🔳అట్టముక్కలతో...కోడింగ్ నేర్పిస్తాం!
కూకట్‌పల్లిలోని ‘భువన విజయం’ ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోన్న గీత కంప్యూటర్ కోడ్ రాయగలదు. ఈమె క్లాస్‌మేట్ శ్రీనుకి కూడా కోడింగ్ వచ్చు. ఆ నైపుణ్యాలని వీళ్లు కంప్యూటర్ మీద నేర్చుకోలేదు. అసలు వీళ్ల స్కూల్లో కంప్యూటరే
లేదు. వాళ్లు కోడింగ్ నేర్చుకున్నది ‘లైఫ్ స్కిల్స్ 360’ సంస్థ రూపొందించిన ప్రత్యేకమైన ‘ప్రో గేమ్’ కిట్‌తో. హైదరాబాద్‌కు చెందిన సౌజన్య రాజ్, ఆమె భర్త మయూర్ రాజ్ ఈ సంస్థను నాలుగేళ్ల కిందట స్థాపించారు. ‘దేశంలోని 87 శాతం పాఠశాలల్లో కంప్యూటర్లు లేవు. ప్రభుత్వ పాఠశాలలూ, మధ్య తరగతి పిల్లలు చదివే ప్రైవేటు స్కూళ్లలో ఈ సమస్య ప్రధానంగా ఉంది. మరికొన్ని చోట్ల కంప్యూటర్లున్నా విద్యార్థులకు తగ్గ నిష్పత్తిలో లేవు. దానివల్ల వీళ్లంతా 21 శతాబ్దపు ప్రాథమిక నైపుణ్యమైన కోడింగ్‌కి దూరంగా ఉంటున్నారు. దీని గురించి మా బృందం ఆలోచించినపుడు ఆఫ్‌లైన్లో కోడింగ్ నేర్పించాలనుకున్నాం. ఏడాదిపాటు కార్డ్‌బోర్డ్‌తో వివిధ ప్రయోగాలు చేసి ‘ప్రో గేమ్’ కిట్‌ని రూపొందించాం’ అని చెబుతారు సౌజన్య. ఈ కిట్లోని కార్డ్‌బోర్డ్(అట్టముక్క)లు వివిధ రంగుల్లో ఉంటాయి. కోడింగ్ రాసేందుకు వాటిని ఏ క్రమంలో పేర్చాలో శిక్షకులు చెబుతారు. కొన్నిసార్లు దీన్లో 10 వరుసలూ ఉంటాయి. అవన్నీ పిల్లలు సులభంగా గుర్తుపెట్టుకునేలా వీరికి శిక్షణ ఇస్తారు. కార్డ్‌బోర్డ్‌లను అమర్చిన తర్వాత దాన్ని ‘ప్రో గేమ్’ ఆప్‌తో స్కాన్ చేస్తే, వారు చేసిన ప్రోగ్రామింగ్‌కి తగ్గట్టు అక్కడ వీడియో వస్తుంది. కార్డ్‌బోర్డ్‌తో కోడింగ్ రాయడం వచ్చాక, ఆ నైపుణ్యంతో కంప్యూటర్‌మీద కోడింగ్ సులభంగా రాయగలరు. ఈ కిట్ ఉపయోగించి ఇప్పటికే తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్రలో వేలమంది విద్యార్థులు కోడింగ్ నైపుణ్యాలు నేర్చుకున్నారు. నేపాల్‌లోని కొన్ని పాఠశాలలూ ఈ కిట్‌ద్వారా పిల్లలకు కోడింగ్ నేర్పించడం విశేషం.
0 Comments:
Post a Comment