30 నెలలు ఊరించి, కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుంది..
ఐఏఎస్ బిశ్వాల్‌కు ఫ్యామిలీ ఉంటే హెచ్ఆర్ఏ విలువ తెలిసేది
త్రిసభ్య కమిటీతో మూడో రోజు మూడు సంఘాల మీటింగ్
హైదరాబాద్, వెలుగు: పీఆర్సీ కమిషన్ సిఫార్సులపై టీచర్ల సంఘాలు మండిపడ్డాయి. ఫిట్ మెంట్ పేరుతో ముష్టి వేస్తున్నరా అని ఫైర్ అయ్యాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఇలాంటి ఫిట్ మెంట్ ఇచ్చినా, ఇవ్వకున్నా ఒక్కటేనని తేల్చిచెప్పాయి. శుక్రవారం సెక్రటేరియట్లో సీఎస్ సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీతో తెలంగాణ టీచర్స్ యూనియన్ (టీటీయూ), తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్ టీఎఫ్), రాష్ట్ర ఉపాధ్యాయ పండిత పరిషత్(ఆర్‌యూపీపీ) సంఘాలు భేటీ అయ్యాయి.
చర్చలకు ఆహ్వానం అందని రిజిస్టర్డ్ సంఘాలైన తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ (టీజీహెచ్ఏ), తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) సంఘాలు కూడా కమిటీని కలిసి వినతిపత్రాలు అందచేశాయి. పీఆర్సీపై సంఘాల నేతలు విన్నవించిన అంశాలను సీఎం దృష్టికి తీసుకువెళ్తానని సీఎస్ హామీ ఇచ్చారు.
ఈ ఫిట్మెంట్ దారుణం
రాష్ట్రం ఏర్పడ్డాక తొలి ఫిట్ మెంట్ సిఫార్సు ఇలా ఉండడం దారుణమని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ అధ్యక్షుడు జగదీశ్ అన్నారు. రాష్ట్రంలో మొత్తం 25 వేల మంది భాషా పండితులు ఉన్నారని, 45 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. భాషా పండితులకు ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. జీవో నంబర్ 15 ను అమలు చేయాలని కోరారు.- సీపీఎస్ పరిధిలోని ఎంప్లాయీస్ అందరికీ ఓపీఎస్‌ను వర్తింపజేయాలని టీజీహెచ్ఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజ భానుచంద్ర ప్రకాశ్, రాజ గంగారెడ్డి డిమాండ్ చేశారు. ఫిట్‌మెంట్‌ను 43 శాతం ఇవ్వాలన్నారు. గ్రేడ్-2 గెజిటెడ్ హెడ్మాస్టర్ల స్కేలు, జూనియర్ లెక్చరర్లతో సమానంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రిటైర్మెంట్ గ్రాట్యుటీనిరూ .20 లక్షలకు పెంచాలి
ఉద్యోగులకు 50 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి. కనీస వేతనం రూ.25 వేలుగా నిర్ణయించాలి. హెచ్ఆర్ఏ స్లాబులను పాత విధానం ప్రకారం కొనసాగించాలి. రిటైర్మెంట్ గ్రాట్యుటీని రూ.20 లక్షలకు పెంచాలి. కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ టీచర్లతో సమానంగా జీతాలివ్వాలి.
- టీపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.రమణ, మైస శ్రీనివాసులు
ఇంత దరిద్రంగా ఇస్తరని ఊహించలే
''30 నెలలు ఊరించి, కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఫిట్ మెంట్ ఉంది. ఐఏఎస్ పదవికి బిశ్వాల్ అర్హులేనా? ప్రభుత్వాన్ని సంతృప్తి పరిచేందుకు 7.5 శాతం ఫిట్ మెంట్‌ను కమిటీ రికమండ్ చేసింది. బిశ్వాల్‌కు కుటుంబం ఉంటే హెచ్ఆర్ఏ విలువ తెలిసేది. పీఆర్సీని ముష్టిలాగా వేస్తున్నారు. కేసీఆర్ జోక్యం చేసుకొని 42 శాతం ఫిట్ మెంట్ ప్రకటించాలి. - టీటీయూ అధ్యక్షుడు మణిపాల్ రెడ్డి
45% ఇవ్వకుంటే ఉద్యమమే
2018లో ఉన్న ధరల ప్రకారం బిశ్వాల్ కమిటీ 7.5 శాతం రిఫర్ చేసింది. ఇప్పుడు నిత్యావసర ధరలు డబుల్ అయ్యాయి. మా జీతాలు మాత్రం పెరగలేదు. ఈనెల 31 లోపు 45 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలి. లేదంటే స్కూళ్లు బంద్ చేసి ఉద్యమం చేస్తాం. హెచ్ఆర్ఏ స్లాబ్ పర్సంట్ తగ్గించడం దారుణం. బిశ్వాల్ కమిటీ మీద పెట్టిన ఖర్చు మా మీద పెట్టినా హెచ్ఆర్ఏ వచ్చేది. - టీఆర్ టీఎఫ్ అధ్యక్షుడు అశోక్ కుమార్
🤭🤭🤭🤭🤭నిజంగా ఇది ముస్టే
ReplyDelete