మూడు నెలలు వాడకపోతే రేషన్ కార్డు రద్దు? అసలు వాస్తవం ఇదీ..!
న్యూఢిల్లీ: మూడు నెలల పాటు రేషన్ కార్డు వాడకపోతే అది రద్దయిపోతుందంటూ ఇటీవల పెద్ద ఎత్తున షికారు చేస్తున్న వార్తలపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) స్పందించింది. ఇవన్నీ ''తప్పుడు వార్తలే''నంటూ కొట్టిపారేసింది. వైరల్ అవుతున్న వార్తల ప్రకారం.. ఓ వ్యక్తి ప్రతి మూడు నెలల్లో కనీసం ఒక్కసారైనా రేషన్ కార్డును వినియోగించి సరుకులు తీసుకోవాలి. లేకుంటే వారి రేషన్ కార్డు మురిగిపోతుంది. అయితే పీఐబీ నిజ నిర్ధారణ బృందం (ఫ్యాక్ట్ చెక్ టీం) దీనిపై స్పందిస్తూ... ''మూడు నెలల పాటు రేషన్ కార్డు వాడకపోతే వాటిని రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీచేసిందంటూ కొన్ని మీడియా సంస్థల్లో వార్తా కథనాలు వచ్చాయి.
అయితే ఇది ఓ తప్పుడు వార్త. కేంద్రం అలాంటి మార్గదర్శకాలు ఏవీ ఇవ్వలేదు..'' అని పేర్కొంది. కాగా ఈ ఏడాది మొదట్లో కేంద్రం ''ఒక దేశం- ఒకే రేషన్ కార్డు'' పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లో ఏ ఒక్కరూ ఇబ్బందిపడకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద లబ్ధిదారులు ఎక్కడున్నా అక్కడి స్థానికతతో సంబంధం లేకుండా జాతీయ ఆహార భద్రత చట్టం కింద రేషన్ సరుకులు అందిస్తారు.
0 comments:
Post a comment