మూడుకు మేం రెడీ
'తరలింపు' ప్రణాళికలను సిద్ధం చేశాం!
హైకోర్టును కర్నూలుకు మార్చండి
'రీలొకేట్' నోటిఫికేషన్ ఇప్పించండి
పోలవరానికి రూ.20 వేల కోట్లు చాలవు!
55 వేల కోట్ల ఆమోదానికి సహకరించండి
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి
వరద ప్రాంతాలకు ఆర్థిక సాయం చేయండి
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు జగన్ వినతి
షాతో ఢిల్లీలో గంటకుపైగా చర్చలు
సాగు చట్టాలపై మద్దతు కోరిన అమిత్‌షా
నేడు ప్రధానితో భేటీకి సీఎం యత్నం
న్యూఢిల్లీ, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు.
విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా, కర్నూలును రాజధానిగా చేస్తూ గత ఆగస్టులో చట్టం కూడా చేశామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకొచ్చారు. అందువల్ల హైకోర్టును కర్నూలుకు రీలొకేట్ చేసేలా నోటిఫికేషన్ జారీచేయాలని విజ్ఞప్తి చేశారు. 2019లో బీజేపీ మేనిఫెస్టోలో కూడా కర్నూలులో హైకోర్టు అంశం ఉందని గుర్తుచేశారు.
ఈ మేరకు ఆయనకు వినతి పత్రం సమర్పించారు. మంగళవారం రాత్రి 8.40 గంటలకు అమిత్‌షాతో ఆయన భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా వారి భేటీ కొనసాగింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించేలా సహకరించాలని కోరారు. ఆ ప్రాజెక్టు పూర్తికి రూ.20,398 కోట్లు చాలవని.. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) కూడా ఇదే చెప్పిందని తెలిపారు. 2017-18 ధరల సూచీని అనుసరించి సవరించిన అంచనాలు రూ.55,656 వేల కోట్లకు ఆమోదముద్ర వేయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 2005-06తో పోలిస్తే 2017-18నాటికి తరలించాల్సిన నిర్వాసిత కుటుంబాల సంఖ్య 44,574 నుంచి 1,06,006కు పెరిగిందన్నారు. ముంపు బారినపడే ఇళ్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగినట్లు తెలిపారు. అంచనాల కుదింపుపై పునరాలోచన చేయాలని, 2022 మార్చి నాటికి నిర్దేశించుకున్న గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఆర్థిక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని పునరుద్ఘాటించారు. హోదాతోనే రాష్ట్రం స్వయం సమృద్ధి సాధిస్తుందన్నారు. జీఎస్టీ బకాయిలు రూ.4,308.46 కోట్లను తక్షణమే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని.. ఉపాధి హామీ పథకంలో పెండింగ్‌లో ఉన్న రూ.3,801.98 కోట్లను తక్షణమే విడుదల చే యించాలని కోరారు. ఇటీవల నివర్ తుఫాను కారణంగా చేతికొచ్చిన పంట నీళ్ల పాలైందని.. పెద్దఎత్తున ఆస్తినష్టం జరిగిందని.. రహదారులు, ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులు దెబ్బతిన్నాయని చెప్పారు. ఽధాన్యం తడిసి రంగు మారిపోవడమే కాకుండా.. ఎక్కువరోజులు నీటిలోనే ఉండిపోవడంతో.. మొక్కలు మొలిచాయని.. వాటివల్ల రైతు తీవ్రంగా నష్టపోయాడని వివరించారు. గతంలో రంగు మారిన ధాన్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా సేకరించేవారిమని.. ఇప్పుడు మొలకలెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని.. ఇతర పంటల కొనుగోలుకూ సాయమందించాలని కోరారు. ఉపాధి హామీ పథకం కింద 3,801 కోట్లు విడుదల చేయాలని అభ్యర్థించారు. రాష్ట్రంలో తుఫాను, వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాలను ఆదుకోవడానికి జాతీయ విపత్తుల సహాయ నిధి నుంచి సాయం అందించాలని కోరారు. 2013-14 నుంచి 2018-19 వరకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సబ్సిడీ బియ్యం పంపిణీకి సంబంధించి కేంద్రం చెల్లించాల్సిన రూ.1,600 కోట్లను తక్షణమే విడుదల చేయించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా నియంత్రణ చర్యలు, వ్యాక్సిన్ తదితర అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లోనే అతితక్కువ మరణాలు ఉన్నాయని, దేశంలోనే అత్యధికంగా కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా తమ ప్రభుత్వమే చేస్తోందని జగన్ తెలిపారు.
రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా కొత్తగా 16 మెడికల్ కళాశాలలను పెట్టేందుకు నిర్ణయించామని, వీటికి అనుమతులివ్వాలని, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని షాకు విజ్ఞప్తి చేశారు. మహిళలు, చిన్నారులపై నేరాలను గణనీయంగా తగ్గించేందుకు తాము తీసుకొచ్చిన దిశ, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు బిల్లులకు వెంటనే ఆమోదం లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
రైతులను చైతన్యపరచండి..
దేశవ్యాప్తంగా వ్యవసాయ చట్టాలపై రైతులు చేస్తున్న ఆందోళనపై చర్చకు వచ్చింది. కొత్త చట్టాలకు సహకరించాలని అమిత్‌షా సీఎంను కోరినట్లు చెబుతున్నారు. ఈ చట్టాలవల్ల రైతులకు కలిగే విస్తృతమైన ప్రయోజనాలపై వారిని చైతన్యపరచాలని సూచించినట్లు చెబుతున్నారు.
అరగంట ముందే..
జగన్ మంగళవారం సాయంత్రం ఐదున్నర గంటలకు ఢిల్లీ చేరుకుని.. ఆరున్నరకు నేరుగా 1-జనపథ్‌లోని తన అధికార నివాసానికి చేరుకున్నారు. అమిత్‌షా అపాయింట్మెంట్ తొలుత రాత్రి 9 గంటలకు ఖరారు కాగా.. అర్ధగంట ముందే.. అంటే రాత్రి 8.30కి వచ్చి కలవాలని ఆయన కార్యాలయం నుంచి సీఎం పేషీ అధికారులకు సమాచారం వచ్చింది. జగన్ సరిగ్గా ఎనిమిదిన్నరకే అమిత్‌షా ఇంటికి చేరుకున్నారు. రాత్రి 8.40 గంటల నుంచి 9.45 గంటల వరకు గంటా ఐదు నిమిషాలు ఆయనతో చర్చించారు.తాజా రాజకీయ పరిణామాలూ చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు.
నేడు ప్రధాని అపాయింట్మెంట్?
ముఖ్యమంత్రి జగన్ బుధవారం ప్రధాని మోదీని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం పేషీ అధికారులు.. ప్రధాని కార్యాలయ అధికారులతో మాట్లాడి అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని సమయం ఇవ్వొచ్చని అంటున్నారు. అంతకుముందే కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ల అపాయింట్మెంట్ కూడా అధికారులు సమయం కోరారు. అయితే వీరి అపాయింట్మెంట్లు ఖరారైతే సీఎం బుధవార ం ఢిల్లీలోనే ఉంటారు. లేదంటే బుధవారం ఉదయమే తిరిగి రాష్ట్రానికి బయల్దేరతారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సీఎం వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, మార్గాని భరత్, సీఎంవో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ కూడా ఢిల్లీ వచ్చారు.
0 comments:
Post a comment