80సీ మినహాయింపు రూ.3 లక్షల వరకు!
కేంద్ర బడ్జెట్లో పరిమితి పెంచే అవకాశం
ట్యాక్స్ శ్లాబులు యథాతథం?
న్యూఢిల్లీ, జనవరి 20: సెక్షన్ 80సీ కింద ఆదాయం పన్ను (ఐటీ) మినహాయింపు పరిమితిని రూ.3 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం పెంచే అవకాశాలున్నాయని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ పరిమితి రూ.1.5 లక్షలుగా ఉన్నది. రాబోయే బడ్జెట్లో ఈ మేరకు నిర్ణయం ఉండవచ్చని సమాచారం. ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను ఫిబ్రవరి 1న పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగానే సెక్షన్ 80సీ కింద ఐటీ మినహాయింపు పరిమితిని మరో రూ.1.5 లక్షలు పెంచవచ్చని అంటున్నారు. అయినప్పటికీ వ్యక్తిగత ఆదాయం పన్ను శ్లాబుల జోలికి మాత్రం మోదీ సర్కారు వెళ్లకపోవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాగా, ఐటీ మినహాయింపు పరిమితులపై చర్చలు జరుగుతున్నాయని ఓ ఐటీ శాఖ అధికారి చెప్తున్నారు. అయితే ‘వ్యక్తిగత ఆదాయం పన్నులోని మినహాయింపు పరిమితుల మార్పుపై చర్చలు జరుగుతున్నాయి. సేవింగ్స్‌పై పన్ను మినహాయింపు పరిమితిని రూ.1.5 లక్షల నుంచి 2 లక్షలకు పెంచవచ్చు’ అని చెప్తున్నారు. నిజానికి గత నాలుగైదేండ్లుగా వీటి జోలికే ప్రభుత్వం వెళ్లలేదు. ఇదిలావుంటే కరోనా వైరస్‌తో కేంద్ర ప్రభుత్వ ఆదాయ-వ్యయాలు తలకిందులైన నేపథ్యంలో సగటు పన్ను చెల్లింపుదారునికి ఈసారి బడ్జెట్లో పెద్దగా ఊరట ఉండకపోవచ్చని తెలుస్తున్నది.
గృహ రుణాలపై..
గృహ రుణాలపై చెల్లించే అసలు, వడ్డీలకు సంబంధించి ఉన్న పన్ను మినహాయింపు పరిమితిని కూడా రాబోయే బడ్జెట్ సందర్భంగా కేంద్రం పెంచే వీలుందని, ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని ఐటీ వర్గాలు చెప్తున్నాయి. కరోనా వైరస్ దెబ్బకు నిర్మాణ రంగం కుదేలైన నేపథ్యంలో ఇండ్ల అమ్మకాలు పుంజుకునేలా గృహ రుణగ్రహీతలకు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఊరట ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఏటా హోం లోన్లపై చెల్లించే వడ్డీకి రూ.2 లక్షల వరకు, అసలుకు రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తున్నది.
ఆటో డీలర్ల డిమాండ్లు
ఆదాయం పన్ను చెల్లించే వ్యక్తుల కోసం వాహనాలపై తరుగుదల క్లయిమ్ ప్రయోజనాలను ప్రవేశపెట్టాలని ఆటోమొబైల్ డీలర్ల సంఘాల సమాఖ్య కేంద్ర ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేసింది. దీనివల్ల వాహనాలకు డిమాండ్ పెరుగుతుందని చెప్పింది. అలాగే కార్పొరేట్ల కోసం తరుగుదల వ్యవధిని పొడిగించాలని, అంతేగాక 0.1 శాతం వార్షిక టీసీఎస్ నుంచి డీలర్లకు మినహాయింపు ఇవ్వాలని సమాఖ్య కోరింది.
80సీ అంటే?
పన్నుల ఆదాకు ఐటీ చట్టంలోని సెక్షన్ 80సీ చాలా ముఖ్యమైన మార్గం. ప్రధానంగా ఐటీ పరిధిలోకి వచ్చే మధ్యతరగతి వర్గాలకు గొప్ప ఊరట. ప్రస్తుతం ఏటా రూ.1.5 లక్షల వరకు స్థూల ఆదాయం నుంచి సెక్షన్ 80సీ కింద వివిధ పెట్టుబడులు, ఖర్చులపై పన్ను మినహాయింపులను పన్ను చెల్లింపుదారులు పొందవచ్చు. బీమా ప్రీమియం, పెన్షన్ విరాళం, సేవింగ్స్ ఖాతాపై వడ్డీ, ఇంటి అద్దెలు, గృహ, విద్యా రుణాలపై వడ్డీ చెల్లింపులు తదితరాలను సెక్షన్ 80సీ కింద చూపించుకోవచ్చు. దీంతో ఐటీ చెల్లింపుల భారం తగ్గడమో.. లేదంటే పూర్తిగా తప్పడమో జరుగుతుంది.
ఆరోగ్య బీమాకు దన్ను?
కరోనా మహమ్మారి కారణంగా ఆరోగ్య బీమాకు ఇప్పుడు అంతా ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో సెక్షన్ 80డీ కింద ఆరోగ్య బీమా ప్రీమియంలను మరింతగా క్లయిమ్ చేసుకునే అవకాశాన్ని ఈ బడ్జెట్లో మోదీ సర్కారు పన్ను చెల్లింపుదారులకు కల్పించే వీలుందని సమాచారం. ప్రస్తుతం ఆరోగ్య బీమా ప్రీమియంలపై రూ.25వేల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. దీన్ని రెట్టింపు చేసే అవకాశాలున్నాయని నిపుణులు చెప్తున్నారు.
బ్యాంకులకు రూ.25,000 కోట్లు...
ఈసారి బడ్జెట్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధన అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.25,000 కోట్లను కేటాయించే అవకాశాలున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గత నెల విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదికలో ప్రభుత్వ బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు ఈ ఏడాది సెప్టెంబర్ ఆఖరుకల్లా 16.2 శాతానికి ఎగబాకే వీలుందని చెప్పిన విషయం తెలిసిందే. నిరుడు సెప్టెంబర్ నాటికి 9.7 శాతంగా ఉన్నాయి. ఈ క్రమంలో మరింత మూలధనాన్ని సమకూర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సెంట్రల్ బ్యాంక్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే రాబోయే బడ్జెట్లో సర్కారీ బ్యాంకుల ఆర్థిక అవసరాలకు రూ.25,000 కోట్లను పక్కన పెట్టవచ్చన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఏయే బ్యాంక్‌కు ఎంతెంత మూలధనం కావాలో కేంద్రం తెలుసుకుంటున్నది కూడా. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత అసలు కేటాయింపులు తేలవచ్చంటున్నారు.
0 comments:
Post a comment