🔳సంకల్పం మహోన్నతం...ఆచరణ స్ఫూర్తిదాయకం!
పనిచేసిన పాఠశాలల్లో వసతుల కల్పన
ప్రత్యేకత చాటుకున్న ఉపాధ్యాయులు
బోధించే ఉపాధ్యాయులను బట్టే పాఠశాల ప్రగతి ఆధారపడి ఉంటుంది. ఎంతో మంది ఉపాధ్యాయులు సేవాభావంతో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. కొంతమంది ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకుని పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు కృషి చేస్తుంటారు. మరికొందరు ఉపాధ్యాయులు తమ పాఠశాలలో చదివే పిల్లలకు తోడ్పాటు అందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందుతుంటారు. అలా పలువురు ఉపాధ్యాయులు తాము పనిచేసిన పాఠశాలకు ఏదో ఒకటి చేయాలని తాపత్రయపడుతుంటారు. అలాంటి పలువురు ఉపాధ్యాయులు, వారు అందించిన సేవలపై ప్రత్యేక కథనం.
తాగునీటి వసతికి సాయం
గూడూరు మండలం కంకటావ జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు తాగునీటి సౌకర్యం ఉన్నా అవి ఎప్పుడు, ఎన్ని రోజులు వస్తాయో తెలియని పరిస్థితి. కంకటావతోపాటు కత్తులవానిపాలెం, ఆర్వీపల్లి, లేళ్లగరువు, ఆర్వీపల్లి, నారికేడలపాలెం తదితర గ్రామాల నుంచి కూడా విద్యార్థులు వస్తుంటారు. దూర ప్రాంతాల విద్యార్థులు తాగునీటి సీసాలు తెచ్చుకుంటూ అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఆ పాఠశాల ఉపాధ్యాయిని పద్మావతి స్పందించారు. శుద్ధి చేసిన తాగునీటిని విద్యార్థులకు అందించేందుకు వాటర్ ప్యూరిఫైయర్ ఏర్పాటు చేయాలని సంకల్పించారు. తన ఆలోచనను కుటుంబ సభ్యులతో పంచుకుని, రూ.40 వేలకుపైగా వెచ్చించి పాఠశాలలో శుద్ధజలం ప్లాంటు ఏర్పాటు చేశారు. ఆమె పాఠశాల నుంచి మండలంలోనే వేరే గ్రామానికి బదిలీపై వెళ్లగా, ఇటీవల ఉద్యోగ విరమణ చేశారు.
ఆమె సాయం ఆదర్శనీయం
కొందరు తమ పనితీరు, ప్రతిభ, సేవాభావంతో అందరిలో ప్రత్యేకంగా నిలుస్తారు. ఆ కోవకే చెందుతారు విశ్రాంత ప్రధానోపాధ్యాయిని లక్ష్మీనాంచారమ్మ. గూడూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేసిన హెచ్‌ఎంలలో ఈమె ప్రత్యేక గుర్తింపు పొందారు. పాఠశాల అభివృద్ధికి తనవంతు సాయం అందించి, ఉన్నతంగా తీర్చిదిద్దిన కృషిని గ్రామస్థులు ఇప్పటికీ కొనియాడుతుంటారు. తాగునీటి వసతి లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే ఆమె స్పందించి తన సొంత నిధులతో ట్యాంకు ఏర్పాటు చేయించారు. కుళాయిలు తదితర సౌకర్యాలు కల్పించారు. వంట గది నిర్మించారు. ఇలా రూ.2 లక్షలకుపైగా వెచ్చించి అనేక వసతులు కల్పించారు. నైట్ వాచ్‌మెన్, అటెండర్‌లను నియమించి కొన్నేళ్లపాటు సొంతంగా జీతాలు ఇచ్చారు. ఇందుకు ఆమె రూ.6 లక్షలకు పైగా వెచ్చించారు. చేసిన సేవలకు గుర్తింపుగా ప్రజాప్రతినిధుల నుంచి అధికారులు, ఉపాధ్యాయులు కూడా ఆమెను అమ్మ అని గౌరవంగా పిలుస్తుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 పాఠశాలలకు గ్రేడ్-1 హోదా కల్పించగా, నాంచారమ్మ హయాంలో గూడూరు పాఠశాలకు ఆ హోదా దక్కడం ఆమె పనితీరుకు నిదర్శనం. ప్రస్తుతం ఆమె ఉద్యోగ విరమణ చేశారు.
పచ్చదనం పరిఢవిల్లాలని..
ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ ఉద్యోగ జీవితంలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తుంటారు. కానీ కొందరు మాత్రం తమదైన ముద్ర వేసుకుని వెళ్తుంటారు. అలా పెడన మండలం చెన్నూరు జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎంగా పనిచేసిన వి.ప్రభాకరరావు గ్రామస్థుల మనసుల్లో నిలిచిపోయారు. ఆయన చెన్నూరు నుంచి బదిలీపై చల్లపల్లి మండలం మంగళాపురం ఉన్నత పాఠశాలకు వెళ్లారు. మండలంలో మేజర్ పంచాయతీలో ముందువరసలో ఉండేది చెన్నూరు ఉన్నత పాఠశాల. గ్రామంతోపాటు కమలాపురం, తాళ్లచెరువు, గొల్లగూడెం, ఉరిమి తదితర గ్రామాలకు చెందిన విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుతారు. పాఠశాలకు విశాలమైన ప్రాంగణం ఉన్నా ఆహ్లాదంగా లేకపోవడం ఆయన్ని ఆలోచింపజేసింది. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటించాలని నిర్ణయించారు. దీనికి ఆయన దాదాపు రూ.లక్ష వెచ్చించి మొక్కలు నాటడంతోపాటు వాటిని మానులుగా చేయాలన్న లక్ష్యంతో రక్షణగా ట్రీగార్డులు ఏర్పాటు చేశారు. ఆయన నాటిన మొక్కలు పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రభాకర్‌ను నిరంతరం గుర్తు చేస్తున్నాయి.
ఆ చొరవ అభినందనీయం
బందరు మండలంలోని శిరివెళ్లపాలెం ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మహంకాళి కృష్ణమూర్తి చూపిన చొరవ ఎంతో మంది ఉపాధ్యాయులకు ఆదర్శనీయం. ఆయన పెడన మండలంలోని చేవెండ్ర జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి బదిలీపై బందరు మండలం వచ్చారు. శిరివెళ్లపాలెంలో ప్రాథమికోన్నత నుంచి వర్గోన్నతి పొందిన పాఠశాలకు భవనాలు లేక, నిర్మించుకోవడానికి స్థలం లేక ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యను గుర్తించిన ఆయన వృత్తిరీత్యా దూర ప్రాంతంలో ఉంటున్న గ్రామస్థులు నల్లమోతు సుబ్బారావు, విశ్వేశ్వరరావులను సంప్రదించి 40 సెంట్ల స్థలాన్ని పాఠశాలకు కేటాయించేలా కృషి చేశారు. ఆ స్థలాన్ని ఇచ్చిన దాతలను అందరూ ప్రశంసిస్తూనే కృష్ణమూర్తి చూపిన చొరవను కొనియాడుతుంటారు. ఇటీవల ఆ స్థలంలో రూ.60 లక్షలతో భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జోగి రమేష్ శంకుస్థాపన చేశారు. విద్యార్థులకు తనవంతుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పటికీ చేవెండ్ర నుంచి విద్యార్థులు ఆయన వద్దకు వస్తారంటే ఆయన పిల్లలతో ఎలా ఉంటారో అర్థం చేసుకోవచ్చు.
0 Comments:
Post a Comment