🔳ప్రభుత్వ ఉపాధ్యాయుల పనితీరు మదింపు
ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయుల పనితీరును మదింపు చేస్తామని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ కార్యదర్శి సాంబశివారెడ్డి వెల్లడించారు. ఉపాధ్యాయులు సమయానికి వస్తున్నారా? వారు చెప్పిన పాఠాలు పిల్లలు అర్థం చేసుకుంటున్నారా? అనే అంశాలను పరిశీలిస్తామన్నారు. భవిష్యత్తులో ప్రోత్సాహకాలు, బదిలీల్లో దీన్ని సమీకృతం చేస్తామని తెలిపారు. విజయవాడలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రభుత్వ పాఠశాలల్లో అకడమిక్ ప్రమాణాలు పెంచుతాం. రానున్న రోజుల్లో కమిషన్ ఆధ్వర్యంలో జిల్లాల వారీగా ‘నాడు-నేడు’, విద్యకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తాం. ప్రవేశాలు పెంచేందుకు ఉపాధ్యాయుల్లో ప్రేరణ తీసుకొస్తాం. ప్రైవేటు బడుల్లో ప్రమాణాలు పాటిస్తున్నారా? ఫీజులు ఎలా తీసుకుంటున్నారు? ఉపాధ్యాయులకు ఇస్తున్న వేతనాలపైనా తనిఖీలు నిర్వహిస్తాం...’ అని వివరించారు. రెండో విడత ‘నాడు-నేడు’పై ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందించనున్నామని, మొదటివిడత అమలుపై ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులు, ఇంజినీర్లతో సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పారు. వైస్ ఛైర్‌పర్సన్ శారదారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని, కొన్నిచోట్ల సీట్లు లేవనే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ‘నాడు-నేడే’నని చెప్పారు.
0 Comments:
Post a Comment