🌼మళ్లీ ఖాళీలు.. ఐచ్ఛికాలు..
● అయిదు అకడమిక్ సంవత్సరాల పూర్తయిన హెచ్ఎంలకే బదిలీ
న్యాయస్థానం ఆదేశాలతో ప్రక్రియలో మార్పులు
విజయనగరం
☀️ఐచ్ఛికాల మేరకు ప్రదేశాలు కేటాయిస్తారన్న సమయంలో ఉపాధ్యాయ బదిలీ షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. మళ్లీ ఖాళీల జాబితా ప్రదర్శన.. ఐచ్ఛికాల ప్రక్రియ నిర్వహించనున్నారు. న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో కొత్త షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు జిల్లాలోను కసరత్తు జరుగుతోంది. తొలుతగా ప్రధానోపాధ్యాయుల ఐచ్ఛికాల కోసం ఖాళీలను సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రాధాన్యత కేటగిరి పాయింట్లు విషయంలో కొందరికి న్యాయస్థానం అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఉపాధ్యాయులకు అదనంగా పాయింట్లు లభించే అవకాశం ఉంది.
☀️ప్రధానోపాధ్యాయులు అయిదు అకడమిక్ సంవత్సరాలు పూర్తి చేసుకుంటే తప్పనిసరిగా బదిలీ కావాలని తొలుత పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాలో ఇటువంటి వారు 58 మంది ఉన్నారు. తరువాత అయిదేళ్ల సర్వీసు పూర్తిచేసిన వారికే అవకాశం కల్పించడంతో 18 మందే అర్హత పొందారు. తొలి ఉత్తర్వులే అమలుచేయాలని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రభుత్వం జారీ చేసిన సవరణ ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టివేసింది. ఉపాధ్యాయులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో వారంతా మళ్లీ ఐచ్ఛికాలు ఇవ్వాల్సి ఉంది. జిల్లాలో 77 ఖాళీలను చూపనున్నారు. ఇందులో 58 బదిలీ కావాల్సినవారు, మిగిలినవి క్లియర్ ఖాళీలు ఉన్నట్లు విద్యాశాఖ చెబుతోంది.
🍁ఆ మూడింటిలో ఇలా..
☀️2019లో ఉద్యోగోన్నతి లేదా బదిలీపై పాఠశాలలకు వచ్చిన వారిలో కొందరు హేతుబద్దీకరణతో మళ్లీ బదిలీ కావాల్సి వస్తోంది. ఇటువంటి వారంతా పాతసర్వీసును పరిగణలోకి తీసుకోవాలని 17 మంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వీరిలో ఇద్దరు ఉద్యోగోన్నతి, 15 మంది బదిలీపై వచ్చారు. పురపాలక సంఘాల్లో సమీపంలో ఉన్న కొన్ని పాఠశాలలు విలీనం అయ్యే పరిస్థితి ఉందని, బదిలీల్లో మినహాయించాలని న్యాయస్థానానికెళ్లిన 25 మందికి మినహాయింపు కల్పించడంతో వీరికి అదనంగా పాయింట్లు కలపనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ఆయా ఉపాధ్యాయుల వివరాలను నివేదించేందుకు సిద్ధమవుతోంది.
🍁ఆదేశాల మేరకే...
☀️ఉన్నతీకరణ పోస్టులను ఖాళీలుగా చూపాలని న్యాయస్థానం ఆదేశించింది. జిల్లాలో పోస్టుల్లో 444 మంది ఉన్నారు. తెలుగు 252, హిందీలో 192 పండిత ఉపాధ్యాయులున్నారు. వీరు పనిచేస్తున్న ఖాళీలుగా చూపాలి. వీరికి 2019లో అడ్హక్ ప్రాతిపదికపై ఉన్నతీకరణ కల్పించారు. ఈ ఖాళీలను చూపడంతో ఇతరులు కోరుకునే అవకాశం ఉంటుంది. ఉన్నతీకరించిన వారిలో 94 మంది పీఈటీలున్నా న్యాయస్థానానికి వెళ్లకపోవడంతో వీరికి వర్తించదని అధికారులు పేర్కొంటున్నారు. వీటికి సంబంధించిన ఉత్తర్వులు రావాల్సి ఉందని డీఈవో జి.నాగమణి ‘న్యూస్టుడే’కు తెలిపారు. వస్తే అమలుచేస్తామన్నారు. ఈ నెల 11లోగా ఖాళీలను ప్రదర్శిస్తామన్నారు. 12 నుంచి 16 వరకు ఐచ్ఛికాలు అవకాశం కల్పించినట్లు తెలిపారు. తుది సీనియార్టీ జాబితా 17-19 మధ్య విడుదల కానుందన్నారు.
0 comments:
Post a comment