APPSC : ఏపీపీఎస్సీలో ప్రక్షాళన- పరీక్షలన్నీ ఆన్‌లైన్- లీకులకు చెక్-యూపీఎస్సీకి ప్రతిపాదన.
ఇప్పటికే పరీక్షల నిర్వహణలో ఏపీపీఎస్సీకి ఉన్న సమర్ధతను దృష్టిలో ఉంచుకుని గ్రామ సచివాలయాల పరీక్షల విషయంలోనూ ఏపీపీఎస్సీ సహకారం తీసుకున్నారు. తాజాగా ఇందులో పరీక్షల విధానంలో పూర్తిగా ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం భావి్స్తోంది. ఈ మేరకు రూపొందించిన ప్రతిపాదలను యూపీఎస్సీకి పంపారు. వీటికి ఆమోదం లభిస్తే ఇక పరీక్షల నిర్వహణలో పెను మార్పులు చోటు చేసుకుంటాయని భావిస్తున్నారు.
ఏపీపీఎస్సీ పరీక్షలన్నీ ఆన్‌లైన్
తాజాగా చేస్తున్న మార్పుల ప్రకారం ఇకపై ఏపీపీఎస్సీ పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. టెక్నాలజీని వినియోగించుకుంటూ ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణ చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే పలు జాతీయ స్ధాయి పరీక్షలు ఆన్‌లైన్లోనే జరుగుతున్న నేపథ్యంలో ఏపీపీఎస్సీ పరీక్షలనూ పూర్తిగా ఆన్‌లైన్‌కు మార్చాలని భావిస్తున్నారు. కంప్యూటర్ ల్యాబ్‌ల ద్వారా ఏపీపీఎస్సీ పోటీ పరీక్షల నిర్వహణ చేపట్టనున్నారు. దీంతో పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో ప్రశ్నాపత్రాలు
ఇకపై ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షల ప్రశ్నాపత్రాలను జాతీయ, అంతర్జాతీయ స్ధాయి నిపుణులతో రూపొందించేలా కసరత్తు జరుగుతోంది. తాజాగా యూపీఎస్సీకి పంపిన ప్రతిపాదనల్లో ఈ అంశం కూడా ముఖ్యమైనది. అలాగే టెక్నాలజీ వినియోగంతో పరీక్షా పత్రాల మూల్యాంకనం చేపట్టనున్నారు. ఇప్పటికే మెయిన్స్ పరీక్షల్లో ఈ విధానం ప్రయోగాత్మకంగా పరీక్షించారు. సక్సెస్ కావడంతో ఇకపై ఈ విధానం అమలుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్ధాయి నిపుణులతో పరీక్షా పత్రాల రూపకల్పన ద్వారా పోటీపడే అభ్యర్ధుల అర్హత స్ధాయి కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
ఆన్‌లైన్‌తో లీకులకు చెక్
పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల రూపకల్పన నుంచి పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం వరకూ అంతా ఆన్‌లైన్‌లో పకడ్బందీగా నిర్వహించడం ద్వారా లీకులకు చెక్ పెట్టాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది. ఈ మేరకు తాజా విధానం రూపొందిస్తున్నారు. ఏపీపీఎస్సీకి చెందిన అన్ని రకాల నోటిఫైడ్ పోస్టులకు వన్‌టైమ్ రిజిస్ట్ర్రేషన్ ప్రక్రియ నిర్వహించాలని కూడా ఏపీపీఎస్సీ నిర్ణయించింది. దీని ద్వారా సమయం కూడా ఆదా కానుంది. ఏపీపీఎస్సీ రూపొందించిన ఈ కొత్త విధానంపై తమిళనాడు ప్రభుత్వం కూడా ఆసక్తి చూపుతోంది. ఏపీపీఎస్సీ విధానాలను తాము కూడా అమలు చేస్తే ఎలా ఉంటుందని అక్కడి పళని స్వామి సర్కారు ఆలోచిస్తోంది.
0 Comments:
Post a Comment