🖥️ బదిలీల ఐచ్ఛికాల నమోదుకు గడువు పొడిగింపు
🔹 ఉపాధ్యాయ సంఘాలతో చర్చించే మార్చాం
♦మంత్రి ఆదిమూలపు సురేష్
ఈనాడు , అమరావతి :- ఉపాధ్యాయుల బదిలీల్లో ఐచ్ఛికాల నమోదుకు గురువారం వరకు గడువు పొడిగించినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. సచివాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తప్పనిసరిగా బదిలీకానున్న 26,134 మందిలో 25,129 మంది ఐచ్ఛికాలను నమోదు చేసుకున్నారని, అభ్యర్థన బదిలీల కోసం 49,985 మంది దరఖాస్తు చేసుకోగా.. 46,818 మంది ఐచ్ఛికాలు ఇచ్చారని వెల్లడించారు. బదిలీలపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన తర్వాతనే సవరించిన ఉత్తర్వులు జారీ చేశామని, ఎక్కడా నిబంధనలు అతిక్రమించి వ్యవహరించలేదని వెల్లడించారు. మారుమూల పాఠశాలల్లో నిరుపేద విద్యార్థులు ఉంటారని, ఆ పాఠశాలలు నిర్వీర్యమై పోకూడదనే కొన్ని పోస్టులను బ్లాక్ చేయడం జరుగుతోందని తెలిపారు. ఉపాధ్యాయ బదిలీలను రాజకీయం చేయాలని ప్రతిపక్ష పార్టీలు చూస్తున్నాయని.. లేని సమస్యలను సృష్టించి గందరగోళం చేస్తున్నాయని విమర్శించారు. ఉపాధ్యాయులను అడ్డంపెట్టుకొని రాజకీయం చేయాలని తెదేపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకంపై మంత్రివర్గ ఉపసంఘం, కార్యదర్శులతో కూడిన వర్కింగ్ కమిటీలను ప్రభుత్వం నియమించిందని, బీమా ప్రీమియం, రిస్క్‌లకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులపై ఆక్యురియల్ ఫర్మ్ నివేదిక అందజేసిందని వెల్లడించారు. ఇది ప్రభుత్వ పరిశీలనలో ఉందని పేర్కొన్నారు. అర్హులందరికీ జగనన్న అమ్మఒడి పథకం వస్తుందని, విద్యార్థుల వివరాల నమోదుకు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో త్వరలో సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు.
0 comments:
Post a comment