ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, కొత్త పథకాలను అమలు చేయకూడదనే ప్రచారం మొదలైంది. ఈ క్రమంలో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. ఈనెల 11వ తేదీన అమలు జరపాలని నిర్ణయించిన జగనన్న అమ్మఒడి పథకం ఆగబోదని మంత్రి స్పష్టం చేశారు. 'అమ్మ ఒడి పథకం యథాతథంగా అమలు చేస్తాం. ఇప్పటికే జీవో నెంబర్ 3 విడుదల చేశాం. 44,08,921 మందికి అమ్మ ఒడి వర్తిస్తుంది. రూ.6,612 కోట్లతో అమ్మ ఒడి అమలు చేసి తీరతాం. సోమవారం (జనవరి 11) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతా ల్లో డబ్బు జమ చేస్తారు. అమ్మఒడిని ఆపే ప్రసక్తే లేదు.'
అని విద్యాశాఖ మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ నిన్న విడుదల చేసింది. నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహణకు షెడ్యూల్ రిలీజ్ చేసింది.
జనవరి 23న తొలిదశ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడుతుంది. 27న రెండో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది. జనవరి 31న మూడో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది. ఫిబ్రవరి 5 న మొదటిదశ ఎన్నికలు, ఫిబ్రవరి 9 న రెండోదశ ఎన్నికలు, ఫిబ్రవరి 13 న మూడోదశ ఎన్నికలు, ఫిబ్రవరి 17 న నాలుగోదశ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరిగిన రోజే కౌంటింగ్ కూడా చేయనున్నారు. పంచాయతీ ఎన్నికలు ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు జరగనుంది. ఆ తర్వాత 4 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది.ఇక ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. ప్రవర్తనా నియామవళి గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుందని ఆ లేఖలో తెలిపారు. పట్టణ, నగర ప్రాంతాలలో ప్రవర్తనా నియామళి అమలులో ఉండదని స్పష్టం చేశారు. అయితే, పట్టణ ప్రాంతంలో సభలు నిర్వహించి గ్రామాల ప్రాంతాల ప్రజలకు లబ్ధి చేకూర్చే పనులు చేపట్టవద్దని స్పష్టం చేశారు. ఇటువంటి చర్యలు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు అవుతుందని ఆ లేఖలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు.
మరోవైపు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను నిలుపుదల చేయాలంటూ ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో ఈ రోజు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే, దీనిపై సోమవారం రోజు విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, చంద్రబాబు చెప్పుచేతల్లో నడుస్తున్నాని అధికార వైసీపీ మండిపడింది. అయితే, ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాతే ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుందని టీడీపీ వర్గం వాదిస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీ ఈనెల 8న భేటీ అయింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో కూడా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించామని, కాబట్టి ఈ సమయంలో ఎన్నికలు సాధ్యం కాదని స్పష్టం చేసింది. మరోవైపు ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారుల సంఘం కూడా ఎన్నికల విధులు నిర్వహించలేమని తీర్మానం చేశాయి.
0 Comments:
Post a Comment