వెబ్.. లబ్‌డబ్..
♦తొలి రోజే సాంకేతిక సమస్యలు
♦సక్రమంగా పనిచేయని సర్వర్
♦అన్ని క్యాడర్లకు లింకు రాకపోవటంతో ఆందోళన
♦ఉపాధ్యాయబదిలీ వెబ్ ఐచ్ఛికాల నమోదు ప్రక్రియ ప్రారంభం
🌻ఈనాడు, గుంటూరు: ఉపాధ్యాయ బదిలీల వెబ్ కౌన్సెలింగ్ విధాన ప్రక్రియలో ఐచ్ఛికాల నమోదుకు ప్రభుత్వం శుక్రవారం వెబ్‌లింకును అందుబాటులోకి తీసుకొచ్చింది. బదిలీకి దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు సీనియారిటీ ప్రామాణికంగా తీసుకుని ఈనెల 15లోపు ఐచ్ఛికాలు ఇచ్చుకోవాలని సూచించింది. వాటి ఎంపికలో ఉపాధ్యాయులకు పరిమితులు లేవు. ఎన్ని ఖాళీలు అయినా ఇచ్చుకోవచ్చని స్పష్టం చేసింది. ఆప్షన్ల నమోదులో మొదటి రోజే ఉపాధ్యాయులకు అసౌకర్యం ఏర్పడింది. కొద్దిసేపు సర్వర్ పనిచేయలేదు. అనంతరం పునరుద్ధరించినా అన్ని కేటగిరీలకు సంబంధించిన ఆప్షన్ల నమోదుకు అవకాశం ఇవ్వలేదు. కేవలం గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలకు సంబంధించిన లింకు మాత్రమే ఇవ్వటంతో మిగిలిన వారు ఆందోళన చెందారు. గ్రేడ్-2 ఉపాధ్యాయులకు ఇచ్చిన లింకు సవ్యంగా పనిచేయలేదు. వారు ఆప్షన్లు ఇచ్చుకోవటానికి ప్రయత్నిరచగా అందులో క్లియర్ వేకెన్సీలు, హేతుబద్ధీకరణ వేకెన్సీలకు బదులు పదోన్నతుల పొందిన వారి ఖాళీలు మాత్రమే డిస్ప్లే కావటంతో అయోమయానికి గురయ్యారు. వెబ్సైట్లో ఏ ఆప్షన్ నొక్కినా ప్రమోటీ ఖాళీలు మాత్రమే డిస్ప్లే అయ్యాయని గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులు తెలిపారు. తొలిరోజే ఉపాధ్యాయులకు చుక్కలు కనిపించాయి. ఉదయం తెరుచుకోవాల్సిన సైట్ సాయంత్రానికి తెరుచుకుంది. అది కూడా తప్పులు తడకగా ఉండటంతో తాము 15లోపు ఐచ్ఛికాలు ఎలా నమోదు చేసుకోగలమని ఉపాధ్యాయవర్గం లబోదిబోమంటోంది. మొత్తానికి ఉపాధ్యాయులకు ఏర్పడిన అసౌకర్యాన్ని జిల్లా విద్యాశాఖ యంత్రాంగం, సంఘాలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లటంతో రాత్రికి సమస్యలను పరిష్కరించి సైట్లో అన్ని రకాల ఖాళీలు చూపేలా పునరుద్ధరించటంతో ఊపిరి పీల్చుకున్నారు. స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు, వ్యాయామోపాధ్యాయులు ఐచ్చికాలు ఇచ్చుకోవటానికి వీలుగా వాటికి సంబంధించిన లింకులను శనివారం కల్లా పూర్తిస్థాయిలోకి తీసుకొచ్చే చర్యలు ముమ్మరమయ్యాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.
♦అన్ని పాయింట్లు మీకెలా?
వెబ్ కౌన్సెలింగ్‌లో ఉపాధ్యాయుల సర్వీసుకు ఎన్ని పాయింట్లు వచ్చాయో ప్రతిదీ ఆన్లైన్లో ఉంటుంది. దీంతో అమృతలూరు మండలం తురిమెళ్ల పాఠశాలకు చెందిన ఓ టీచర్‌కు వికలాంగుల కోటాలో కొన్ని సర్వీస్‌పాయింట్లు కలిశాయి. దీన్ని గమనించి కొందరు సహచర ఉపాధ్యాయులు వికలత్వం లేకపోయినా పాయింట్లు ఎలా ఇచ్చారు? ఆ టీచర్‌కు అన్ని ఎలా సాధ్యమయ్యాయని అతనిని ప్రశ్నించటమే కాదు.. జిల్లా విద్యాశాఖకు ఫిర్యాదు చేశారు. సదరు టీచర్ కూడా తనకు పీహెచ్ కోటాలో పాయింట్లు కలిశాయని వాటిని తొలగించాలని శుక్రవారం ఉదయం డీఈవోను కలిసి వినతించారు. మరో టీచర్ విషయయంలో ప్రిఫరెన్షియల్ కేటగిరీ చూపటంలో తప్పులు దొర్లాయి. ఆ టీచర్ కూడా తాను ఆ కేటగిరీ కిందకు రానని తన కేటగిరీని మార్చాలని కోరారు. తప్పిదాలు వెంటనే గుర్తించి ఉపాధ్యాయులు డీఈవో దృష్టికి తీసుకురావటం వల్ల సవరణకు సుగమం అవుతోంది. అయితే వీటి సవరణ ప్రస్తుతం డీఈవో స్థాయిలో లేదు. కమిషనర్ కార్యాలయానికి ఈ ఫిర్యాదులను పంపి పరిష్కరించాల్సిందేనని అధికారులు తెలిపారు.
♦అవే ఖాళీలు..
ఉపాధ్యాయులు కొన్ని ఖాళీలను బ్లాక్ చేయటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. శుక్రవారం అన్ని క్యాడర్లలో ప్రదర్శించిన ఖాళీలకు సంబంధించి ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. గతంలో బ్లాక్డ్ ఖాళీలతో ఏదైతే జాబితా ప్రదర్శించారో దానినే వెబ్సైట్లో అందుబాటులో ఉంచడంతో ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వం తమ వినతిని పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు. జిల్లాలో ఎస్జీటీ ఖాళీలు 2509 ఉండగా వాటిల్లో 791 కనిపించకుండా చేశారు. ప్రస్తుతం 1718 మాత్రమే చూపించారు. స్కూల్ అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయులకు సంబంధించి 209 ఖాళీలు బ్లాక్ చేశారు. 1067 మాత్రమే వెబ్‌లో కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రధానోపాధ్యాయులు ఒకే పాఠశాలలో ఐదు అకడమిక్ సంవత్సరాలు పనిచేస్తే వారిని నిర్బంధ బదిలీ చేయాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లాలో పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు ఇంటీరియమ్ ఆర్డరు ఇచ్చిందని చెబుతున్నారు. దీంతో బదిలీలు ఏ మేరకు జరుగుతాయో వేచి చూడాల్సిందేనని ఉపాధ్యాయవర్గం అంటోంది.
0 comments:
Post a comment