CAG report intimidating CPS employees
సీపీఎస్ ఉద్యోగులను భయ పెడుతున్న కాగ్ నివేదిక
ఉద్యోగుల డబ్బులు రూ.663 కోట్లు ప్రభుత్వం వద్దే...
ప్రభుత్వం నిధులు బదలాయించడం లేదు
దీని వల్ల ఉద్యోగుల ప్రతిఫలం రేటులో అనిశ్చితి
సీపీఎస్ విఫలమయ్యే అవకాశం పెరుగుతోంది
కాగ్ 2018-19 ఆడిట్ నివేదికలో తాజాగా హెచ్చరిక
శాసనభకు నివేదిక సమర్పించిన ప్రభుత్వం
రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగుల కోసం 2004 సెప్టెంబరు ఒకటి తర్వాత చేరిన వారికి ఉద్దేశించిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం అమలు విధానం సరిగా లేదని కాగ్ నివేదిక తప్పు పట్టింది. ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన సొమ్ములకు ప్రభుత్వం తమ సొమ్ములు జత చేసి నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ కు జమ చేయాల్సి ఉన్నా ఆ వ్యవహారం సక్రమంగా సాగడం లేదని నిలదీసింది. దీని వల్ల ఉద్యోగులకు సమకూరే ప్రతిఫలం రేటులో అనిశ్చితి ఏర్పడుతోందని స్పష్టం చేసింది. దీంతో మొత్తానికి ఈ పథకమే విఫలమయ్యే అవకాశం పెరుగుతోందని కాగ్ నివేదిక కుండబద్దలు కొట్టింది.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం శుక్రవారం ఈ కాగ్ నివేదికను సమర్పించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై విశ్లేషించిన కాగ్ రెవెన్యూ లోటు, ద్రవ్యలోటులను ప్రభుత్వం తప్పుగా లెక్క కట్టిందని పేర్కొంటూ ఇందుకు కారణాలు విశ్లేషించే క్రమంలో సీపీఎస్ స్కీం ను సరిగా నిర్వహించడం లేదని తేల్చింది.
కాగ్ నివేదిక పేర్కొన్న విషయాలు ఇలా ...
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం నిర్దిష్టమైన చందాలతో కూడిన పింఛను పథకం. ఉద్యోగుల మూలవేతనం, కరవు భత్యం నుంచి ప్రతి నెలా 10శాతం మొత్తాన్ని ప్రభుత్వం వారి వాటాగామినహాయిస్తుంది. అంతే మొత్తాన్ని రాష్ర్ట ప్రభుత్వం జోడించి ఆ మొత్తం నిధులను నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ కు సంబంధిత బ్యాంకు ద్వారా పంపుతుంది.
2004 సెప్టెంబరు ఒకటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ కు రూ.730.64 కోట్లు జమ చేయవలసి ఉంది. ఈ మొత్తంలో రూ.365.21 కోట్లు 2018-19వ సంవత్సరంలో రెండు రాష్ర్టాల మధ్య పంపకం చేయగా అందులో రూ.230.61 కోట్లు ఆంద్రప్రదేశ్ వాటాగా తేల్చారు. ఇంకా రూ.365.43 కోట్లు ఎవరి వాటా ఎంతో పంపిణీ చేయాల్సి ఉందని కాగ్ విశ్లేషించింది.
జాతీయ పింఛను ఖాతాలో 2018 ఏప్రిల్ ఒకటి నాటికి రూ.230.91 కోట్ల ప్రారంభ నిల్వ ఉంది. ఆ ఏడాది ఉద్యోగుల నుంచి వసూలయిన మొత్తం రూ.765.02 కోట్లు. ప్రభుత్వం తన చందాగా రూ.320.58 కోట్లు మాత్రమే ఇచ్చిందని కాగ్ లెక్క కట్టింది.
జాతీయ పింఛను పథకం నిబంధనల ప్రకారం ఉద్యోగుల చందాకు సమంగా ప్రభుత్వ చందా ఉండాలి. ఉద్యోగుల నుంచి రూ.765.02 కోట్లు వసూలు చేస్తే, ప్రభుత్వం కేవలం తన వాటాగా రూ.320.58 కోట్లు మాత్రమే చెల్లించింది. ప్రభుత్వం తన వాటా రూ.444.44 కోట్లు తక్కువుగా చెల్లించింది. ఈ చెల్లింపులు సరైన సమయంలో చేయడం లేదు. ఇలా రాష్ర్ట ప్రభుత్వం నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ కు జమ చేయాల్సిన మొత్తం రూ.663.63 కోట్లుగా లెక్క తేల్చింది. దీని వల్ల ఈ సొమ్ముపై వడ్డీ చెల్లించాల్సిన బాధ్యత రాష్ర్ట ప్రభుత్వంపై పడుతుంది. పైగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం విఫలమయ్యే అవకాశాన్ని పెంచుతున్నట్లయిందని కాగ్ విశ్లేషించింది.
పైగా అకౌంటెంట్ జనరల్ ప్రతి ఉద్యోగికి సంబంధించిన చందా ఖాతాలను సరిగా నిర్వహించడం లేదని, దీని వల్ల ఉద్యోగుల ఖాతాల నుంచి ఎంత వసూలు చేశారనేది కూడా సరిగా నిర్థారించలేని పరిస్థితి ఏర్పడిందని అని కాగ్ పేర్కొంది.
0 comments:
Post a comment