వచ్చే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 9, 10, ఇంటర్, డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కోర్సుల తరగతుల ప్రారంభానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కరోనా లాక్ డౌన్ కారణంగా గతేడాది మార్చి నుంచి మూసివున్న విద్యా సంస్థలు ఈ నిర్ణయంతో పున:ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యా సంస్థల పున:ప్రారంభానికి సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది.
తాజా మార్గదర్శకాల ప్రకారం... ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్‌లైన్ తరగతులను కూడా కొనసాగించవచ్చు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ ఏడాది పరీక్షలు రాసేందుకు కనీస హాజరు శాతం నుంచి విద్యార్థులకు మినహాయింపు ఉంటుంది. విద్యార్థుల హాజరుకు సంబంధించి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి.
ఇంటర్మీడియట్ పరీక్షా విధానంలో ఎటువంటి మార్పులు ఉండవు. ఇంటర్ పరీక్షల్లో విద్యార్థులకు మరిన్ని ఛాయిస్‌లు ఇచ్చే అవకాశాన్ని పరిశీలించనున్నారు.
ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఇప్పుడే ప్రత్యక్ష తరగతులు నిర్వహించవద్దు. అలాగే ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు డిటెన్షన్ ఉండదు. 300 పైచిలుకు విద్యార్థులు ఉండే జూనియర్ కాలేజీల్లో షిఫ్ట్ విధానాన్ని అమలుచేయాలి. 300 లోపు విద్యార్థులున్న కాలేజీల్లో ఉదయం 9.30గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు తరగతులు నిర్వహించవచ్చు. తరగతి గదిలో విద్యార్థికి, విద్యార్థికి మధ్య 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించాలి.
ఉదయం 8.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు ఇంటర్మీడియట్ సెకండియర్ క్లాసులు నిర్వహించాలి. మధ్యాహ్నం 1.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు ఇంటర్మీడియట్ ఫస్టియర్ క్లాసులు నిర్వహించాలి.డిగ్రీ,పీజీ,ఒకేషన్ కాలేజీల్లో రొటేషన్ విధానంలో రోజుకు సగం మంది విద్యార్థులకే క్లాసులు నిర్వహించాలి. డిగ్రీ,పీజీ,ఒకేషనల్ విద్యార్థులకు ఈ సెమిస్టర్‌లో కనీస హాజరు తప్పనిసరి కాదు.
ఈనెల 25 లోగా తరగతుల ప్రారంభానికి అనుకూలంగా విద్యాసంస్థలను సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లతో పాటు సంక్షేమ వసతి గృహాలను సిద్ధం చేసుకొని అన్ని ఏర్పాట్లు చేయాలని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం కలెక్టర్‌లను ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధికారులు ఆ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
0 Comments:
Post a Comment