Free vaccination .. Description of which countries have announced
ఉచితంగానే టీకా..ఏయే దేశాలు ప్రకటించాయో వివరణ
జపాన్..
కరోనా వ్యాక్సిన్ వచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా వీటిని ఉచితంగానే పంపిణీ చేస్తామని జపాన్ తాజాగా ప్రకటించింది. కేవలం ప్రకటనే కాకుండా ఇందుకు సంబంధించిన బిల్లును రెండురోజుల క్రితమే ఆమోదించింది. దేశంలోని 12.6కోట్ల మంది పౌరులకు కావాల్సిన టీకా ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది అని ఆ బిల్లులో పేర్కొంది. దీనికి అక్కడి పార్లమెంట్ ఉభయ సభలు కూడా ఆమోదం తెలిపాయి.
ఫ్రాన్స్..
మరికొన్ని రోజుల్లోనే దేశంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆ దేశ ప్రధానమంత్రి జీన్ క్యాస్టెక్స్ వెల్లడించారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా దీన్ని ఉచితంగానే పంపిణీ చేస్తామన్నారు. అయితే, అందరికీ ఒకేసారి కాకుండా మూడు దఫాల్లో వ్యాక్సిన్ పంపిణీ ఉంటుందని వెల్లడించారు.
అమెరికా..
కరోనా తీవ్రతకు అతలాకుతలమవుతోన్న అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వ్యాక్సిన్ మరికొన్ని వారాల్లోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఫైజర్, మోడెర్నా టీకాలు అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలంటూ ఎఫ్డీఏకు దరఖాస్తు చేసుకున్నాయి. వీటికి అనుమతి రాగానే పంపిణీ చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాక్సిన్ను ఉచితంగా ఇస్తారా? లేదా? అనే విషయంపై ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. అయితే, అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన జో బైడెన్ మాత్రం.. వ్యాక్సిన్ను ఉచితంగా అందజేస్తామని ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు. ఇన్స్యూరెన్స్తో సంబంధం లేకుండా ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్ ఉచితంగానే ఇస్తామని ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీనిచ్చారు. జనవరి 20వ తేదీన పదవీ బాధ్యతలు తీసుకున్న అనంతరం జోబైడెన్ తన వ్యూహాన్ని వెల్లడిస్తారు.
నార్వే..
కరోనా వ్యాక్సిన్ వచ్చిన వెంటనే దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ను ఉచితంగానే వేస్తామని నార్వే రెండు నెలల కిందటే ప్రకటించింది. అంతేకాకుండా దేశవ్యాప్త వ్యాక్సినైజేషన్లో దీన్ని భాగం చేస్తామని వెల్లడించింది.
ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ అందించేందుకు భారత్ కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. టీకాను ఆమోదించిన తక్షణమే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుపెడతామని.. తొలుత ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులకు ప్రాధాన్యత కల్పిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. తొలి దశలో దాదాపు 30కోట్ల మందికి టీకాలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధంచేస్తున్నారు. తొలుత దాదాపు కోటి మందికి ఉచితంగా వ్యాక్సిన్ అందించే అవకాశం ఉంది. మరికొన్ని రాష్ట్రాలు కూడా ఉచితంగా అందజేస్తామని ప్రకటించాయి. అయితే, దేశవ్యాప్త టీకా పంపిణీపై త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
0 comments:
Post a comment