Jagan Sarkar shocks village volunteers
గ్రామ వాలంటీర్లకు జగన్ సర్కార్ షాక్
ఏపీ సీఎం జగన్ అధికారం చేపట్టగానే ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. నవరత్నాల పథకాల అమలులో భాగంగా సంక్షేమ లబ్ధిని ఇంటింటికీ అందించే లక్ష్యంతో ఈ వాలంటీర్ వ్యవస్థను చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే 35 ఏళ్ల వయసు నిండిన వారిని ఉద్యోగం నుంచి తొలగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తాజా ఆదేశాలతో వాలంటీర్లకు పెద్ద షాక్ తగిలింది. తాజా ఉత్తర్వుల ప్రకారం 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు వారితోపాటు 35 సంవత్సరాల వయసు నిండిన వారిని తక్షణమే విధుల నుంచి తొలగించాల్సిందిగా గ్రామ వలంటీరు సచివాలయం, వార్డు వలంటీరు సచివాలయం శాఖ డైరెక్టర్, కమిషనర్ జీఎస్.నవీన్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేయడంతో వాలంటీర్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హడావుడిగా వాలంటీర్ల పోస్టులను భర్తీ చేశారు. 50 ఇళ్లకు ఒక వాలంటీరు లెక్కన రాష్ట్రంలో 2.60 లక్షల మందిని గ్రామ, వార్డు వాలంటీర్లను నియమించారు. వీరిలో ఎక్కువ మంది అధికార వైసీపీ గ్రామ, మండలస్థాయి నాయకులతో పాటు ఎమ్మెల్యేల సిఫారసులతో నియమితులైన వారే.
ఇప్పటికే 35 ఏళ్లు నిండి వాలంటీరుగా పనిచేస్తున్న వాలంటీర్లకు సీఎఫ్‌ఎంఎస్ సిస్టమ్ ద్వారా అందించే జీతాలు రావడంలేదు. గత కొంతకాలం నుంచి ఈ అంశం చర్చనీయాంశమైంది. రాజకీయ ఒత్తిళ్లతో నిబంధనలకు విరుద్ధంగా అప్పట్లో వాలంటీర్ల నియామకాలు జోరుగా సాగాయి. అయితే 35 ఏళ్లు నిండిన వారెవరైనా ఉంటే వారిని వెంటనే ఆ విధుల నుంచి తొలగించాల్సిందిగా కమిషనర్ తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. వారిని విధుల నుంచి తొలగించి.. ఆ ఖాళీల భర్తీకి తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశాలు అందాయి. ఈ ఉత్తర్వులు ఖచ్చితంగా అమలైతే ప్రభుత్వ నిబంధనలు ప్రకారం 35 సంవత్సరాల వయస్సు దాటిన వారి సంఖ్య కొన్ని వేలలో ఉండే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులతో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వాలంటీర్లలో ఆందోళన నెలకొంది. నిబంధనలు అనుసరించి 35 సంవత్సరాలు దాటి ఒక్కరోజు ఉన్నా సరే సదరు వాలంటీరును ఉద్యోగం నుంచి తొలగిస్తారు.
0 Comments:
Post a Comment