అమ్మ ఒడి అవస్థలు
♦తెరుచుకోని స్కూల్ లాగిన్‌లు
♦నేటి నుంచి వరుస సెలవులు..
♦రేపటితో అభ్యంతరాలకు గడువు ముగింపు
♦ఆందోళనలో లబ్ధిదారులు..
♦అర్హుల్లో ప్రభుత్వ టీచర్ల పిల్లలు
🌻ఏలూరు ఎడ్యుకేషన్, డిసెంబరు 23: జిల్లాలో అమ్మఒడికి విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పథకానికి అర్హులు, అనర్హులు, నిలుపుదల (విత్‌హెల్డ్) కేటగిరీలుగా మొత్తం మూడు జాబి తాలను విడుదల చేసిన విద్యా శాఖ క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడం లేదు. అనర్హులు, నిలుపుదల జాబితాల్లో వున్న యూనిక్ తల్లులు/సంరక్షకులను ఏ కారణాలపై సంబంధిత జాబితాల్లో ఉంచాల్సి వచ్చిందో స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు ప్రభు త్వ టీచర్ల పిల్లలు అర్హుల జాబితాలో ప్రత్యక్షమవడం విద్యాశాఖ అధికారులనే నివ్వె రపరుస్తోంది. అమ్మ ఒడికి తాము అర్హులమేనంటూ తల్లిదండ్రులు, సంరక్షకులు తమ అభ్యంతరాలతో పాఠశాలలకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. కాని, వీటిని పరిష్కరించే అవకాశాలు లేవు. గురువారం నుంచి శనివారం వరకూ (రెండు ఐచ్ఛిక, ఒక క్రిస్మస్) ఆపైన ఆదివారం సెలవులు రావడంతో పలువు రు హెచ్‌ఎంలు, టీచర్లు పాఠశాలల విధులకు దూరమయ్యే అవకా శాలు ఉండటం మరింత అయోమయానికి కారణమైంది. ఈ నేప థ్యంలో ఈ నెల 25లోగా అనర్హులు, నిలుపుదల జాబితాలపై వచ్చే అభ్యంతరాలను స్వీకరించి వాటిని క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి పరిష్కరిం చడం దాదాపు అసాధ్యమే!
♦అమ్మఒడి సమస్యలు..
జిల్లాలో ఒకటి నుంచి పదో తరగతి వరకూ చదువుతున్న 5,42,747 మంది బాల బాలికలను చైల్డ్ ఇన్‌ఫో డేటాలో చేర్చారు. వీటి ఆధారంగా తల్లులు/సంరక్షకులతో కూడిన మూడు కేటగిరీల జాబితాలను స్కూలు లాగిన్‌లకు, గ్రామ సచివాలయాలకు ప్రదర్శన, అభ్యంతరాల స్వీకరణ నిమిత్తం పంపారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 41,609 మంది విద్యార్థుల్లో 38,263 మంది అర్హులు కాగా, 2,311 మంది అనర్హులు, 699 మంది విత్‌హెల్డ్ జాబితాలోనూ ఉంచారు. స్కూల్ లాగిన్‌లకు పంపిన మూడు జాబితాల్లో అనర్హతకు కారణంపై స్పష్టత ఇవ్వలేదు. దీనివల్ల ఏ కారణంతో తమను అనర్హులుగా చేశారు ? ఆ మేరకు తమ అర్హతలను నిరూపిం చుకునే ధ్రువీకరణ పత్రాలు అందజేయడంపై సంబంధిత లబ్ధిదారులు అయోమయంలో ఉన్నారు. సర్వర్ మొరాయింపుతో స్కూల్ లాగిన్‌లలో జాబితాలు బుధవారం ఓపెన్ కాలేదు. ఈ జాబితాలను ప్రింట్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ ఇవ్వలేదు. ప్రింట్ తీసుకుంటే తప్ప క్షేత్రస్థాయి తనిఖీలకు వెళ్లి పరిష్కరించడం సాధ్యం కాదని హెచ్‌ఎంలు, టీచర్లు చెబుతున్నారు. 5.63 శాతం పాఠశాలలకు సాంకేతిక సమస్యల వల్ల మూడు రకాల జాబితాల్లో ఎవరి పేర్లు ఉన్నాయో, ఎవరి పేర్లు లేవో తెలుసుకునే అవకాశం లేకపోయింది. 5వ తరగతి వరకే ఉండే ప్రాథమిక పాఠశాలలకు పంపిన జాబితాల్లో ప్రస్తుతం 6వ తరగతి చదువుతున్న విద్యార్థులు, హైస్కూళ్లల్లో ఉండాల్సిన 9వ తరగతి విద్యార్థుల పేర్లు ప్రాథమికోన్నత పాఠశాల స్కూల్ లాగిన్‌లో ఉన్నాయి. పలుచోట్ల పైతరగతులకు ఈ ఏడాది ప్రమోట్ అయిన విద్యార్థులను ఇంతకు ముందు చదివిన పాఠ శాలల యాజమాన్యాలు వారిని డ్రాప్ బాక్స్‌లో నమోదు చేయక పోవడమే దీనికి కారణం. కొందరు విద్యార్థులకు గత ఏడా ది నమోదుచేసిన తల్లి పేరుకు, ఈ ఏడాది నమోదు చేసిన తల్లి పేరుకు మార్పులు జరిగాయి. ఇటీ వల పంపిణీ చేసిన విద్యా కానుక కిట్ల అందజేత సమయంలో నిర్ధేశిత తల్లి బదులుగా మరొకరు రావడం, వారి ఐరిస్‌ను నమోదు చేయడం వల్లే ఈ సమస్య తలెత్తిందని గుర్తించారు. స్కూలు లాగిన్‌లకు పంపిన మూడు రకాల జాబితాల్లో పేర్లు లేని విద్యార్థుల వివరాలు చైల్డ్ ఇన్‌ఫోలో ఉన్నాయి. ఇది ఎలా జరిగిందో విద్యాధికారులకు అర్థం కావడం లేదు.
♦టీచర్లూ అర్హులట..!
కామవరపుకోట, కొందరు టీచర్ల పిల్లలు అమ్మ ఒడి అర్హుల జాబితాలో ఉన్నట్లు ఇప్పటి వరకూ గుర్తించారు. ఈ విషయంబయటపడడంతో అప్రమత్తమైన సంబంధిత టీచర్లు దీని నుంచి బయటపడేందుకు తమకు ఈ ఆర్థిక సాయం వద్దని రాత పూర్వకంగా లేఖలు అందజేసినట్లు తెలిసింది. ఈ తరహా కేసులు జిల్లా వ్యాప్తంగా మరికొన్ని ఉండవచ్చునన్న అంచనాతో టీచర్లను సంబోధించకుండా.. అర్హుల జాబితాలో అనర్హులు ఎవరైనా ఉన్నారా ? స్పష్టత ఇవ్వాలని హెచ్‌ఎంలు, ఎంఈవో లను ఆదేశిస్తూ విద్యాశాఖ ఒక ఫార్మేట్‌ను పంపింది. అమ్మ ఒడి అవసరం లేని పిల్లలు వివరాలు ఇవ్వాలని కోరింది.
♦కారు ఉందంటూ కూలీలకు అమ్మ ఒడి దూరం..
ఆకివీడు, డిసెంబరు 23 : రోజంతా కూలి పని చేసుకుంటే గానీ పూట గడవని కుటుంబం వారిది. అలాంటిది మీకు కారుందంటూ.. అమ్మ ఒడి రాదంటూ అధికారులు చెప్పడంతో బాధితులు లబోదిబోమం టున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ఆ పేద కుటుంబం ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమైంది. ఆకివీడు ఉల్వర్థన్‌పేటలో చర్చి పక్కన మోల్లాటి నాగాంజనేయులు, వెంకటరమణ దంపతులు ఉంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. అబ్బాయి ఆరు, ఆమ్మాయి ఐదో తరగతి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. కారు ఉండడం వల్ల అమ్మ ఒడి పథకం వర్తించదని అధికారులు చెప్పడంతో అవాక్కయ్యారు. రెండేళ్ల క్రితం వేలిముద్రలు పడడం లేదంటూ రేషన్ నిలుపుదల చేశారు. ప్రతీ నెలా రేషన్ దుకాణానికి వెళ్లినా వేలిముద్రలు పడడం లేదు. కొత్తకార్డుకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంతో దరఖాస్తు చేసుకుంటే మీకు నాలుగు చక్రాల వాహనం ఉందని ఆన్‌లైన్‌లో చూపిస్తోందని అధికారులు చెప్పారు. కూలి పని చేసుకుని బతుకుతున్న తమకు కారెక్కడిదని అధికారులకు చెప్పగా భీమవరం ఆర్టీవో కార్యాలయానికి వెళ్లి కారు లేదంటూ ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని చెప్పారు. అక్కడకు వెళితే కారు నెంబరు తీసుకొస్తే
కాగితాలు ఇస్తామంటున్నారు. కారు లేనిదే కాగితాలు ఎలా తీసుకొస్తామని బాధితులు వాపోతున్నారు. రేషన్‌కార్డు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలు నష్టపోతున్నామంటున్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. దీనిపై వీఆర్వోతో మాట్లాడగా కారు లేదన్నట్టు సర్టిఫికెట్ లేనిదే తామేమీ చేయలేమని, అయినా ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తామని చెప్పారు.
0 Comments:
Post a Comment