పుట్టి 13 నెలలు కావొస్తున్నా కరోనా మహమ్మారి ఇంకా ప్రభావాన్ని చూపుతూనే ఉంది. గ్లోబల్ గా కేసులు 6.6కోట్లకు, మరణాలు 15లక్షలకు చేరగా, పలు దేశాలు మళ్లీ లాక్ డౌన్ బాటపట్టాయి. భారత్‌లో కేసుల సంఖ్య 1కోటికి చేరువకాగా, ఇప్పటివరకు 1.4లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. విలయాన్ని అడ్డుకునే దిశగా అగ్రదేశాలైన చైనా, రష్యా, బ్రిటన్‌లు మాస్ వ్యాక్సినేషన్లకు సిద్ధమయ్యాయి. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ సైతం కొవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీకి అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం కీలక ప్రకటన చేశారు.
కొవిడ్ విలయంపై అఖిలపక్షం
దేశంలో కొవిడ్ మహమ్మారి పరిస్థితిపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ భేటీలో కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, హర్షవర్ధన్, ప్రహ్లాద్ జోషీ, అర్జున్ రామ్ మేఘవాల్, వి. మురళీధరన్ తోపాటు లోక్ సభ, రాజ్యసభల్లో అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు పాల్గొన్నారు. దేశంలో కరోనా విజృంభించిన తర్వాత కేంద్రం ప్రభుత్వం అఖిలపక్ష బేటీ నిర్వహించడం ఇది రెండోసారి. ముగింపు ప్రసంగంలో ప్రధాని మోదీ.. ఇటీవల తాను జరిపిన వ్యాక్సిన్ టూర్ విశేషాలతోపాటు టీకాల పంపిణీ, వాటి ధరలపై సమగ్ర వివరణ ఇచ్చారు.
వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధం..
భారత్ లో కొవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీకి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని, సైంటిస్టుల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిన వెంటనే.. రాబోయే కొద్ది వారాల్లోనే పంపిణీని మొదలు పెడతామని ప్రధాని మోదీ చెప్పారు. టీకా కార్యక్రమాల్లో సుదీర్ఘ అనుభవం, అతిపెద్ద నెట్ వర్క్ కలిగిన దేశంగా భారత్ లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కూడా విజయవంతం అవుతుందని ఆశిస్తున్నానని, రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతో కోల్డ్ చైన్, లాజిస్టిక్ సపోర్టులను నిర్వహించేందుకు ఇప్పటికే సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వ్యాక్సిన్ ఎప్పుడు ఎక్కడ ఎంత మేరకు ఎవరికి పంపిణీ అవుతున్నదో తెలుసుకునేలా రియల్ టైమ్ సమాచార వ్యవస్థను కూడా రూపొందించామన్నారు.
భారత్‌లో ఎనిమిది వ్యాక్సిన్లు
కొవిడ్ మహమ్మారిని సమర్థవంతంగా నిలువరించగల వ్యాక్సిన్ ను తయారుచేయడలో భారతీయ శాస్త్రవేత్తలు విజయం ముగింట నిలిచారని, కాబట్టే ప్రపంచమంతా ఇవాళ భారత్ వైపు చూస్తున్నదని ప్రధాని మోదీ అన్నారు. భారత్ లో ఇప్పటి వరకు ఎనిమిది వ్యాక్సిన్లు కీలక దశలో ఉన్నాయని, వాటిలో మూడు వ్యాక్సిన్లు వినియోగ దశకు కూడా చేరాయని, అయితే, పూర్తిస్థాయి పరిశీలన, సైంటిస్టులు, డాక్టర్లు ఒకే చెప్పిన తర్వాత మాత్రమే టీకాల పంపిణీ చేపడతామని, బహుశా, రాబోయే కొద్ది వారాల్లోనే ప్రక్రియ మొదలవుతుందని ప్రధాని తెలిపారు. అయితే, కచ్చితంగా ఏ వ్యాక్సిన్ ను భారత్ లో పంపిణీ చేస్తారనేది మోదీ పేర్కొనలేదు. దీనిపై నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆస్ట్రాజెనెకా, ఆక్స్ ఫర్డ్ తో కలిసి సీరం సంస్థ రూపొందించిన కొవిషీల్డ్ వ్యాక్సిన్, రష్యా తయారు చేసిన స్పుత్నిక్ వ్యాక్సిన్లలో ఒకదాన్ని లేదా రెండిటినీ భారత్ కొనుగోలు చేసే అవకాశముంది. ఈ రెండు వ్యాక్సిన్లూ ప్రభుత్వ వినియోగానికైతే తక్కువ ధరకే ఇస్తామని సదరు కంపెనీలు చెప్పడం గమనార్హం. ఇకపోతే,
రాష్ట్రాల భాగస్వామ్యమే కీలకం..
దేశంలో కరోనావైరస్ వ్యాక్సిన్ పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం అత్యంత కీలకమైందని ప్రధాని వ్యాఖ్యానించారు. టీకాల పంపిణీని ఏకపక్షంగా కాకుండా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బృందాలు సంయుక్తంగా నిర్వహిస్తాయని ఆయన స్పస్టం చేశారు. టీకాల పంపిణీలో సుదీర్ఘ అనుభవం దేశానికి మనకు ప్లస్ అవుతుందన్నారు. వ్యాక్సిన్ పంపిణీలో బ్లాక్ మార్కెటీర్లకు, దోపిడీలకు అవకాశం లేకుండా ప్రభుత్వాలే సమర్థవంతంగా పంపిణీ చేస్తాయని భరోసా ఇచ్చారు. ఇక కీలకమైన..
వ్యాక్సిన్ ధరపై మోదీ క్లారిటీ..
రాబోయే కొద్ది వారాల్లోనే సైంటిస్టుల అనుమతితో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభిస్తామన్న ప్రధాని మోదీ.. తొలి విడతలో టీకాలను ఫ్రంట్ లైన్ వారియర్లకు అందజేయబోతున్నట్లు ప్రకటించారు. కరోనాపై పోరులో అగ్రభాగన ఉన్న డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పోలీసులకు ముందుగా టీకాలు వేస్తామని మోదీ చెప్పారు. దశల వారీగా వ్యాక్సినేషన్ ప్రక్రియను విస్తరిస్తూ అవసరమైన అందరికీ టీకాలు వేస్తామన్నారు. అదే సమయంలో వ్యాక్సిన్ పంపిణీ ఉచితం కాబోదని ప్రధాని తన ప్రసంగం ద్వారా తెలిపారు. టీకాకు కచ్చితంగా ధర నిర్ణయిస్తామని, అయితే, ధర ఏమేరకు ఉండాలన్నదానిపై రాష్ట్రాలతో కేంద్రం చర్చిస్తున్నదని, త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందని స్పష్టం చేశారు. దేశంలో అందరికీ వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వరా? అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
0 Comments:
Post a Comment