🔳ఇల్లు.. ఇల్లాలు.. ఉపాధ్యాయిని..
మారిన పరిస్థితుల్లో తల్లుల ద్విపాత్రాభినయం
ఆన్లైన్ తరగతుల్లో పిల్లలకు చేదోడువాదోడు
ఈనాడు - విజయవాడ, న్యూస్‌టుడే - విజయవాడ సిటీ
ఇల్లు.. ఇల్లాలు.. ఉపాధ్యాయిని..
సెలవులు వస్తే చాలు.. పిల్లల అల్లరి భరించలేనంతగా ఉంటుంది. ఎప్పుడు స్కూళ్లు తెరుస్తారా అని చాలా మంది తల్లులు ఎదురుచూస్తుంటారు. కరోనా వ్యాప్తితో దాదాపు 9 నెలల నుంచి పాఠశాలలు తెరవక, పిల్లల ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో గృహిణుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్ఛు ఈ నేపథ్యంలో మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళలు బహుళ నైపుణ్యాలతో కొత్త పాత్ర పోషిస్తున్నారు. ఇంటి పనులతో నిత్యం సతమతమయ్యే తల్లులు.. ఇప్పుడు కొత్తగా ఉపాధ్యాయుల అవతారం ఎత్తారు. గతంలో పరీక్షల సమయంలోనే పిల్లలపై దృష్టి పెట్టేవారు. ఇప్పుడు నిత్యం పర్యవేక్షణ తప్పనిసరిగా మారింది. వారిని ఆన్లైన్ తరగతులకు సిద్ధం చేయడం, పాఠాలు పునశ్చరణ చేయించడం, హోంవర్క్ రాయించడం, పరీక్షలకు తర్ఫీదు ఇవ్వడం వంటి పనులు తప్పనిసరిగా మారాయి. అటు ఇంటి పని.. ఇటు పిల్లల బాధ్యతలను సమన్వయం చేసుకుంటున్నారు. మారిన పరిస్థితులకు తగ్గట్లు కొత్త పాత్రలో ఒదిగిపోతూ పనిభారాన్ని మోస్తున్నారు.
ప్రస్తుతం పాఠశాలలు తెరిచినా కొన్ని తరగతులకే పరిమితమయ్యాయి. చాలామందికి ఆన్లైన్ ద్వారానే క్లాసులు జరుగుతున్నాయి. ఈ విధానం చిన్నారులకు కొత్త కావడంతో కొంత ఇబ్బంది పడుతున్నారు. పాఠ్యాంశాలపై దృష్టి పెట్టలేని పరిస్థితి. దీంతో తల్లులే దగ్గరుండి చూసుకుంటున్నారు. ఉపాధ్యాయులు చెప్పేది ఎంత వరకు అర్థమవుతోంది?, పిల్లల సమస్యలేమిటి?, ఎంత వరకు శ్రద్ధ పెడుతున్నారు? వంటి వాటిని గమనిస్తున్నారు. తరగతులు అయిన తర్వాత చిన్నారులు వెనకబడిన అంశాలపై సంబంధిత టీచర్‌తో ఫోన్లో మాట్లాడుతున్నారు. గతంలో స్కూలు అయిన తర్వాత ట్యూషన్‌కు పంపించే వారు. కొవిడ్ కారణంగా ఎక్కువ మంది పంపడం లేదు. ఇళ్లల్లోనే పిల్లలకు హోంవర్క్ చేయిస్తూ, అర్థం కాని పాఠాలు చెబుతున్నారు. దీని వల్ల గృహిణులకు సాధారణంగా ఉండే ఇంటి పనులతో పాటు ఎక్కువ సమయం బాగోగులు, చదువులకు కేటాయిస్తున్నారు. ఉన్న సమయాన్ని అన్ని పనులకు సర్దుబాటు చేసుకుంటున్నారు.
0 comments:
Post a comment