Andhra Pradesh: అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్..! ఒక్కొక్కరిపై భారమెంతో తెలుసా..! కాగ్ రిపోర్ట్ లో షాకింగ్ నిజాలు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుల భారం మరింత ఎక్కువైంది. గతేడాది నవంబర్ నాటికి రాష్ట్ర ప్రభుత్వం నెత్తిన రూ.3,73,140 కోట్ల అప్పులున్నట్లు కాగ్ తేల్చింది. ఈ లెక్కన అప్పులను రాష్ట్రంలోని 5.39 కోట్ల మందికి విభజిస్తే ఒక్కొక్కరిపై రూ.70వేల వరకు భారం పడనుంది. అంతేకాదు ప్రస్తుత హయాంలో ప్రతి పనీ అప్పుతోనే జరుగుతోందని స్పష్టం చేసింది. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.48,295.59 కోట్లు అప్పు చేసేందుకు మాత్రమే అవకాశముంది. కానీ 2020 ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 73,811.85 కోట్లు అప్పులు చేసింది. ఒక్క నవంబర్ నెలలోనే ఉచిత పథకాల కోసం ప్రభుత్వం రూ.13,001 అప్పు చేసింది.
పడిపోతున్న రాబడి.. పెరుగుతున్న రెవెన్యూ లోటు ఆ ఆర్ధిక సంవత్సరంలో రెవెన్యూ లోటు రూ.18,434.15 కోట్లుగా ఉండగా.. గతేడాది నవంబర్ చివరి నాటికే ఇది ఏకంగా రూ.57,925.47 కోట్లకు పెరిగింది. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వం నెలకు సగటున రూ.9226.35 కోట్లు అప్పు చేసింది. ప్రస్తుత పరిస్థితిల్లో ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసేలోపు అంటే మార్చి 31లోపు ప్రభుత్వం మరో రూ.30,000 కోట్లు అప్పుచేసే అవకాశముంది. 2020-21లోనే ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.03 లక్షల కోట్లకు చేరునుందని ఆర్ధిక శాఖ వర్గాలు తెలిపారు. 2014 జూన్ నాటికి అంటే రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేస్ పై రూ.97,000 కోట్ల అప్పుల భారం ఉంది. ఇది ఐదేళ్ల తర్వాత అంటే 2019 మార్చి నాటికి రూ.2,58,928 కోట్లకు చేరింది. ఇక 2019 ఏప్రిల్ నుంచి 2020 నవంబర్ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులు, ఇతర మార్గాల ద్వారా రూ.1,14,212.81 కోట్లు అప్పు చేసింది. ఇందులో రూ.1,06,866.25 కోట్ల రుణాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే చేసింది. ఈ ఆర్ధిక సంవత్సరంలోని తొలి 8 నెలల కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం రూ.70,082.90 కోట్ల రాబడి వ్యయాన్ని ఉచిత పథకాలకే ఖర్చు చేసింది.
అంతకుముందు జగన్ ప్రభుత్వం కొవిడ్ లాక్ డౌన్ నష్టాన్ని సాకుగా చూపిస్తూ ప్రజలపై రూ.21,000 కోట్ల పన్నుల భారం వేసింది. లాక్ డౌన్ ను పక్కనబెడితతే రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబర్ నాటికి రూ.46,589 కోట్ల ఆదాయాన్ని చవిచూసింది. ఇది గత ఆర్ధిక సంవత్సరంలోని రాబడి కంటే రూ.4,500 కోట్లు తక్కువ. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి రూ.8వేల కోట్ల అదనపు గ్రాంట్ ను తెచ్చుకుంది. ఇలాగే ప్రభుత్వం నూతనాం స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి దీని ద్వారా ఎస్బీఐ, కెనరా బ్యాంక్ మరియు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా రూ.10వేల కోట్లు సమీకరించినట్లు ఆర్ధిక శాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయనున్న అమ్మఒడి పథక కింద 43లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15వేలు చొప్పున జమ చేసేందుకు రూ.6,500 కోట్లు ఖర్చు చేయనుంది. ఇందులో రూ.3వేల కోట్లు ఎస్బీఐ నుంచి అప్పుగా తీసుకోనుంది.
అధికారుల విస్మయం
ప్రస్తుత పరిస్థితిపై సీనియర్ అధికారులు ఆశ్యర్యపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి అప్పుచేసి పప్పుకూడు సినిమాను తలపిస్తోందని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఇక సీనియర్ అధికారుల అంచనా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది నుంచి రూ.35 వేల కోట్లు వడ్డీ కింద చెల్లించాల్సి రావొచ్చని అభిప్రాయపడ్డారు. అలాగే కేంద్రం ఇచ్చే గ్రాంట్లు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు ఇతర ఖర్చులకే సరిపోతున్నట్లు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం 19 నెలల్లోనే రూ.1.5 లక్షల కోట్లు అప్పు చేసిందని.. అలాగే ప్రజలపై రూ.75వేల కోట్ల పన్నుల భారం వేసిందని ఆరోపించారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో టాప్ లో ఉండగా..అభివృద్ధిలో అట్టడుగున ఉందని విమర్శించారు.
0 comments:
Post a comment