ఉద్రిక్తంగా ఉపాధ్యాయుల పికెటింగ్
♦బదిలీల సమస్యలపై డీఈవో కార్యాలయాల ఎదుట ఆందోళనలు
♦నేడు పాఠశాల విద్య కమిషనరేట్ ముట్టడికి పిలుపు
🌻ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయుల బదిలీలను ఆన్లైన్లో కాకుండా మాన్యువల్‌గా నిర్వహించాలని, ఖాళీలన్నింటినీ చూపించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా విద్యాధికారి కార్యాలయాల ఎదుట ఉపాధ్యాయులు గురువారం పికెటింగ్ నిర్వహించారు. ప్రకాశం, కృష్ణా, గుంటూరు, అనంతపురం, విజయనగరం జిల్లాల్లో పికెటింగ్‌లో పాల్గొన్న ఉపాధ్యాయులను పోలీసులు అదుపులోకి తీసుకొని, పోలీస్స్టేషన్లకు తరలించారు. అనంతరం విడిచిపెట్టారు. పికెటింగ్‌కు వెళ్తున్న వారిని కార్యాలయాల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కొంత ఉద్రిక్తత ఏర్పడింది. గుంటూరులో పోలీసులకు ఉపాధ్యాయుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఏలూరు, గుంటూరు, నెల్లూరు, కడపల్లో ఎమ్మెల్సీలు రాము సూర్యారావు, ఏఎస్ రామకృష్ణ, లక్ష్మణరావు, విఠపు బాలసుబ్రహ్మణ్యం, కత్తి నరసింహారెడ్డి ఫ్యాప్టో ఛైర్మన్ కె.బసవలింగారావు, కార్యదర్శి నరసింహారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జోసఫ్ సుధీర్ పాల్గొన్నారు. ఆర్థిక ప్రయోజనం లేని డిమాండ్లను పరిష్కరించడంలోనూ అధికారులు చొరవ చూపడం లేదని కడప పికెటింగ్‌లో పాల్గొన్న ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) ఛైర్మన్ నారాయణరెడ్డి విమర్శించారు. పాఠశాల విద్యా శాఖ కమిషనరేట్‌ను శుక్రవారం ముట్టడించాలని ఫ్యాప్టో నిర్ణయించినట్లు ఛైర్మన్ నారాయణరెడ్డి వెల్లడించారు. శనివారం నుంచి విజయవాడలో నిరవధిక ధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
♦గుంటూరులో ఉద్రిక్తం
కలెక్టరేట్(గుంటూరు), న్యూస్‌టుడే: గుంటూరులో ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు గురువారం చేపట్టిన విద్యాశాఖ కార్యాలయం ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. మూడున్నర గంటలకు పైగా బైఠాయించిన ఉపాధ్యాయులను ఆందోళన విరమించాలని పోలీసులు కోరారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. కొద్దిసేపటి తర్వాత ఏఎస్పీ, డీఎస్పీలు ఆందోళన జరుగుతున్న ప్రాంతానికి వచ్చిన ఉపాధ్యాయ సంఘ నాయకులను, పలువురు ఉపాధ్యాయులను అరెస్టు చేసి ఠాణాకు తరలిస్తున్న సమయంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళన చేస్తున్న వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
♦30 మంది ఫ్యాప్టో నేతలపై కేసు
ఒంగోలు నేర విభాగం, న్యూస్‌టుడే: ఫ్యాప్టో ఆధ్వర్యాన ప్రకాశం జిల్లా ఒంగోలులోని డీఈవో కార్యాలయాన్ని గురువారం ఉపాధ్యాయులు ముట్టడించారు. ఈ సందర్భంగా 30 మంది సమాఖ్య నాయకులపై రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. కొవిడ్ నిబంధనల్ని ఉల్లంఘించి ఒకే చోట పెద్ద సంఖ్యలో గుమిగూడారని, పోలీసు చట్టం సెక్షన్ 30ను ఉల్లంఘించారని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయంలోకి అనుమతి లేకుండా మూకుమ్మడిగా చొరబడేందుకు ప్రయత్నించారని, ప్రభుత్వోద్యోగుల విధుల్ని అడ్డుకున్నారనే అభియోగాలను మోపారు.
0 comments:
Post a comment