ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం, బైరిపురంలో ఇంతవరకు సర్పంచ్ పదవి కోసం ఎన్నికలు జరగలేదట. ఆ గ్రామంలో ప్రజలందరిదీ ఒకే మాట. అసెంబ్లీ ఎన్నికల సమయంలో గ్రామస్తులు ఆయా పార్టీలకు మద్దతిస్తారు. కానీ పంచాయతీ ఎన్నికలొచ్చేసరికి అందులో పార్టీల గొడవలొద్దనేది వారి ఉద్దేశ్యం. ఆ గ్రామంలో 1300 మందికి పైగా జనాభా ఉంది. పంచాయతీ ఎన్నికల ప్రకటన వచ్చిన వెంటనే ఓ మీటింగ్ నిర్వహిస్తారు. ఆ మీటింగ్ లో గ్రామంలోని ఒక్కో ఇంటి నుంచి ఒక్కొక్కరు హాజరవుతారు.
గ్రామాభివృద్ధి, సర్పంచ్ అభ్యర్థిపై ఆ సమావేశంలో చర్చిస్తారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు. ఎవరు సర్పంచ్ అయితే బాగుంటుందో చర్చించుకొని వారినే ఎంపిక చేస్తారు.
మళ్లీ ఎన్నికలొచ్చేవరకు ఆ వ్యక్తే సర్పంచ్ గా కొనసాగుతారు.
దీని ద్వారా రెండు లాభాలున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. అవి.. మొదటిది ఊళ్లో రాజకీయ తగాదాలు లేకుండా ఎన్నిక ప్రక్రియ పూర్తవడం, రెండోది ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ఇచ్చే ప్రొత్సాహం. ఈ నిధులతో గ్రామంలో ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం చేపడతామని వారు చెప్పారు. రాష్ట్రంలో ఏకగ్రీవాలు చాలా చోట్ల జరుగుతున్నా.. గ్రామస్తులే ముందుకు వచ్చి స్వచ్ఛందంగా సర్పంచ్ ను ఎన్నుకోవడం గమనార్హం. దశాబ్దాలుగా ఇక్కడ ఇదే సాంప్రదాయం కొనసాగుతోంది.
0 comments:
Post a comment