🔳బదిలీల పై బంధనాలు!
పోస్టుల బ్లాకింగ్‌ను ప్రశ్నించిన టీచర్లపై బలప్రయోగం.. నిర్బంధాలు
నిరసన అంటే నోటీసులు.. ఖాళీల బ్లాక్‌తో సీనియర్లకు అన్యాయం
వెబ్ కౌన్సెలింగ్‌తో ఎస్‌జీటీలకు సమస్య.. విజ్ఞాపనలు పట్టని మంత్రి
(అమరావతి-ఆంధ్రజోతి):ఉపాధ్యాయ పోస్టుల బ్లాకింగ్.. వెబ్ కౌన్సెలింగ్ విధానంపై గత నెల రోజులుగా ఉపాధ్యాయులు చేస్త్తున్న పోరాటం, ఆందోళనలపై ప్రభుత్వం ప్రతాపం చూపుతోంది. నోరు విప్పుతున్న పంతుళ్లపై బలప్రయోగానికి పాల్పడుతోంది. ఉద్యమబాట పట్టే వారికి ముందస్తుగా నోటీసులు ఇస్తున్నారు. సంఘాల నాయకులను ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అధిక సంఖ్యలో ఖాళీలను బ్లాక్ చేయడాన్ని నిరసించిన పాపానికి బెదిరించడం సర్కారు మార్కు విధానంగా కనిపిస్తోందని అంటున్నారు ఉపాధ్యాయులు.తమ అభిప్రాయాలను తెలిపే టీచర్లను నేరస్థులుగా పరిగణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ల తర్వాత జరుగుతున్న బదిలీల కోసం వేలాది మంది ఉపాధ్యాయులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. దీర్ఘకాలంగా కేటగిరీ-4, మారుమూల ప్రదేశాల్లో పనిచేస్తూ ఇప్పడైనా మెరుగైన పాఠశాలకు వెళ్లాలని కోరుకోవడమే తమ తప్పా? అని ప్రశ్నిస్తున్నారు.
వెబ్ కౌన్సెలింగ్ విధానం వల్ల వేలాది మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని చెప్పినా వినిపించుకోవడం లేదని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. డీఎస్సీల ద్వారా నియమితులయ్యే టీచర్లతో కేటగిరీ-4లోని ఖాళీలను భర్తీచేసుకునే అవకాశం ఉన్నా, ఆ దిశగా సర్కారు ఆలోచన చేయడం లేదని, తమ మాటే నెగ్గాలన్న పంతానికి పోతోందని చెబుతున్నారు. ఇదిలావుంటే, ఖాళీ పోస్టులను అధికసంఖ్యలో బ్లాక్ చేయడం, వెబ్ కౌన్సెలింగ్ విధానాన్ని పరిశీలించాలంటూ వైసీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి స్వయంగా విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేశ్‌కు విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు. వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని లేఖ రాసినా.. మంత్రి పట్టించుకోక పోవడాన్ని టీచర్లు ప్రశ్నిస్తున్నారు.
0 Comments:
Post a Comment