Directions for FA-1 management
ఎఫ్‌ఏ-1 నిర్వహణకు ఆదేశాలు కార్యాచరణ చేపట్టిన విద్యాశాఖ.
కొవిడ్ కారణంగా గత కొన్ని నెలలుగా పాఠశాలలకు హాజరుకాని విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్స్‌మెంట్ పరీక్షలు (నిర్మాణాత్మక మూల్యాంకనం) నిర్వహించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టిన తరువాత విడతల వారీగా తరగతులు ప్రారంభించిన ప్రభుత్వం ప్రస్తుతం 9, 10 తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.
ఎఫ్‌ఏ-1 నుంచి ఎఫ్‌ఎ-4 వరకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. వాస్తవానికి మొదటి విడత పరీక్షలు గత ఏడాది ఆగస్టులోపే జరగాల్సి ఉండగా కరోనా కారణంగా నిర్వహించలేదు. గతేడాది నవంబరు నుంచి 9, 10 తరగతులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి నాలుగుసార్లు నిర్వహించాల్సిన పరీక్షలను సమయం లేకపోవడంతో రెండుసార్లు మాత్రమే జరపాలని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మొదటి విడత పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ఈనెల 6 నుంచి 8వ తేదీవరకు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఎమ్యీవోల ద్వారా ఉపాధ్యాయులకు పంపారు. తరగతులు ప్రారంభమైన తరువాత గతేడాది నవంబరు 16న విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించే బేస్‌లైన్ పరీక్ష మాత్రమే నిర్వహించారు. పాఠ్యాంశాలకు సంబంధించి ఇవే మొదటి పరీక్షలు.
విద్యాసంవత్సర క్యాలెండర్ ప్రకారమే
2020-21 విద్యాసంవత్సర క్యాలెండర్ ప్రకారం అన్ని యాజమాన్యాల పాఠశాలల్లోనూ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. పాఠశాల స్థాయిలో ప్రశ్నపత్రాలు తయారు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని పాఠశాలల్లోనూ సమగ్ర మూల్యాంకన విధానంలోనే(సీసీఈ)నిర్వహించాలి. మూల్యాంకనం చేయించి సీసీఈ వెబ్‌పోర్టల్లో అప్‌లోడ్ చేయాలి. ఉపాధ్యాయులు ఆయా తరగతుల విద్యార్థుల మార్కులను పాఠ్యాంశాల వారీగా రికార్డుల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇలా విధివిధానాలతో ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఎఫ్‌ఏ-1 పరీక్షలు పూర్తయిన తరువాత ఎఫ్‌ఏ-2 పరీక్షలు ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.
మిగిలిన తరగతుల పరిస్థితి ఏమిటీ ?
మిగిలిన తరగతుల విద్యార్థులకు కూడా అదే విధంగా పరీక్షలు జరుగుతాయా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొవిడ్ కారణంగా ఇప్పటికీ ప్రాథమికస్థాయి తరగతులు ప్రారంభం కాలేదు. ఇప్పటివరకు ఒకటి నుంచి ఆరు తరగతుల విద్యార్థులు ఇంతవరకు బడి ముఖం చూడలేదు. వారికి తరగతులు ఎప్పుడు ప్రారంభిస్తారో కూడా ఇంతవరకు స్పష్టత లేదు. 7, 8 తరగతులు ఇటీవలే ప్రారంభమయ్యాయి. అయితే ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులందరికీ ఈఎఫ్‌ఏ పరీక్షలు నిర్వహించాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి అలా జరుగుతాయా లేదా అన్నది ప్రశ్నార్థకరంగా మారింది. తరగతులు జరుగుతున్న విద్యార్థులకు మాత్రం పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
అన్ని యాజమాన్యాలకు ఆదేశాలు
9, 10 తరగతులకు ఎఫ్‌ఏ-1 పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఆ దిశగా జిల్లాలోని అన్ని యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశాం. 7,8 తరగతుల విద్యార్థులకు కూడా సంక్రాంతి పండుగ తరువాత పరీక్షలు ఉంటాయి. ఒకటి నుంచి ఆరో తరగతి విద్యార్థులకు తరగతులు ప్రారంభించిన తరువాత ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం.
0 Comments:
Post a Comment