🔳ఏప్రిల్, మే నెలల్లో ఇంటర్ పరీక్షలు
తప్పనిసరిగా ప్రాక్టికల్స్ నిర్వహిస్తాం
ఈనెల 18 నుంచి ఆరు, ఇంటర్ ప్రథమ తరగతులు
మంత్రి ఆదిమూలపు సురేష్
ఏప్రిల్, మే నెలల్లో ఇంటర్ పరీక్షలు
ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్, మే నెలల్లో ఉంటాయని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. సచివాలయంలో ఆయన శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ..‘‘ఏప్రిల్, మే నెలల్లో జరిగే పబ్లిక్ పరీక్షల ఫలితాలు వెల్లడించిన అనంతరం యథావిధిగా ఇంప్రూవ్‌మెంట్, ఇన్‌స్టెంట్ పరీక్షలు ఉంటాయి. సీనియర్ ఇంటర్ విద్యార్థులకు తప్పనిసరిగా ప్రాక్టికల్స్ నిర్వహిస్తాం. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఈనెల 18న తరగతులు ప్రారంభమవుతాయి. విద్యా సంవత్సరం ప్రారంభం ఆలస్యమైనందున బోధన పనిదినాలు 160రోజులకు పరిమితం చేశాం. ఆరో తరగతి విద్యార్థులకు కూడా ఈ నెల 18 నుంచి తరగతులు మొదలవుతాయి. 1-5వ తరగతుల ప్రారంభంపై సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారు. కొవిడ్ వల్ల కాస్త ఆలస్యమైనా అసోం, ఏపీలో మాత్రమే విద్యా సంవత్సరం యథావిధిగా నడుస్తోంది’’ అని తెలిపారు.
వచ్చే ఏడాది ఆన్‌లైన్‌లోనే ఇంటర్ ప్రవేశాలు
‘‘వచ్చే విద్యా సంవత్సరం(2021-2022) నుంచి ఇంటర్ ప్రవేశాలు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తాం. కార్పొరేట్ యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలు అమలుచేయకపోతే కఠిన చర్యలు తప్పవు. ఆకస్మిక తనిఖీలు ఇకపై నిరంతరం జరుగుతుంటాయి. విద్యార్థుల వసతిగృహాల నిర్వహణకు అవసరమైతే కొత్త నిబంధనలు తెస్తాం. కొవిడ్ కారణంగా ట్యూషన్ ఫీజులో 70 శాతమే యాజమాన్యాలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. ప్రవేశాల సమయంలో విద్యార్థుల నుంచి ఒరిజినల్ ధ్రువపత్రాలు తీసుకొని పరిశీలించి వెనక్కి ఇచ్చేయాలి. నిబంధనలు అతిక్రమిస్తే యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులు డీజీపీకి లేఖ రాశారు. అమ్మఒడి లబ్ధిదారుల మినహాయింపు జాబితాలో పారిశుద్ధ్య కార్మికులు, ట్యాక్సీలు, ట్రాక్టర్లు కలిగిన వారు ఉన్నారు. అర్హులైన లబ్ధిదారుల జాబితాను త్వరలోనే ప్రకటిస్తాం’’ అని మంత్రి వెల్లడించారు
0 Comments:
Post a Comment