుర్తొ చ్చింది. బ్యాగు సర్దుకుని హైదరాబాద్‌ వచ్చేశాను!

అవి కసిని పెంచాయి!

పదిహేడేళ్లు కూడా నిండని పల్లెటూరివాణ్ణీ, అదీ పదో తరగతి విద్యార్హతే ఉన్నవాణ్ణీ కాబట్టి 'నీకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగమేంటీ!' అన్నట్టు చిన్నచూపు చూశారు హైదరాబాద్‌ నగరంలో. కోచింగ్‌ సెంటర్‌లలో ఫ్యాకల్టీగానైనా అవకాశం రాలేదు. ఎంతో ప్రయాస తర్వాత చివరికి ఓ చిన్న సంస్థ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులకి సీ లాంగ్వేజ్‌ నేర్పించే అవకాశం ఇచ్చింది. ఆ ఇద్దరూ నా బోధనా విధానానికి ముచ్చటపడ్డారు. అందులో ఒకరు నన్ను దిల్‌షుక్‌నగర్‌లోని జెడ్‌ఎన్‌టీటీ సాఫ్ట్‌వేర్‌ సంస్థకి సిఫారసు చేశారు. వెళ్లినరోజు అక్కడ నాకో పరీక్ష పెట్టారు. గ్రాఫిక్స్‌ పని ఒకటి అప్పగించి 'ఓ నాలుగైదు గంటలు తీసుకుంటావా దీనికీ!' అన్నారు నవ్వుతూ. నేను కేవలం 45 నిమిషాల్లో పూర్తిచేసి చూపిస్తే... ఆశ్చర్యపోయారు. అప్పటికప్పుడే ఉద్యోగం ఇచ్చారు. ఉద్యోగిగా అందరితో సమానమైన పనే అయినా నాకు ఇంగ్లిషు రాకపోవడంతో చులకనగా చూసేవారు... పైగా నేను చదివింది పదోతరగతేనయ్యే! ఓసారి డైనింగ్‌ రూమ్‌కి వెళ్లాను. నా బాక్స్‌లోని ఇడ్లీ ఆవకాయ పచ్చడీ తింటున్నాను. అది చూసి నా సహోద్యోగులు ఇద్దరు ఇంగ్లిషులో మాట్లాడుకుని నవ్వడం... నన్ను చాలా బాధపెట్టింది. మరోసారి, నిజాం షుగర్స్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇన్‌స్టాల్‌మెంట్‌కి వెళ్లి నప్పుడు నన్ను చూసి 'ఓయ్‌... బయటకెళ్లి సిగరెట్లు పట్రావా!' అన్నాడు అక్కడి టీమ్‌ లీడర్‌! ఇవన్నీ నాలో కసి రేపాయి. ఏడాదిన్నర తర్వాత ఇలా అవమానించినవాళ్లందరి బాస్‌కి... నేను బాస్‌నయ్యాను!

ఫస్ట్‌... ఫస్ట్‌!

మంచి ఉద్యోగమే వచ్చినా ఎప్పుడూ అది చాలనుకున్నది లేదు నేను. సాఫ్ట్‌వేర్‌ రంగంలో వచ్చే ప్రతి మార్పుపైనా పట్టు సాధించడం మొదలుపెట్టాను. కోఠీలో అమ్ముతున్న పాత పుస్తకాలు చదివే జావా నేర్చుకున్నాను. దేశంలోనే ఆ ప్రోగ్రామ్‌ నేర్చుకున్న అతి పిన్నవయస్కుడిగా రికార్డు సాధించాను. అందులో సెకెండ్‌ లెవెల్‌కి వెళ్లిన ఏకైక ఆసియా వ్యక్తిని కూడా నేనే! కొత్తవి నేర్చుకునే కొద్దీ పెద్ద సంస్థల్లోకి అడుగుపెట్టాను. రిలయన్స్‌ తెచ్చిన రూ.5 ఫోన్‌కి కావాల్సిన సాఫ్ట్‌వేర్‌ రూపకర్తల్లో నేనూ ఒకణ్ణి. ఆ ప్రాజెక్టయ్యాకే మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగానికి రమ్మన్నారు. పన్నెండు రౌండ్ల ఇంటర్వ్యూ తర్వాత 'మీరు సెలెక్ట్‌ అయ్యారు... ప్రొఫైల్‌ ఇవ్వండి!' అన్నారు. నాది పదో తరగతి టీసీయే కదా... ఇచ్చాను. కాసేపటి తర్వాత మైక్రోసాఫ్ట్‌ ఇండియా చీఫ్‌ ఫోన్‌ చేసి 'పదో తరగతి అర్హతకి ఎలా ఉద్యోగం ఇస్తాం?!' అన్నారు. 'బిల్‌గేట్స్‌ కాలేజీ డ్రాపవుట్‌ కదా సార్‌! అలాంటివాడు స్థాపించిన కంపెనీ... పదోతరగతిని కారణంగా చూపి ఓ ప్రతిభావంతుణ్ని వదులుకుంటుందా?!' అని ఎదురు ప్రశ్నించాను. ఓ రోజు తర్వాత 'మీరు ఉద్యోగంలోకి చేరొచ్చు!' అని చెప్పారు. అలా కేవలం టెన్త్‌తో మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాను. రెండేళ్లకే అమెరికా వెళ్లాను. మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగుల్లో అద్భుతమైన ప్రతిభ చూపిన 0.01 శాతం మందికి మాత్రమే అందించే 'గోల్డెన్‌ స్టార్‌ అఛీవర్స్‌ అవార్డు' రెండుసార్లు అందుకున్నాను. నా స్ఫూర్తిప్రదాత బిల్‌గేట్స్‌ చేతా సెభాష్‌ అనిపించుకున్నాను. ఇంకేం కావాలి... అనిపించింది కానీ వెంటనే 'బిల్‌గేట్స్‌లా మనం సొంత వ్యాపారం మొదలుపెట్టాలి!' అనే ఆలోచనా వచ్చింది. ఆ నిర్ణయం క్షణాల్లో జరిగిపోయింది! 2014లో 'కోటి గ్రూప్‌ ఆఫ్‌ వెంచర్స్‌' ప్రారంభించాను. ఆరోగ్యం, విద్య, మీడియా, వెల్‌నెస్‌, ఆర్థికరంగం ఇలా వివిధ రంగాలకి ఉపయోగపడే పద్నాలుగు సంస్థల్ని దానికింద ఏర్పాటు చేశాను. విద్యార్థులని పరిశ్రమలతో అనుసంధానించి వాళ్ల పరిశోధనల్ని ఎప్పటికప్పుడు అంచనావేయడానికి ఉపయోగపడే 'డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ ఎకో సిస్టమ్‌' ప్రోగ్రామ్‌ని తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయంసహా ప్రపంచంలోని పలు విద్యాసంస్థలు వాడుతున్నాయి. కాలేజీల్లో ఫీజు చెల్లింపుల్ని పారదర్శకంగా మార్చడానికి 'డీజీ పే' అనే ప్రోగ్రామ్‌నీ చేశాం. నాలుగేళ్లలోనే నా సంస్థలన్నీ వెయ్యికోట్ల టర్నోవర్‌ని సాధించాయి. ఈలోపు పెళ్ళయింది. మా అక్క కూతురు శ్రీజారెడ్డినే చేసుకున్నాను. జీవితం ఇలాగే సాగి ఉంటే... నేనూ అందరి లాంటి ఓ పారిశ్రామికవేత్తనే ఉండిపోయేవాణ్ణే కానీ ఓ విషయం నన్ను మార్చేసింది...


అలాంటివాళ్లు ఎంతమందో...

2017లో మావాడు పుట్టాడు. ఏడాదిన్నరప్పుడు వాడిలో ఏదో తేడా కనిపించింది. కాలివేళ్లపైన నడుస్తుండేవాడు... పక్కకి వాలుతున్నట్టు ఉండేవాడు. అనుమానం వచ్చి వైద్యుల దగ్గరికెళితే ఆయన పరీక్షించి నా చేతికో పుస్తకం ఇచ్చి చదవమన్నాడు. ఆటిజం లక్షణాలకి సంబంధించిన పుస్తకం అది. మావాడికి ఆటిజం అన్న మాటే గుండెకోతలా అనిపించింది నాకు. రాత్రుళ్లు అకస్మాత్తుగా లేచి ఏడ్చేవాణ్ణి. రెండున్నర వారాలపాటు నరకాన్ని అనుభవించాను. డాక్టర్ల సూచనల మేరకు మరిన్ని టెస్టులు చేయించడానికి తీసుకెళ్లాను. ఆ టెస్టుల్ని చూసిన వైద్యుడు 'మీవాడికి ఆటిజం సమస్యలేదండీ. కానీ వినికిడి లోపం... కాక్లియర్‌ సమస్య ఉంది. చిన్న చికిత్సతో సవరించొచ్చు!' అని చెప్పాడు. ఒక్కసారిగా ఎంతో రిలీఫ్‌ అనిపించింది కానీ... 'ఆటిజం వచ్చిన పిల్లల బాధ ఇంతలా ఉంటుందా!' అనుకున్నాను. అలాంటివాళ్లకి సాంత్వన చేకూర్చేలా ఏదైనా చేయాలనుకున్నాను. దాని ఫలితమే 'పినాకిల్‌ బ్లూమ్స్‌' సంస్థ. ఆటిజం మాత్రమే కాదు ఇతరత్రా మెదడు సంబంధిత సమస్యలు ఉన్న పిల్లలకి పరీక్షలూ, వాళ్ల ఆరోగ్యం, వాళ్లకి కావాల్సిన శిక్షణ మొత్తాన్నీ అందిస్తుందీ సంస్థ. పేద పిల్లలకి ఇక్కడ ఉచితంగానే సేవలందిస్తున్నాం.

ఆ సంస్థతోపాటే 'కేవీ సేవా ఫౌండేషన్‌'ను ప్రారంభించాను. మనదేశంలోని ప్రభుత్వ బడుల్లో లోపించిన సమస్త వసతులూ అందించాలన్నది దీని లక్ష్యం. దీనికింద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని మూడువందల బడుల్ని దత్తత తీసుకుని పునరుద్ధరిస్తున్నాం. ప్రతి బడికీ కోటి రూపాయలదాకా ఖర్చు చేస్తున్నాం! నా సంస్థకి వచ్చే ఆదాయాన్ని 33:33:33గా విభజించుకోవడం నాకున్న అలవాటు. మొదటి 33 శాతం మా దగ్గరున్న తొమ్మిదివందల మంది ఉద్యోగులకిస్తాను. రెండో 33 శాతాన్ని మా సంస్థల కొత్త ప్రణాళికలకీ, పరిశోధనలకీ కేటాయిస్తాను. మిగతా 33 శాతం సేవకి అందిస్తున్నాను. అలా ప్రస్తుతం మా ఆదాయం 1600 కోట్ల రూపాయలైతే... సుమారు 500 కోట్లు సేవకే కేటాయిస్తున్నాను.

- పార్థసారథి చిరువోలు, ఈనాడు, హైదరాబాదు.

0 Comments:

Post a Comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top