ఏపీ పరిపాలనా రాజధాని విశాఖకు తరలింపునకు కొత్త ముహూర్తం
ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధాని తరలింపునకు సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్త ముహూర్తం ఫిక్స్ చేసింది. 2021 ఉగాది నుంచి మార్చాలని డిసైడైంది. ఏప్రిల్ 13న ఉగాది. ఆ రోజు నుంచి విశాఖ పరిపాలన రాజధాని ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అధికారులు సమాయత్తం కావాలని రాష్ట్ర ప్రభుత్వం సచివాలయంలో ఉన్నతాధికారులకు ఆదేశించినట్టు తెలిసింది. దీనిపై ప్రస్తుతం హైకోర్టులో కొన్ని కేసులు ఉన్నాయి. ఆ కేసుల సమస్యలు అన్నీ ఏప్రిల్ నాటికి తీరిపోతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఉగాది నుంచి ప్రభుత్వం పరిపాలనా రాజధాని విశాఖకు తరలించాలని నిర్ణయించామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వం అందుకోసం చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టాన్ని అసెంబ్లీ ఆమోదించింది. దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో కూడా పలుమార్లు రాజధాని తరలింపునకు సంబంధిచిన ప్రచారం జరిగింది. అయితే, అది వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఈ సారి ఉగాదికి కచ్చితంగా మార్పు ఖాయమని భావిస్తున్నారు.
ఏప్రిల్లో తరలించడం వల్ల అటు ఉద్యోగులకు కూడా పెద్దగా నష్టం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. ఉద్యోగుల పిల్లల చదువుల పరంగా కూడా మారడానికి వీలుగా ఉంటుందని భావిస్తున్నారు. తాజాగా, సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకులు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తమను త్వరగా విశాఖకు తీసుకుని వెళ్లాలని కోరారు. అమరావతిలో కనీసం టెంట్ వేసుకునే పరిస్థితి కూడా లేదని, త్వరగా తమను విశాఖకు తీసుకుని వెళ్లాలన్నారు.ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులు కచ్చితంగా అమలవుతాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల విశాఖ పర్యటనలో చెప్పారు. ఉత్తరాంధ్ర రాజకీయాలను పరిశీలిస్తున్న ఆయన విశాఖ పరిపాలన రాజధాని అవుతుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో జగన్ కంకణం కట్టుకున్నారని, అందులో వెనక్కి తగ్గేది లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. టీడీపీ నేతలు ఎంత వ్యతిరేకించినా కూడా ఈ విషయంలో ప్రభుత్వం ముందుకే వెళ్తుందన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్దికి జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
విశాఖలో పార్టీ బలం పెంచుకునే ప్రయత్నాలను కూడా వైసీపీ చేస్తోంది. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుంటోంది. విశాఖ సౌత్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ టీడీపీకి గుడ్ బై కొట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వాసుపల్లి గణేష్ కుమారులు ఇద్దరికీ కండువాలు కప్పిన సీఎం జగన్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. తాజాగా, మరో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కేంద్రంగా విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రంగా హత్య కేసులో ఆయన నిందితుడని చెప్పారు. అలాగే, ఆయన విద్యార్హతల మీద కూడా అనుమానాలు ఉన్నాయన్నారు. దొంగ సర్టిఫికెట్లు తెచ్చి అఫిడవిట్లో పొందుపరిచారన్నారు. దీనిపై త్వరలోనే కేసు నమోదు అవుతుందని ఆయన హెచ్చరించారు.
0 comments:
Post a comment