మూడు రాజధానులపై కుండబద్దలు కొట్టిన గవర్నర్: విస్పష్ట ప్రకటన: జగన్ సర్కార్ మాటగా
అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేసే విషయంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. క్లారిటీ ఇచ్చారు. విస్పష్ట ప్రకటన చేశారు. మూడు రాజధానుల ఏర్పాటుపై జగన్ సర్కార్ ఉద్దేశమేమిటనేది తేల్చి చెప్పారు. గణతంత్ర దినోత్సవ వేదిక మీదుగా ఆయన మూడు రాజధానుల గురించి ప్రస్తావించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి కట్టుబడి ఉన్నామని గవర్నర్ స్పష్టం చేశారు. అధికార వికేంద్రీకరణను అమలు చేస్తామని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను గురించి ప్రస్తావించారు.
విజయవాడలో గణతంత్ర వేడుకల్లో
దేశ 72వ గణతంత్ర దినోత్సవంలో భాగంగా..
విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆయన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, విజయవాడ నగర ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్.. ఇతర ఉన్నతాధికారులు ఆందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ పోలీసుల వందనాన్ని స్వీకరించారు. అనంతరం ప్రసంగించారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న నవరత్నాల గురించి మాట్లాడారు.
సమగ్రాభివృద్ధికి అంకిత భావంతో..
సమగ్ర రాష్ట్రాభివృద్ధికి తన ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తోందని అన్నారు. దీనికి అవసరమైన అజెండాను రూపొందించుకుందని, దాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాలు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతి, స్వయం సాధికారికతను సాధించడానికి సంక్షేమ పథకాలను తన ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. ఈ దిశగా కృషి చేస్తోందని అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల కోసం వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు.
పేదలందరికీ ఇళ్లు వెనుక ఉద్దేశం అదే..
ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో పేదలందరికీ ఇళ్లు పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. ఇల్లు లేని నిరుపేదల కోసం ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని కిందటి నెల 25వ తేదీన ప్రారంభించిందని, దశలవారీగా 30 లక్షల మందికి పైగా లబ్దదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తోందని గవర్నర్ పేర్కొన్నారు. ప్రతి నెలా ఒకటవ తేదీ నాడే అర్హులందరికీ పింఛన్లు అందజేస్తోందని, దీనికోసం వలంటీర్ల వ్యవస్థను ప్రవేశ పెట్టిందని చెప్పారు.
మూడు రాజధానులకు కట్టుబడి..
మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి తన ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. విశాఖను పరిపాలన రాజధానిగా బదలాయిస్తుందని గవర్నర్ అన్నారు. అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా తన ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని అన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగంగా మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని తన ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో అవాంఛనీయ సంఘటనలకు పాల్పడుతోన్న వారిని కఠినంగా శిక్షంచడానికి అవసరమైన చర్యలను తీసుకుంటోందని గవర్నర్ అన్నారు. శాంతిభద్రతలకు భగ్నం కలిగించే వారు ఎప్పటికైనా శిక్షార్హులేనని, చట్టపరంగా వారిపై కఠిన చర్యలను తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
0 comments:
Post a comment