కొత్త ఏడాది 2021లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. అంగవైకల్య పరిహారం అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే, విధి నిర్వహణలో గాయాలపాలై అంగవైకల్యం ఏర్పడే వారికి పరిహారం ఇస్తారన్నమాట. అంగవైకల్యం తర్వాత కూడా విధుల్లో కొనసాగుతున్న వారికి దీని కింద లబ్ధి జరగనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కేంద్ర భద్రతా బలగాలకు పెద్ద ఎత్తున లబ్ధి జరుగుతుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు.. ముఖ్యంగా సీఏపీఎఫ్, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్‌లో విధి నిర్వహణలో ఎంతో మంది గాయపడుతూ ఉంటారు. కానీ, వారు తమ సర్వీస్ కొనసాగిస్తూ ఉంటారు.
అలాగే, రైల్వేలో కూడా విధి నిర్వహణలో గాయాలపాలు అవుతూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వ భారీ పరిశ్రమల్లో పనిచేసే వారికి కూడా దీని వలన ప్రయోజనం కలగనుంది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉద్యోగుల కోసం నిబంధనలను సరళీకృతం చేస్తోందని కేంద్ర మంత్రి అన్నారు. సంక్లిష్టంగా, వివక్ష పూరితంగా ఉన్న నిబంధనలను మారుస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో విధులు నిర్వహించే వారికి మరింత ఉపయుక్తంగా ఉండేందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
ఈ కొత్త ఆర్డర్ ద్వారా సర్వీస్ రూల్స్ విషయంలో క్రియాశీలక మార్పులు రానున్నాయి. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సవాళ్లకు తగినట్టు వారికి ప్రయోజనం కలిగించేలా రూల్స్ మార్చనున్నారు. గతంలో ఉన్న నిబంధనల వల్ల కొందరు లబ్ధి పొందలేదు. 2004 జనవరి 1న లేదా ఆ తర్వాత విధుల్లో చేరిన వారికి ఈ స్థాయి కాంపెన్సేషన్ ఉండేది కాదు. అలాగే, నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద ఉన్నవారికి కూడా ఈ ప్రయోజనం ఉండేది కాదు. అయితే, ఇప్పుడు మార్చిన రూల్స్ వల్ల నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద ఉన్న వారు కూడా ఎక్స్ట్రార్డినరీ పెన్షన్ పథకం కింద లబ్ధి పొందుతారు.
0 Comments:
Post a Comment