🔳ఆదాయపన్నులో భారీ రాయితీ?
50-80 వేల దాకా ఇవ్వొచ్చని అంచనా
పన్ను ఆదాయం పరిధిని పెంచే యోచన!
గృహ రుణ వడ్డీలపై పన్ను రాయితీ పెంపు
వృద్ధికి ఊతమిచ్చేలా బడ్జెట్!
న్యూఢిల్లీ, జనవరి 28(ఆంధ్రజ్యోతి): దేశంలో భారీ ఎత్తున వినియోగాన్ని ప్రోత్సహించేలా.. ప్రజల చేతుల్లో నగదు ఎక్కువ ఉండేలా.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఆదాయపన్ను భారంలో రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకూ రాయితీ కల్పించే అవకాశాలున్నాయని, స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.లక్ష వరకు పెంచే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. పన్ను విధించే ఆదాయం పరిధి పెంచే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
అలాగే ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం ఇల్లు కొనుగోలు చేసినవారికి గృహ రుణ వడ్డీపై రూ.2 లక్షల దాకా చేసే చెల్లింపులపై పన్ను లేదు. కేంద్ర ప్రభుత్వం దాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే.. తొలిసారి ఇల్లు కొనుక్కునేవారికి అదనపు ప్రయోజనాలు ప్రకటిస్తారని తెలుస్తోంది. వైద్య, ఆరోగ్య బీమా రంగాలకు, మౌలిక సదుపాయాలు, సూక్ష్మ, మధ్యతరహా(ఎంఎ్‌సఎంఇ) ఉత్పాదక రంగాలకు, మార్కెట్లో నగదు ప్రవాహానికి ఊతమిచ్చేలా ఈ బడ్జెట్ ఉంటుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
కొవిడ్ అనంతరం ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ కనుక అభివృద్ధికి ఊతమిచ్చేలా ఉంటుందని ఆర్థిక వర్గాల అంచనా. ఇక రూ.15 లక్షలకు పైగా ఆదాయం పొందుతున్న వారి సౌలభ్యం కోసం కొత్త పన్ను వ్యవస్థను ప్రవేశపెట్టే అవకాశం ఉం దని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. గత బడ్జెట్ లో ప్రవేశపెట్టిన నూతన పన్ను వ్యవస్థ శ్లాబుల్లోనూ మార్పులుంటాయని సమాచారం.
ఉత్పాదక రంగాన్ని ప్రధానంగా ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు కొన్ని వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని పెంచనున్నారని.. గృహ నిర్మాణ రంగం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పుంజుకునేలా నిర్మల అనేక నిర్ణయాలు ప్రకటించవచ్చునని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
ఆర్థిక లోటు ఉన్నా..
రిజర్వు బ్యాంకు నివేదిక ప్రకారం 2021 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జీడీపి 7.5 శాతానికి కుదించుకుపోవచ్చునని.. దీని వల్ల ఆర్థిక లోటు అంచనా వేసిన 3.6 శాతానికి కంటే ఎక్కువ ఉండవచ్చని, ఇది ప్రభుత్వ ఆర్థిక వనరులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం వ్యయాన్ని పెంచే అవకాశాలు ఉన్నాయి. ఆటోమొబైల్ రంగానికి చేయూతనిచ్చే విధంగా ప్రోత్సాహకాలు కూడా ప్రకటించే అవకాశాలున్నాయి.
వ్యవసాయం, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి పథకం, గ్రామీణ విద్యుదీకరణ, రహదారులకు పెట్టుబడులు పెరుగుతాయని అంచనా. వేగంగా అమ్ముడుపోయే వినియోగ వస్తువులు(ఎ్‌ఫఎంసీజీ), వ్యవసాయ ఉపకరణాలు, ట్రాక్టర్లు, సిమెంట్, రైల్వే అనుబంధ కంపెనీలకు ఈ బడ్జెట్ ద్వారా అధిక ప్రయోజనం లభించే అవకాశాలున్నాయని వాణిజ్య వర్గాలు అంచనా వేస్తున్నాయి.
బలమైన స్వదేశీ ఉత్పాదక సామర్థ్యం కల దేశీయ వినియోగ కంపెనీలు, పాదరక్షలు, రసాయనాలు, ఆగ్రో కెమికల్స్‌కు ఈ బడ్జెట్ సానుకూలంగా ఉంటుందని ఆ వర్గాలు చెబుతున్నాయి. పాత వాహనాలను త్వరగా అమ్మేందుకు గడువుకాలాన్ని నిర్ణయించి, కొత్త వాహనాలు అమ్ముడుపోయేందుకు బడ్జెట్లో చర్యలు ప్రకటించవచ్చునని భావిస్తున్నారు.
0 comments:
Post a comment