Post Office saving schemes: పోస్టాఫీసులో డిపాజిట్ చేస్తే ఇన్ని నెలల్లో డబుల్.. స్కీమ్‌ల తాజా వడ్డీ రేట్లు ఇవే..
డబ్బును సాధారణంగా ఎక్కువ మంది బ్యాంకుల్లోనే జమ చేస్తుంటారు. సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్ ఇలా కూడబెట్టుకుంటుంటారు. అయితే పోస్టాఫీసుల్లోనూ రకరకాల స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయని చాలా మందికి తెలియదు. చిన్న మొత్తాల పెట్టుబడి కోసం భారతీయ పోస్టాఫీసులు 9 రకాల సేవింగ్ స్కీమ్స్ అమలు చేస్తున్నాయి. అవి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన(ఎస్ఎస్వై), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(ఎన్ఎస్సీ), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్(ఎస్సీఎస్ఎస్), ఐదు సంవత్సరాల పోస్టాఫీస్ డిపాజిట్ స్కీమ్, కిసాన్ వికాస్ పత్ర(కేవీపీ)తో పాటు మరికొన్ని ఉన్నాయి. అలాగే పోస్టాఫీసులు సేవింగ్స్ ఖాతా సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నాయి.
ఇటీవలే కొన్ని స్కీమ్‌లపై ఇస్తున్న వార్షిక వడ్డీ రేట్లు మారాయి.
కిసాన్ వికాస్ పత్ర(కేవీపీ) కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ చిన్న మొత్తాలు పెట్టే మదుపర్లకు లాభదాయకం. పెట్టిన పెట్టుబడి 124 నెలల్లో డబుల్ అవుతుంది. దీని వార్షిక వడ్డీ రేటు 6.9శాతం. కిసాన్ అని ఉన్నందున ఇది రైతులకు మాత్రమే అని కాదు. ప్రజలందరూ ఈ స్కీమ్‌ను వినియోగించుకోవచ్చు. కిసాన్ పత్ర ద్వారా జమ చేసిన ఆదాయాన్ని ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఉపయోగిస్తుంది. అందుకే ఆ పేరు పెట్టింది. వెయ్యి రూపాయల నుంచి కిసాన్ పత్రాలు అందుబాటులో ఉంటాయి.
సుకన్య సమృద్ధి యోజన(ఎస్ఎస్వై)
ఆడపిల్లలకు భవిష్యత్తులో ఉన్నత విద్య, వివాహంలో తోడ్పడేలా ఈ స్కీమ్ రూపకల్పన జరిగింది. అమ్మాయి పుట్టిన పది సంవత్సరాల లోపు ఎప్పుడైనా ఖాతా తెరిచి ఏడాదికి కనీసం రూ.250, గరిష్టంగా రూ.1.5లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఖాతా తెరిచిన సంవత్సరం నుంచి 14ఏళ్ల పాటు డబ్బు జమ చేయవచ్చు. ఎస్ఎస్వై మెచ్యూరిటీ గడువు 21ఏళ్లు. ఒకవేళ ఆడపిల్లకు ఏడేళ్ల వయసులో ఖాతా తెరిస్తే.. 28 సంవత్సరాల వయసులో పూర్తవుతుంది. ఈ ఖాతా వార్షిక వడ్డీరేటు 7.6శాతం.
సేవింగ్ ఖాతా వార్షిక వడ్డీ 4శాతం
బ్యాంకుల మాదిరే పోస్టాఫీస్లోనూ సేవింగ్స్ ఖాతా తెరిచే సదుపాయం ఉంది. దీని నుంచి ఎప్పుడు కావాలన్నా నగదును విత్డ్రా చేసుకోవచ్చు. ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఒకరి పేరు మీద లేదా ఉమ్మడిగానూ అకౌంట్ తీసుకోవచ్చు. ఇలా సేవింగ్స్ ఖాతాలో ఉంచే మొత్తానికి వార్షికంగా నాలుగు శాతం వడ్డీని పోస్టాఫీసు చెల్లిస్తుంది. ఏటా ఏప్రిల్ 1వ తేదీన వడ్డీ మొత్తం సేవింగ్స్ అకౌంట్లో జమ అవుతుంది.టైమ్ డిపాజిట్ అకౌంట్
బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ లాంటివే పోస్టాఫీసుల్లో ఈ టైమ్ డిపాజిట్ అకౌంట్. నిర్దిష్ట కాలపరిమితితో పోస్టాఫీస్లో సొమ్ము డిపాజిట్ చేసుకోవచ్చు. 1 , 2, 3, 5 సంవత్సరాల వ్యవధి పెట్టుకొని సేవింగ్స్ స్కీమ్ కింద పెట్టుబడి పెట్టొచ్చు. 1-3 మూడు సంవత్సరాలకు 5.5శాతం వడ్డీ రేటును పోస్టాఫీస్ ఇస్తుంది. ఇదే ఐదు సంవత్సరాలకైతే 6.7శాతంగా ఉంటుంది.
ఐదు సంవత్సరాల రికరింగ్ డిపాజిట్
ప్రతి నెలా కొంత మొత్తం పొదుపు చేసుకొని.. ఒకేసారి పెద్ద మొత్తం పొందాలనుకునే వారికి ఈ రికరింగ్ డిపాజిట్(RD) ఎంతో ఉపయోగపడుతుంది. నెలవారీ కొంత మొత్తంలో పెట్టుబడి పెడితే మంచి వడ్డీ రేట్లను పోస్టాఫీస్ ఆఫర్ చేస్తోంది. కొత్త కస్టమర్లకు 5.8శాతం వడ్డీని ఇస్తోంది.
సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్
60ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్ల కోసం ఈ ప్రత్యేక స్కీమ్‌ను ప్రభుత్వం పోస్టాఫీసుల ద్వారా అమలు చేస్తోంది. పదవీ విరమణ చేసిన వారు ఆర్థిక అవసరాల కోసం వడ్డీని పొందేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ ఖాతాలో గరిష్టంగా రూ.15లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఈ స్కీమ్‌ను ఐదు సంవత్సరాలు కొనసాగించొచ్చు. వార్షికంగా 7.4శాతం వడ్డీ పొందవచ్చు.
నెలవారీ ఆదాయ స్కీమ్
ఈ మంత్లీ ఇన్వెస్ట్ మెంట్ పథకం కింద వ్యక్తిగత ఖాతా అయితే రూ.4.5లక్షలను, ఉమ్మడిగా అయితే రూ.9లక్షలు గరిష్టంగా డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ప్రతి నెల ఆదాయాన్ని పొందవచ్చు. దీని వార్షిక వడ్డీ రేటు 6.6శాతం. ఈ పథకం కాలపరిమితి ఐదేళ్లు.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్
చిన్న మొత్తాల్లో పొదుపు చేయాలనుకునే వారి కోసం నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(ఎన్ఎస్సీ) ఎంతో ఉపయోగకరం. కనీసం రూ.100 నుంచి గరిష్టంగా రూ.10వేల వరకు పత్రాలు(సర్టిఫికేట్లు) లక్ష్యమవుతాయి. వీటిని కొనుగోలు చేస్తే వార్షికంగా 6.8శాతం వడ్డీ వస్తుంది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్)
దీర్ఘకాల పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఈ పీపీఎఫ్ ఎంతో ఉపకరిస్తుంది. భవిష్యత్తులో ఏదైనా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే ఈ స్కీమ్ ఎంతో ఉత్తమం. దీని మెచ్యూరిటీ వ్యవధి 15 సంవత్సరాలు. అవసరమనుకుంటే ఐదేళ్ల తర్వాత కూడా విత్డ్రా చేసుకోవచ్చు. ఈ స్కీమ్ కింద ప్రతీ ఏడాది కనీసం రూ.500 డిపాజిట్ చేయాలి. గరిష్టంగా రూ.1.5లక్షల వరకు చేయొచ్చు. ఈ స్కీమ్ వార్షిక వడ్డీ రేటు 7.1శాతం.
0 Comments:
Post a Comment