🔳ప్రభుత్వ పాఠశాలల్లో ఎందుకు చేర్పించరు?
ఉపాధ్యాయులను ప్రశ్నించిన కలెక్టరు
ప్రభుత్వ పాఠశాలల్లో ఎందుకు చేర్పించరు?
మాట్లాడుతున్న కలెక్టరు చంద్రుడు
అనంతపురం విద్య: ‘మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో ఎందుకు చేర్పించడం లేదు. ప్రభుత్వ పాఠశాలలకు ప్రైవేట్ పాఠశాలలకు వ్యత్యాసం ఏమిటి? టీచర్లుగా కాకుండా తల్లిదండ్రులుగా సమాధానం చెప్పాలి. మార్పు ఇప్పటి నుంచే ఎందుకు తీసుకురాకూడదు’ అంటూ కలెక్టరు గంధం చంద్రుడు ఉపాధ్యాయులను ప్రశ్నించారు. బుధవారం అనంతపురంలోని అంబేడ్కర్ భవనంలో అనంతపురం, గుత్తి, ధర్మవరం, పెనుకొండ డివిజన్ల పరిధిలోని అన్ని యాజమాన్యాల ప్రభుత్వ పాఠశాలల సాంఘికశాస్త్రం టీచర్లు, మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులతో ఉదయం రెండు, మధ్యాహ్నం రెండు డివిజన్లతో సమీక్ష నిర్వహించారు. మన బడి, నాడు-నేడు, రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. కలెక్టరు వేసిన ప్రశ్నలకు పలువురు ఉపాధ్యాయులు సమాధానం ఇస్తూ.. మౌలిక సదుపాయాలు, అంకితభావం లేకపోవడం, సిలబస్ అమలులో లోపం, ఎక్కువమంది విద్యార్థులు, తక్కువ టీచర్లు ఉండటం, ఇంగ్లిష్ మీడియం లేకపోవడం తదితర కారణాలు చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఎక్కువ అర్హతలున్నా ఎందుకు అటువైపు దృష్టి పెడుతున్నారని కలెక్టర్ ప్రశ్నించారు. నాడు-నేడు ద్వారా సౌకర్యాలు మెరుగుపరుస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జేసీ సిరి, డీఈఓ శామ్యూల్, సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు సమన్వయకర్త తిలక్విద్యాసాగర్, ఉపవిద్యాశాఖాధికారి దేవరాజ్ పాల్గొన్నారు.
0 comments:
Post a comment