📚✍సర్వర్‌కు దక్కని దీవెన
♦రెండు రోజుల్లో ముగుస్తున్న గడువు
♦10 వేల దరఖాస్తులు పెండింగ్
♦ఎదురుచూస్తున్న మరో 20 వేల ఫ్రెష్ విద్యార్థులు
♦రోజుకు 400కు మించి దరఖాస్తులు కాని వైనం
♦ఇప్పటికే రెండుసార్లు పొడిగింపు
🌻ఏలూరు, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనల పథకాలను సర్వర్ సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ నెల రెండో తేదీ నుంచి ప్రారంభమైన ప్రక్రియ మరో రెండు రోజుల్లో ముగుస్తున్నా ఇంకా పది వేలకుపైగా రెన్యువల్ దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. సర్వర్లు మొరా యిస్తుండడంతో రోజుకు 400 మించి దరఖాస్తులు రావడం లేదు. ఈ ప్రకారం మొత్తం పూర్తి కావాలంటే కనీసం మరో 15 రోజులు పడుతుంది.జిల్లాలో జగనన్న వసతి, విద్యా దీవెన పథకం కింద 57,535 మంది విద్యార్థులు ఉన్నట్లు సాంఘిక సంక్షేమశాఖ అధికారులు గుర్తించారు.రెన్యువల్‌లో భాగంగా వీరంతా జ్ఞానభూమి పోర్టల్‌లో వేలిముద్రలు వేయాలి. ఇందుకు జిల్లాలోని 968 గ్రామ, 227 వార్డు సచివాలయాలకు అవకాశం కల్పించారు. మొత్తం దరఖాస్తులు ఈ నెల 19 నాటికి రెన్యువల్ చేయాలి. కాని, అప్పటికి 20 వేలు కూడా పూర్తి కాలేదు. దీంతో గడువును ఈ నెల 31 వరకూ పొడిగించారు. అయినప్పటికీ ఇదే పరిస్థితి. సర్వర్ డౌన్ కావడంతో జ్ఞానభూమి పోర్టల్ సరిగా పనిచేయడం లేదు. దీంతో విద్యార్థులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. జిల్లాలో ఇప్పటికి 46,915 మంది విద్యార్థులు రెన్యువల్ చేసుకోగా ఇంకా 10,620 మంది చేసుకోవాల్సి ఉంది.
♦ఈ ఏడాది 57 వేల మందికే..
కిందటేడాది జగనన్న విద్యా, వసతి దీవెన పథకం కింద 89,313 మంది విద్యార్థులకు ఫీజులు, స్కాలర్ షిప్‌లు అందాయి. వీరికి ఫీజు రీయిం బర్సు మెంటు, జగనన్న వసతి దీవెన కింద రూ.20 వేల స్కాలర్‌షిప్ అందించారు. ఈ ఏడాది ఈ సంఖ్య 57,535కు తగ్గింది. అధికారులు మాత్రం ఫ్రెష్ దరఖాస్తులు మరో 20 వేల వరకూ వస్తాయని చెబుతున్నారు. అయినప్పటికీ మరో 20 వేలు వ్యత్యాసం కనిపిస్తోంది. కిందటేడాది ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులు ఈ పథకాల జాబితాలో ఉన్నారని, అందువల్ల ఆ సంఖ్య 89 వేలకు చేరిందని, ఈ ఏడాది వారిని తొలగించడంతో సంఖ్య బాగా తగ్గిందని చెబుతున్నారు. అన్ని పథకాల్లో కోతలు పెట్టినట్లే ఈ పథకంలోను కోత పెట్టినట్టే కనిపిస్తోంది..!
0 Comments:
Post a Comment