తానా మెచ్చిన సిక్కోలు బాలిక
శ్రీకాకుళం : దేశ ఖ్యాతిని ప్రపంచ నలుదిశలా వ్యాపించేలా చేసిన స్వామి వివేకానందుడి ప్రసంగం యువతను ఆలోచింపజేస్తుంది. ఆయన మాటలు విన్నవారందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. నాడు వివేకానందుడు చికాగోలో చేసిన ప్రసంగాన్ని అదే మాదిరిగా సిక్కోలుకు చెందిన బాలిక తెలుగులో చెప్పింది. తన వాగ్దాటి, హావభావాలతో అవలీలగా ప్రసగించి అమెరికాలోని తానా ప్రతినిధులు కంట పడింది. ఆ చిన్నారే శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తాడివలసకు చెందిన గురుగుబెల్లి ఢిల్లీశ్వరి.
అమ్మఒడి పథకం ప్రారంభం సందర్భంగా గ్రామంలోని స్థానిక జడ్పీ పాఠశాలలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా.. అదే పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న ఢిల్లీశ్వరి వివేకానందుని చికాగో ప్రసంగాన్ని అదే విధంగా తెలగులో వినిపించింది. ఏడాది తర్వాత ఆ ప్రసంగానికి సంబంధించిన వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అది అమెరికాలోని తానా ప్రతినిధుల ప్రశంసలు అందుకుంది. బాలిక ప్రతిభను గుర్తించిన తానా ప్రతినిధులు తక్షణ ప్రోత్సాహకంగా లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు.
దీంతో పాటు బాలికను విద్యాపరంగా ప్రోత్సహించాలనుకున్న తానా ఇంటర్మీడియట్ వరకూ చదివించాలని నిర్ణయించింది. ఈ మేరకు బాలికకు హామీ ఇచ్చింది. ఇటీవల కరోనా మహమ్మారి బారిన పడి ఢిల్లీశ్వరి తండ్రి కన్నుమూశారు. ఈ క్రమంలో తానా చేసిన ఆర్థిక సాయం బాలిక కుటుంబానికి కొండంత అండగా నిలిచింది.
0 Comments:
Post a Comment