Jaganna Jeeva Kranti: అధికారంలోకి వచ్చిన తరువాత అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న జగన్ సర్కార్.. నుడు మరో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. జగనన్న జీవ క్రాంతి పథకం పేరుతో అమలు చేయనున్న ఈ పథకం ద్వారా గొర్రెలు, మేకల యూనిట్లు పంపిణీ చేస్తారు. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వయస్సు గల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు ప్రభుత్వ ఆర్థిక సాయంతో రైతు భరోసా కేంద్రాల ద్వారా వీటిని అందజేయనున్నారు. 2.49 లక్షల గొర్రెలు, మేకల యూనిట్లను పంపిణీ చేసేందుకు రూ.1868.63 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఒక్కో యూనిట్లో 14 గొర్రె పిల్లలు లేదా మేక పిల్లలతో పాటు పొట్టేలు లేదా మేకపోతు ఉంటాయి.
రవాణా, బీమా వ్యయం కలుపుకుని వీటి ఖరీదు రూ.75 వేలుగా నిర్ణయించారు.
గొర్రెలలో నెల్లూరు బ్రౌన్, జోడిపి, మాచర్ల బ్రౌన్, విజయనగరం జాతులు, మేకలలో బ్లాక్ బెంగాల్, లేదా స్థానిక జాతులతో నచ్చిన జీవాన్ని లబ్ధిదారులు కొనుగోలు చేయవచ్చు. ఒక్కో లబ్ధిదారునికి ఒక యూనిట్ మాత్రమే పంపిణీ చేస్తారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం అల్లానా ఫుడ్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. నాణ్యమైన, ప్రాసెస్ చేసిన మాంసాన్ని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వీటి పెంపకం ద్వారా భూమి లేని నిరుపేద మహిళలకు ఉపాధి కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ యూనిట్ల కొనుగోలు, పంపిణీ ప్రక్రియలో ఎటువంటి అవినీతి, అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శక విధానాన్ని ప్రభుత్వం రూపొందించింది. మొదటి విడత 2021 మార్చి వరకు 20 వేల యూనిట్లు, రెండవ విడత 2021 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 1,30,000 యూనిట్లు, మూడవ విడత 2021 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు 99,000 యూనిట్లు.. మొత్తం మూడు విడతలుగా ఈ పథకాన్ని అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం వైఎస్ జగన్ నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
తెలంగాణలోని ఇదే తరహా పథకాన్ని సీఎం కేసీఆర్ 2017లో ప్రారంభించారు. ఇది మంచి ఫలితాన్ని ఇచ్చింది. తెలంగాణలో మొత్తం 3.26 కోట్ల జంతువులు ఉన్నట్టు 20వ లైవ్‌స్టాక్ సెన్సెస్‌లో తేలింది. 2012లో ఈ సంఖ్య 2.67 కోట్లు మాత్రమే ఉండగా... జంతువుల సంఖ్యలో 22.21 శాతం పెరుగుదల నమోదైంది.
0 comments:
Post a comment