గుడ్ న్యూస్ చెప్పిన కలెక్టర్... త్వరలో జిల్లాకు కరోనా వ్యాక్సిన్
నెల్లూరు కలెక్టర్ చక్రధర్ బాబు జిల్లా ప్రజలకు శుభవార్త చెప్పారు. త్వరలో కోవిడ్ - 19 నిరోధక వ్యాక్సిన్ జిల్లాకు రానుందని తెలియజేశారు. దీనిపై ఆయన కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. కోవిడ్ వ్యాక్సిన్ త్వరలో కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడి నుండి జిల్లాకు రానున్న నేపద్యంలో స్టోరేజీ పాయింట్స్ ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వ్యాక్సిన్ వేసేందుకు గ్రామ స్థాయిలో ఉన్న ఏఎన్ఎమ్ నర్సులు, ఆశ వర్కర్లకు ముందుగానే తగు శిక్షణ ఇవ్వాలని సూచించారు.
వ్యాక్సిన్ వేసే కార్యక్రమం 5 దశల్లో నిర్వహించబడుతుందని, మొదటి దశలో ఆరోగ్య కార్యకర్తలు, డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, ఆయుష్ ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు, ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులకు వ్యాక్సినేషన్ వేయాల్సి ఉంటుందని చెప్పారు. 2వ దశలో కోవిడ్ ఫ్రంట్ వారియర్స్ గా వ్యవహరించిన పోలీసులు, మున్సిపల్ సిబ్బందికి, మూడో దశలో 50 ఏళ్లు పై బడిన వారికి, నాలుగో దశలో 50 లోపు వయసు కలిగిన వారికి, 5వ దశలో మిగతా అందరికీ వ్యాక్సినేషన్ వేయాల్సి ఉంటుందని కలెక్టర్ వివరించారు. జిల్లాలో గ్రామ, పట్టణాల వారీగా డేటా సేకరించాలని, కోవిడ్ వ్యాక్సిన్ రవాణాకు వాహనాలు సిద్దం చేసుకోవాలని ఆదేశించారు.
వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద 24 గంటలూ విద్యుత్ సరఫరా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, జనరేటర్ ను కూడా సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్ వైద్యాధికారులకు ఆదేశాలిచ్చారు. మాస్కులు ధరించడం, శానిటైజర్లు ఉపయోగించడం, భౌతిక దూరం పాటించడం వాటిపై ప్రజల్లో అవగాహన కల్పంచాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్, జాయింట్ కలెక్టర్లు ప్రభాకర్ రెడ్డి, హరేంధిర ప్రసాద్, డిఆర్వో నాగలక్ష్మి, గూడూరు సబ్ కలెక్టర్ గోపాల కృష్ణ... నెల్లూరు, నాయుడుపేట, ఆత్మకూరు, కావలి ఆర్డీఓలు, జిల్లా పరిషత్ సిఈఓ సుశీల, జిల్లా పంచాయితీ అధికారిణి ధనలక్ష్మి పాల్గొన్నారు.
0 comments:
Post a comment