Eluru Mystrey Disease: ఏలూరు వింత వ్యాధికి కారణం తెలిసింది, ఎయిమ్స్ రిపోర్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధికి కారణం తెలిసింది. దీనికి సంంధించిన రిపోర్టులను ఎయిమ్స్, ఇతర సంస్థలు ప్రభుత్వానికి నివేదిక అందజేశాయి. పురుగుల మందుల అవశేషాలే ఏలూరు వ్యాధికి కారణమని తేల్చాయి. అయితే, అవి మనుషుల శరీరంలోకి ఎలా చేరాయనేదానిపై సమగ్రంగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని నిపుణులు చెప్పారు. దీనిపై ఢిల్లీ ఎయిమ్స్, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ క్రమం తప్పకుండా పరీక్షలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. ఆహారం, తాగునీరు, మట్టి నమూనాలను పరిశీలించాలని, అవసరం అయితే, ప్రతి జిల్లాలోనూ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. దాని ఫలితాల ఆధారంగా మరిన్ని చర్యలు తీసుకోవాలన్నారు.
ఏలూరు లాంటి ఘటనలు మరోచోట జరగకూడదన్నారు. మరోవైపు ఆర్బీకేల ద్వారా సేంద్రీయ ఎరువులతో వ్యవసాయంపై ప్రజల్లో అవగాహన పెంచాలని జగన్ సూచించారు.
ఏలూరును వింత వ్యాధి భయపెట్టింది. సుమారు 650 మంది ఈ వింత వ్యాధి బారిన పడ్డారు. వారిలో ముగ్గురు చనిపోయారు. ప్రజలు ఉన్నట్టుండి ఫిట్స్ వచ్చినట్టు పడిపోయేవారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎప్పుడు, ఎవరు పడిపోతారోననే భయం ఏర్పడింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ వైద్యులతో పాటు కేంద్రం నుంచి కూడా ప్రత్యేక బృందం ఏలూరు వచ్చి అక్కడి పరిస్థితిని పరిశీలించింది. వారి రక్త నమూనాలను పరిశీలించింది. ప్రాథమికంగా వారి శరీరాల్లో సీసం, నికల్ ఉన్నట్టు గుర్తించారు. అవి, సహజంగానే మానవుల శరీరాల్లో కొంత పరిమిత మొత్తంలో ఉంటాయి. కానీ, వింత వ్యాధి పడిన వారి శరీరాల్లో ఇది మోతాదుకు మించి ఉన్నట్టు తేల్చారు. ఇవన్నీ పురుగుల మందుల్లో ఉంటాయి. అంటే, విపరీతంగా పురుగుల మందుల వినియోగం వల్లే ఇలా జరిగి ఉంటుందని భావించారు. తాజాగా, నివేదికల్లో కూడా అదే అభిప్రాయం వెల్లడైంది.ఢిల్లీ ఎయిమ్స్, హైదరాబాద్ లోని NIN, సీసీఎంబీ, WHO లాంటి సంస్థలు శాంపిల్స్ ను పరీక్షిస్తున్నాయి. ఇప్పటికే ప్రజలు అస్వస్థతకు గురైన ప్రాంతాల్లో నీరు, పాలు, కూరగాయలు, ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించిన నిపుణులు వాటిని ల్యాబ్ ల్లో పరీక్షించారు. ప్రస్తుతం ఈ వింత వ్యాధి కేసులు రాకపోయినా, భవిష్యత్తులో మళ్లీ రావొచ్చనే భయం వారిలో వెంటాడుతోంది.
0 Comments:
Post a Comment