ప్రభుత్వ ఉద్యోగులకు 15% జీతాల పెంపు!
వేతన సవరణ సంఘం సిఫార్సు
సీఎస్ సోమేశ్‌కుమార్‌కు సీల్డుకవర్లో నివేదిక
అధ్యయనం చేసి సీఎంకు నివేదిస్తామని సీఎస్ వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు 15 శాతం (ఫిట్మెంటు) వేతనం పెంచాలని రాష్ట్ర వేతన సవరణ సంఘం (పే రివిజన్ కమిషన్) ప్రభుత్వాన్ని కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కమిటీ ఛైర్మన్ సీఆర్ బిశ్వాల్, సభ్యుడు మహ్మద్ రఫత్ అలీలు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు బీఆర్కే భవన్లో నివేదిక అందజేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది తొలి నివేదిక. గురువారంతో వేతన సవరణ సంఘం కాలపరిమితి ముగుస్తున్న నేపథ్యంలో సీఎస్‌కు నివేదికను అందించింది. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, టీఎన్జీవో, టీజీవోల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, మమత, ప్రతాప్, సత్యనారాయణ, సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు నరేందర్‌రావు, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు. సుదీర్ఘ కసరత్తు అనంతరం పీఆర్సీ సీల్డుకవర్లో ఈ నివేదికను అందించింది. దాని వివరాలను వెల్లడించలేదు. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం 15 శాతం ఫిట్‌మెంట్‌కే కమిషన్ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ప్రభుత్వంలో ఉద్యోగులకు 29 శాతం వేతనం (ఫిట్మెంట్) పెంపునకు కమిషన్ సిఫార్సు చేసింది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం సీఎం కేసీఆర్ నివేదికకు భిన్నంగా 43 శాతం వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ తొలి పీఆర్సీ ఏర్పాటైన తర్వాత దానిపై భారీ ఆశలు ఏర్పడ్డాయి. 43 శాతం కంటే అదనంగా ఉంటుందని ఉద్యోగవర్గాలు మొదట్లో భావించాయి. అయితే ఆ తర్వాత పరిణామాలు అనూహ్యంగా మారాయి. దేశమంతటా ఆర్థిక సంక్షోభం, ఆ తర్వాత కరోనా రావడంతో ఆర్థిక ప్రతిష్టంభన ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో పీఆర్సీపై ఉత్కంఠ ఏర్పడింది. వేతన సంఘం సైతం ఆచితూచి, అన్ని అంశాలను పరిగణనలోనికి తీసుకొని తాజాగా నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది.
నివేదికలో ఏముంది?
తెలంగాణ కోణంలో పూర్తిగా నివేదిక రూపొందింది. ఉద్యోగుల జీతభత్యాలతో పాటు కనీసవేతనం, కరవుభత్యం, ఇంక్రిమెంట్లు, పదవీ విరమణలు, పదోన్నతులు, హోదాల పెంపుదల, ఇంటిఅద్దె భత్యం, ప్రయాణ సెలవు భత్యం, వైద్య సౌకర్యాలు, పింఛను, తదితర అంశాలను నివేదించింది.
రెండున్నరేళ్ల తర్వాత...
ప్రభుత్వం 2018 మే 18న విశ్రాంత ఐఏఎస్ అధికారి సీఆర్ బిశ్వాల్ ఛైర్మన్‌గా తొలి వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇద్దరు విశ్రాంత ఐఏఎస్ అధికారులు ఉమామహేశ్వర్రావు, మహ్మద్ అలీ రఫత్లు సభ్యులుగా నియమితులయ్యారు. కమిషన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కొత్త వేతన సవరణ మార్గదర్శకాలపై మూడు నెలలలోపు నివేదిక ఇవ్వాలని అప్పట్లో ప్రభుత్వం ఆదేశించింది. తర్వాత సెప్టెంబరులో, 2019 ఏప్రిల్, నవంబరు, 2020 ఫిబ్రవరిలో గడువు పొడిగించింది. తాజా గడువు మేరకు కమిషన్ నివేదిక ఇచ్చింది.
నివేదికపై అధ్యయనం చేస్తాం: సీఎస్
పీఆర్సీ నివేదికపై అధ్యయనం చేసి పూర్తిస్థాయిలో విశ్లేషించాక సీఎంకు నివేదిస్తామని సీఎస్ సోమేశ్‌కుమార్ తెలిపారు. నివేదిక అధ్యయనానికి తన అధ్యక్షతన ప్రభుత్వ ముఖ్యకార్యదర్శులు రామకృష్ణారావు, రజత్‌కుమార్‌లతో త్రిసభ్య సంఘం ఏర్పాటు చేసిందన్నారు. త్వరగా ఈ ప్రక్రియను ముగించాలని సీఎం ఆదేశించారన్నారు. నివేదికపై శుక్రవారం నుంచి అధ్యయనం చేసి.. జనవరి 2వవారంలో ఉద్యోగ సంఘాలతో చర్చిస్తామన్నారు.
Congratulations to TS employees
ReplyDelete