ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు నిర్వహిస్తానని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. ఎలాగైనా సరే అడ్డుకుంటామని జగన్ సర్కారు పోటాపోటీగా వ్యవహరిస్తున్న తరుణంలో రాష్ట్ర హైకోర్టు వరుసగా సంచలన ఆదేశాలు ఇస్తున్నది. ఇప్పటికే పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేసిన కోర్టు.. ఆ తీర్పును సవాలు చేస్తూ నిమ్మగడ్డ దాఖలు చేసిన హౌస్ మోషన్ రిట్ పిటిషన్‌పైనా సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది..
అత్యవసరం కానేకాదు..
పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ సోమవారం సంచలన తీర్పు చెప్పగా.. కొద్ది గంటల వ్యవధిలోనే సదరు తీర్పు రాజ్యాంగ విరుద్ధమంటూ, దానిని సవాలు చేస్తూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ..
హైకోర్టులోని డివిజన్ బెంచ్ ఎదుట హౌస్ మోషన్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని జస్టిస్ దుర్గాప్రసాద్, జస్టిస్ కృష్ణ మోహన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా ఎస్‌ఈసీ అభ్యంతరాలను బెంచ్ తోసిపుచ్చింది. అంతేకాదు.. హౌజ్ మోషన్ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేనేలేదని జడ్జిలు వ్యాఖ్యానించారు..
ఈనెల 18కి వాయిదా..
నిమ్మగడ్డ దాఖలుచేసిన హౌజ్ మోషన్ పిటిషన్ ను అత్యవసరంగా విచారించలేమన్న డివిజన్ బెంచ్.. దీనిపై తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది. తద్వారా రెండు రోజుల వ్యవధిలోనే నిమ్మగడ్డకు హైకోర్టులో రెండోసారి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఫిబ్రవరిలో నాలుగు దశల్లో పంచాయితీ ఎన్నికల నిర్వహణ కోసం ఈ నెల 8న ఎస్ఈసీ షెడ్యూల్ జారీ చేయగా.. అది రాజ్యాంగంలోని 14, 21అధికరణలకు విరుద్ధమంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ వ్యాఖ్యానించడం, ఎస్‌ఈసీ ఆచరణ సాధ్యం కాని నిర్ణయం తీసుకుందంటూ షెడ్యూల్ ను రద్దు చేయడం తెలిసిందే.
సుప్రీంకోర్టుకు నిమ్మగడ్డ?
ఇన్నాళ్లూ తనకు అండగా నిలిచిన హైకోర్టు.. గడిచిన వారం రోజులుగా ప్రతికూల ఆదేశాలిస్తుండటంపై నిమ్మగడ్డ తీవ్ర ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. సోమవారం నాటి షెడ్యూల్ రద్దు తీర్పు, మంగళవారం నాటి విచారణలో హౌజ్ మోషన్ పిటిషన్ అత్యవసరం కాదని హైకోర్టు చెప్పడం.. ఇలా వరుసబెట్టి ఎదురుదెబ్బలు తగులుతోన్న దరిమిలా నిమ్మగడ్డ ఇక సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నారని తెలుస్తోంది. ఏపీ హైకోర్టులో చీఫ్ జస్టిస్, ఇతర జడ్జిల మార్పుల తర్వాత పంచాయితీ ఎన్నికలపై భిన్న తీర్పులు వస్తున్న నేపథ్యంలో హైకోర్టు వ్యవహార శైలిపై నిమ్మగడ్డ సుప్రీంకోర్టులో సవాలు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం ఇంకా కచ్చితంగా రూఢీ కాలేదు.
0 Comments:
Post a Comment