పశ్చిమగోదావరి జిల్లాలో భయానక పరిస్థితి.. పిట్టల్లా పడిపోతున్న జనాలు.. కారణమిదేనంటున్న వైద్యులు...
Strange disease Eluru : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పడమర వీధి పెద్ద అమ్మవారి గుడి ప్రాంతంలోని చిన్నారులు, పెద్దలకు ఏమైంది..? ఒక్కొక్కరు ఉన్నట్టుండి ఎందుకు పడిపోతున్నారు.. ? ఇప్పటికే రాష్ట్రంలో కరోనా విజృంభించి అల్లకల్లోలం సృష్టించగా.. మళ్లీ ఈ కొత్త వ్యాధి ఏంటి..? ఇదే అక్కడి ప్రజలకు టెన్షన్ పుట్టిస్తోంది. చూస్తుండగానే కళ్లు తిరిగిపడిపోతుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
ఏలూరును వింత వ్యాధి వణికిస్తోంది. ఏలూరులోని పలు ప్రాంతాల్లో ప్రజలు కళ్ల తిరిగి పడిపోతున్నారు. గత రెండు రోజులుగా పడమర వీధి, దక్షిణపు వీధి, కొబ్బరి తోట, గన్ బజార్, శనివారపు పేట ప్రాంతాల్లో ప్రజలు ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోతున్నారు.
కూర్చున్న వారు కూర్చున్నట్లుగానే కింద పడుతున్నారు. ఇలా రెండు రోజుల వ్యవధిలోనే 140 మంది ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. బాధితుల్లో 48 మంది మహిళలు, 25 మంది చిన్నారులు, 35 మంది పురుషులు ఉన్నారు.
కళ్లు తిరిగి పడిపోయిన తర్వాత కొన్ని నిమిషాల తర్వాత వారు తెరుకుంటున్నారు. బాధితుల్లో ఎక్కువగా శ్వాస తీసుకోవడం, తల తిరగడం, కళ్లు మూసుకుపోవడం వంటి లక్షణాలతో కనిపిస్తున్నాయి. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి జనం క్యూ కట్టారు. బాధితుల సంఖ్య పెరిగిపోతూ ఉండటంతో ఆసుపత్రిలోని బెడ్స్ నిండిపోతున్నాయి. దీంతో అధికారులు ప్రత్యేక బెడ్స్‌ను కూడా సిద్ధం చేశారు. రిజర్వ్ స్టాఫ్‌ను కూడా రంగంలోకి దించారు.
ఏలూరులో బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. జిల్లా కలెక్టర్ ఏలూరు మున్సిపల్ ఆఫీస్‌లో ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేశారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో వెంటనే గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అయితే త్రాగునీరు కలుషితం వల్లే ఇలా జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటు ఏలూరు మున్సిపల్ కార్యాలయంలో బాధితల కోసం కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.
అసలు ఎందుకు ఇలా జరుగుతుందనేది మాత్రం ఇప్పటీ వరకు అధికారులు చెప్పలేకపోతున్నారు. బాధితుల నుంచి సేకరించిన బ్లడ శాంపిల్స్ రిపోర్టులు ఇంకా రాకపోవడంతో ప్రజల్లోనూ టెన్షన్ పెరిగిపోతుంది. ప్రజలు కళ్లు తిరిగి పడిపోవడంపై ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి డీసీహెచ్ ఏవీఆర్ మోహన్ స్పందించారు. వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారా ఇలా జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని చెప్పారు. అయితే దీనిపై తుది రిపోర్ట్స్ రావాల్సి ఉందన్నారు. ప్రజలు కంగారు పడాల్సిన పనిలేదని, ఎవరి పరిస్థితి విషమంగా లేదన్నారు.
కోవిడ్ మహమ్మారి సమయంలో ఇలా మూర్చతో పడిపోవడంతో గడగడా వణికిపోతున్నారు. నిన్న ఒక్కరోజే ఏకంగా 80 మంది వరకు సృహ తప్పి కిందపడిపోయారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి ఆళ్లనాని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.
0 comments:
Post a comment