🔳ఉపాధ్యాయ బదిలీల్లో వెబ్ కౌన్సెలింగ్ విఫలం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపాధ్యాయ బదిలీల్లో వెబ్ కౌన్సిలింగ్ విధానం విఫలమైంది. దీంతో ఎంఇఓ కార్యాలయాల్లో ఆప్షన్లు నమోదు చేసుకోవాలని తాజాగా విద్యాశాఖ సూచించింది. అయితే, దీనిపై కూడా ఉపాధ్యాయులు పెదవి విరుస్తున్నారు. వాస్తవానికి వెబ్ కౌన్సిలింగ్‌పై అనేక సందేహాలు వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు మాన్యువల్ పద్దతిలోనే బదిలీలను నిర్వహించాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఆందోళనలను ప్రభుత్వం తోసిపుచ్చింది. ఒక దశలో విద్యాశాఖ మంత్రి 99 శాతం మంది ఉపాధ్యాయులు వెబ్ ఆప్షన్లు ఇచ్చేశారని కూడా ప్రకటించారు. తాజాగా ఆప్షన్లు నమోదు చేయని ఉపాధ్యాయులు ఎంఇవో కార్యాలయాల్లో ఈ నెల 21,22 తేదీల్లో నమోదు చేసుకోవాలని విద్యాశాఖ కమిషనర్ ప్రకటించారు. ఆప్షన్లు సరిగా నమోదు చేయలేదని భావిస్తున్న ఉపాధ్యాయులు కూడా ఈ నెల 23 నుంచి 30 వరకు ఎంఇవో కార్యాలయంలో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఒక్కొ ఉపాధ్యాయుడు తాను పెట్టిన ఆప్షన్లు చూసుకోవాలంటే సుమారు 4 గంటల సమయం పడుతోంది. ఎంఇఓకు రోజుకు 10 దరఖాస్తులకు అవకాశం కల్పించారు. సర్వర్ సరిగా పనిచేయకపోతే ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఎంఇఓ కార్యాలయాల వద్ద ప్రింట్ అవుట్‌లు తీసి సమర్పించి ఆథరైజేషన్ పొందాలని కమిషనర్ నిబంధన విధించారు. ఒక్కో ఉపాధ్యాయుడు సుమారు 50 పేజీలు ప్రింట్ తీయాలి. అదీ కాక రాష్ట్రంలో రెగ్యులర్ ఎంఇఓలు లేక ఇన్‌చార్జ్‌ల పాలనతో ఆ వ్యవస్థ కునారిల్లుతోంది. మొత్తం 675 మండలాల్లో 350 నుంచి 400 మందే పనిచేస్తున్నారు. 2 నుంచి 3 మండలాలకు ఒక్కరే ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇది కూడా సక్రమంగా జరుగుతుందన్న నమ్మకం కలగడం లేదు.
మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలి
బదిలీల్లో మూడు డిమాండ్లను రాష్ట్రప్రభుత్వం ఉంచాం. మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని, పోస్టులు బ్లాక్ తొలగించాలని, మాధ్యమం మార్పు వల్ల పోస్టులు కోల్పోయిన పాఠశాలలకు పోస్టులు పునరుద్ధరించాలని డిమాండ్ చేశాం. కీలకమైన వీటిని పరిష్కరించకుండా ఏకపక్షంగా బదిలీల ప్రక్రియ నడుపుతున్నారు. ఎంఇఓలే ఉపాధ్యాయుల ఆప్షన్లు పెట్టేలా అప్పజెప్పి దాని అర్ధాన్నే మార్చేశారు. ఈ చర్యలతో ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. బదిలీల్లో అసమానతలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి.
జి నారాయణరెడ్డి ఫ్యాప్టో చైర్మన్,
కె నరహరి సెక్రటరీ జనరల్
0 Comments:
Post a Comment