ఎస్ఈసీ ఆదేశాలను గౌరవిస్తాం
భీమవరం, జనవరి 24: పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఉద్యోగుల బాధ్యతని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధంగా ఏర్పడిందని, దాన్ని గౌరవించాల్సిందేనన్నారు. కొన్ని ఉద్యోగ సంఘాలు ఎన్నికలు నిర్వహించబోమని చెప్పడాన్ని ఖండించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆదివారం ఏపీ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా ఆవిర్భావ సభకు విచ్చేసిన సూర్యనారాయణ మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో ఎన్నికల నిర్వహణపై ఒత్తిడి కొనసాగుతోందన్నారు. తమ అసోసియేషన్ భజన చేయడం కోసం ఏర్పాటు కాలేదన్నారు. 'గొప్పరాజు బొప్పరాజు రెవెన్యూ సంఘం చేసిన ప్రకటన సరికాదు.
రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్థలో మేమంతా ఉద్యో గం చేస్తూ సంఘంగా ఏర్పడ్డాం. ఈసీ ఆదేశాలను గౌరవిస్తాం. అయితే కరోనా సమస్య నెలకొంది. దీనిపై ఇప్పటికే ఈసీ ఒక ప్రకటన చేస్తూ ఉద్యోగులకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చింది.
ప్రతి ఉద్యోగికి కరోనా కిట్లు, మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు ఏర్పాటు చేస్తే ఇబ్బంది ఉండబోదు. ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా అన్నిరకాలుగా సౌకర్యాలు కల్పిస్తే ఎన్నికల నిర్వహణకు ఆటంకాలు ఏర్పడవు. ప్రభుత్వంతో కూడా సమన్వయంగా ముందుకు వెళతాం' అన్నారు. తాము రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రభుత్వ ఆదేశాలకు విలువనిస్తూ ముందుకు వెళతామన్నారు.
0 comments:
Post a comment